
ఉత్తరప్రదేశ్: కేసర్‌గంజ్ ధాన్యం మార్కెట్‌లో మసీదు నిర్మాణ పనులపై వివాదం నెలకొంది. సెప్టెంబర్ 10న నిర్మాణ పనుల విషయం తెలుసుకున్న పలువురు వ్యాపారులు, హిందూ సంఘాల సభ్యులు అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారని వారు ఆరోపించారు.
సమాచారం అందుకున్న రైల్వే రోడ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. ముందుజాగ్రత్త చర్యగా నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేసి, అక్కడ పోలీసు బలగాలను మోహరించారు.
మసీదు పైభాగంలో అనుమతి లేకుండా కాంక్రీట్ స్లాబులు వేస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు. నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, పత్రాలను పరిశీలించి వాస్తవాలను స్పష్టం చేయాలని అధికారులను కోరారు.
మీరట్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ బన్సల్ మాట్లాడుతూ.. కేసర్‌గంజ్ మార్కెట్ చాలా పురాతనమైనదని, బ్రిటిష్ కాలం నుంచే అక్కడ మసీదు ఉందని తెలిపారు. అయితే ప్రస్తుతం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ప్రార్థనలకు వస్తున్నారని చెప్పారు.
మరోవైపు హిందూ సంస్థ నాయకుడు సచిన్ సిరోహి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, సమీపంలోని కుటుంబాల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. చట్టపరంగా విచారణ జరిపి నిబంధనల ఉల్లంఘనలు ఉంటే చర్యలు తీసుకోవాలని కోరారు.
అయితే మసీదు యాజమాన్యం ఆరోపణలను ఖండించింది. కొత్త నిర్మాణం చేపట్టడం లేదని, శిథిలావస్థలో ఉన్న మరుగుదొడ్డికి మరమ్మతులు చేస్తున్నామని స్పష్టం చేసింది.
ప్రస్తుతం పోలీసులు ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. నిర్మాణానికి సంబంధించిన పత్రాలు, అనుమతులను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.





