
కన్యాయాకుమారి సముద్రం మధ్యనున్న తిరువళ్లువర్ విగ్రహ సందర్శనకు సోమవారం నుంచి పర్యాటకులను అనుమతిస్తూ రాష్ట్ర పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ పర్యాటక ప్రాంతమైన కన్నియాకుమారిలో సముద్రం మధ్య 133 అడుగుల ఎత్తులో మలచిన తిరువళ్లువర్ విగ్రహాన్ని 2002 సంవత్సరం జనవరి 1న అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ఆవిష్కరించారు. ఈ విగ్రహం సమీపంలోనే ఏర్పాటై ఉన్న స్వామి వివేకానంద మంటపానికి వెళ్లే పర్యాటకులు, తిరువళ్లువర్ విగ్రహాన్ని కూడా సందర్శిస్తూ వస్తున్నారు. సముద్రం మధ్య ఉన్న విగ్రహం లవణ వాయువులు, వర్షం, ఎండలు తదితరాల వల్ల చెక్కుచెదరకుండా ఉండేలా నాలుగేళ్లకు ఒకసారి రసాయనాల మిశ్రమంతో శుభ్రం చేస్తుంటారు. ఈక్రమంలో గత ఏడాది జూన్‌లో ఐదవ సారి చేపట్టిన పనులకు రాష్ట్రప్రభుత్వం రూ.1.10 కోట్లు మంజూరు చేసింది. గత ఏడు నెలలుగా సాగిన ఈ పనులు పూర్తయిన నేపథ్యంలో, మెరుగులు దిద్దుకున్న విగ్రహ సందర్శనకు జారీ చేసిన అనుమతులతో పర్యాటకులు పెద్దసంఖ్యలో కన్నియాకుమారిలో గుమిగూడారు.





