

హై స్కూలు స్థాయి విద్యార్ధులకు సేవా భారతి నిర్వహించే అభ్యాసికల(ఉచిత ట్యూషన్ సెంటర్ల) నుంచి ఎంపిక చేసిన విద్యార్ధినీ విద్యార్ధులకు ఏప్రిల్ 24వ తేది నుంచి 26వ తేది వరకు మూడు రోజుల పాటు వ్యక్తిత్వ వికాస తరగతులు విజయవాడలోని సత్యనారాయణ పురంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్లో జరిగాయి. ఈ శిక్షణ కార్యక్రమాలలో భాగంగా విద్యార్ధులకు వేద గణితం బోధించారు. ఎంతో కష్టపడి సాధించాల్సిన సమాధానాలు కూడా వేద గణితం ద్వారా చిటికెలో పరిష్కారం అవుతుండడం విద్యార్ధులను సంభ్రమానికి గురి చేసింది. పిల్లలు ఎంతో ఆసక్తిగా ఆ మెళకువలు నేర్చుకున్నారు. తెలుగు మరియు ఆంగ్ల వ్యాకరణ అంశాలు కూడా చక్కగా బోధించారు. పిల్లలలోని చిత్రలేఖనం మరియు ఇతర నైపుణ్యాల విషయంలో పిల్లల అభిరుచి మేరకు వారికి మెళకువలు నేర్పారు. సామూహిక ఆటలు, యోగ వంటి వివిధ అంశాలలో కూడా వారికి శిక్షణ ఇచ్చారు. ఈ అన్ని కార్యక్రమాలలో పిల్లలు ఆద్యంతం ఉత్సాహంగా పాల్గొన్నారు.

సేవా భారతి కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాయి కిషోర్, సెక్రటరీ శ్రీ మాదిరాజు మాధవ, కమిటీ సభ్యులు శ్రీమతి బోయపాటి మాధురి, శ్రీమతి పాటి నాగలక్ష్మి, జి. రామకృష్ణలు వసతి, భోజనం తదితర ఏర్పాట్లు చెయ్యగా ఆరోగ్య భారతి క్షేత్ర సంయోజకులు మరియు ఆరోగ్య మిత్ర అఖిల భారత సంయోజకులు కూడా అయిన డాక్టర్ మురళి కృష్ణ, విజ్ఞాన విహార పాఠశాలల ఉపాధ్యక్షులు శ్రీ సాయి, సేవా భారతి రాష్ట్ర కమిటీ కార్యదర్శి శ్రీ పృధ్విరాజు, 2019 సివిల్స్ లో 524వ ర్యాంకు సాధించిన శ్రీ సవీష్ వర్మ, అమెరికాలోని మిచిగాన్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఘంటసాల పరితర్ష్, AP ట్రాన్స్ కో పి.వో శ్రీ రామచంద్ర తదితరులు వివిధ అంశాలలో పిల్లలకు చక్కటి మార్గదర్శనం చేశారు.

ఈ శిక్షణా తరగతులకు 153 మంది విద్యార్ధినీ విద్యార్ధులు హాజరవగా, 15 మంది అధ్యాపకులు, మరియు 10 మందికి పైగా కార్యకర్తలు పాల్గొన్నారు.






