
మెక్‌మోహన్ రేఖను లైన్‌ను భారత్-చైనా మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తూ అమెరికా సెనేట్ పార్టీలకతీతంగా తీర్మానాన్ని ఆమోదించింది. అరుణాచల్ భారత్ అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఇది తనదేనంటున్న చైనా వాదనను తోసిపుచ్చింది. పాలక రిపబ్లికన్ పార్టీ సెనేటర్ బిల్ హగెర్తీ, డెమోక్రాటిక్ సెనేటర్ జెఫ్ మెర్క్‌లీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు చైనా పెనుముప్పుగా పరిణమించిందని.. ఈ పరిస్థితుల్లో భారత్ సహా ఆ ప్రాంతంలోని మిత్రదేశాలన్నిటినీ కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉందని వారు నొక్కిచెప్పారు. గత ఆరేళ్లలో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా మధ్య గల్వాన్ సంక్షోభం సహా పలు ఘర్షణలు జరగడం.. చైనా మొండివైఖరితో ఇప్పటికీ ద్వైపాక్షిక చర్చలు కొలిక్కి రాకపోవడం నేపథ్యంలో అమెరికా సెనేట్ ఈ తీర్మానం చేయడం గమనార్హం. మెక్‌మోహన్ లైన్‌ను భారత్ వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)గా పరిగణిస్తోంది.
మెక్‌మోహన్ లైన్ అంటే అదే..
భారత్‌లోని హిమాలయ ప్రాంతాన్ని, చైనా ఆక్రమిత తూర్పు హిమాలయాలను ఈ మెక్‌మోహన్ లైన్ వేరుచేస్తుంది. ఇదంతా అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతం. 1914లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వ విదేశాంగ మంత్రి సర్ హెన్రీ మెక్‌మోహన్ భారత్-టిబెట్ మధ్య 890 కిలోమీటర్ల పొడవున సరిహద్దు రేఖను ఏర్పరిచారు. భూటాన్ తూర్పు సరిహద్దు నుంచి బ్రహ్మపుత్ర నది మీదుగా టిబెట్ వరకు ఇది విస్తరించి ఉంది. అదే తర్వాతికాలంలో మెక్‌మోహన్ లైన్‌గా స్థిరపడింది. అప్పట్లో సిమ్లాలో బ్రిటిష్ ఇండియా-టిబెట్ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. అరుణాచల్‌లోని తవాంగ్, టిబెట్ తూర్పు ప్రాంతం భారత్‌లో అంతర్భాగమని టిబెటన్లు కూడా అంగీకరించారు. ఆనాడు టిబెట్ స్వతంత్ర దేశం. అయినా సిమ్లా ఒప్పందాన్ని గానీ, మెక్‌మోహన్ లైన్‌ను గానీ చైనా ఇప్పటికీ గుర్తించడం లేదు. టిబెట్ ఎప్పుడూ తన అంతర్భాగమని, తన ఆమోదం లేకుండా చేసుకున్న సిమ్లా ఒప్పందాన్ని అంగీకరించనని అంటోంది.