News

పుష్ప ‘గిరి’ ప్రదక్షిణ .. 60 ఏళ్ల తర్వాత పునః ప్రారంభం

1kviews

భాస్కర క్షేత్రముగా, దక్షిణ కాశీగా, హరిహర క్షేత్రముగా పిలవబడుతూ ఐదు నదుల సంగమ క్షేత్రముగా ప్రసిద్ధిగాంచిన పుష్పగిరిలో గిరి ప్రదర్శన చేస్తే సకల దేవతా ప్రదక్షిణ చేసిన ఫలాన్ని పొందుతామని పుష్ప చాలా ఖండంలో ఉన్నదని పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతి స్వామి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైయస్సార్ కడప జిల్లాలోని వల్లూరు మండలంలో పుష్పగిరిలో పవిత్ర పెన్నా నది తీరంలో చెన్నకేశవ స్వామి ప్రధాన దేవునిగా వెలిసి, వైద్యనాధేశ్వరుడు, త్రికూటేశ్వర దేవాలయములకు కలిగి విరుజల్లుతున్న పుష్పగిరి లో 60 సంవత్సరాల తరువాత గిరి ప్రదక్షిణ పునః ప్రారంభమైనది. మార్చి 1న బుధవారం ఉ. 7:46 ని.లకు పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతిస్వామి చేతులమీదుగా వేద పండితులు పూజలు నిర్వహించి, గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద ప్రారంభమై కుమ్మరానిపల్లే వంతెన మూలపాక మీదగా 11 కి.మీ మేరకు గిరి ప్రదర్శనను భక్తులు చేపట్టారు. తమిళనాడులోని అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు విశేష ప్రాచుర్యం ఉన్నది. సరిగ్గా అలాంటితరహాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని వల్లూరు మండలం చెన్నూరు దగ్గరలో పుష్పగిరిలో గిరి ప్రదక్షిణకు నిర్వాహకులు శ్రీకారం చుట్టారు. పుష్పగిరి ధర్మక్షేత్ర పరిరక్షణ సమితి సభ్యులు భారవి, నక్కల వేణుగోపాల్, సత్యనారాయణ, గాంధీ, మునగా సతీష్, సునీల్, ధార్మిక సంఘాల ప్రతినిధులు రెండు మాసాలుగా గిరి ప్రదక్షిణం కోసం ప్రయత్నాలు చేశారు. వాడవాడలా, గ్రామ గ్రామాన పర్యటించి గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత గురించి జనాలకు వివరించారు. రాజకీయ నాయకులు ప్రముఖుల మద్దతును కూడగట్టారు. మెప్పించి ఒప్పించారు. దాతలు కూడా ముందుకు వచ్చారు. అందుకు తగ్గ ఏర్పాట్లు నిర్వాహకులు పూర్తి చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గిరి ప్రదక్షిణ చేశారు.

ఆలయ చరిత్ర ఇదే..
దక్షిణ కాశీగా ప్రసిద్ధి కాంచిన పుష్పగిరి కడప నుంచి కర్నూలు వెళ్లే దారిలో చెన్నూరు సమీపంలో 16 కి.మీ దూరంలో ఎడమవైపు వెళ్లే దారి మార్గంలో పుష్పగిరి ఉన్నది. ఈ క్షేత్రం కొండమీద కొలువై ఉన్నది. కొండకు క్రింది వైపు పుష్పగిరి గ్రామం నిర్మించారు. గ్రామానికి క్షేత్రానికి మద్యం పెన్నా నది ప్రవహిస్తున్నది. శైవులకు వైష్ణవులకు కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్యక్షేత్రం. వైష్ణవులు మధ్య అహోబిలం అని, శైవులు మధ్య కైలాసమని సంబోధిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లో శంకరాచార్య మఠం ఇక్కడ మాత్రమే ఉన్నది.

పేరు వృత్తాంతం..
అమృత భాండాన్ని తీసుకెళ్లే మార్గంలో అడ్డుగా వచ్చిన ఇంద్రుడితో గరుత్మంతుడు పోరాడే క్రమంలో కొన్ని అమృతం చుక్కలు కాంపల్లె సమీపంలో ఉన్న కోనేటి లో పడ్డాయి. కోనేటిలో మునిగిన వారికి యవ్వనంతో పాటుగా అమరత్వమూ సిద్ధిస్తూ ఉండేది సిద్ధించేది. దీంతో దేవతలు శివుని వేడుకున్నారు. శివుని ఆజ్ఞ మేరకు వాయుదేవుడు కైలాసము నుంచి కొండను కొంత భాగాన్ని తెచ్చి కోనేట్లు వేయడంతో అది పుష్పంవలే తేలినది. అప్పటినుంచి పుష్పగిరి అనే పేరు వచ్చినది. పుష్పగిరి సమీపంలో పాపాగ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నా నదిలో కలుస్తాయి. అందుకే పుష్పగిరి ని పంచనది క్షేత్రం అంటారు. పుష్పగిరి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాచీనమైన గురు పరంపరని కలిగి ఉన్నది. అద్వైత సిద్ధాంతాన్ని లోకానికి చాటి చెప్పిన జగద్గురు పుష్పగిరి పీఠము విద్యారణ్యులచే పరమ పవిత్ర స్థలమైన పుష్పగిరిలో స్థాపించబడినది. రుద్ర పాదము, విష్ణు పాదములతో బాసిల్లుతూ 108 శివాలయాలతో, యోగాంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా ఉన్నారు. కష్టాల నుండి గట్టెక్కించే దుర్గమ్మ గ్రామ దేవతగా విరిగిల్లుతున్నది. సమస్త దేవతల నిలయ స్థానముగా వేనోళ్ల పుష్పగిరి శిఖరం కీర్తింపబడినది.

బ్రహ్మోత్సవాలు:
వైద్యనాధేశ్వరుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉన్న పుష్పగిరి లో ఏప్రిల్ 15 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.