News

గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా బీజింగ్ కు వెళ్లిన భారత దౌత్యవేత్తలు

222views

భారత్, చైనా సరిహద్దుల్లో 2020 నుంచీ ప్రతిష్టంభన నెలకొని ఉంది. డోక్లాం, లద్దాఖ్‌లోని గల్వాన్ లోయల నుంచి ఈ వివాదం తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌కు కూడా విస్తరించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులపై తరచూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, గత మూడేళ్లలో తొలిసారిగా భారత విదేశాంగ శాఖలోని సీనియర్ అధికారులు సరిహద్దు వివాదంపై చర్చలు జరిపేందుకు బీజింగ్‌కు వెళ్లారు.

తాజాగా వర్కింగ్ మెకానిజమ్ ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ ఇండియా-చైనా బోర్డర్ అఫైర్స్ (డబ్ల్యూఎంసీసీ) సమావేశానికి హాజరయ్యేందుకు భారత విదేశాంగ శాఖలోని తూర్పు ఆసియా వ్యవహారాల సంయుక్త కార్యదర్శి శిల్పక్ అంబులే బీజింగ్ చేరుకున్నారు.
ప్రస్తుతం బీజింగ్‌కు వెళ్లిన శిల్పక్ అంబులే.. చైనాతోపాటు జపాన్, దక్షిణ కొరియా వ్యవహారాల బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. చైనా విదేశాంగ శాఖ సహాయక మంత్రి హువా చున్యింగ్‌తో కూడా శిల్పక్ చర్చలు జరిపారు. అనంతరం చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. సరిహద్దుల్లో పరిస్థితులతోపాటు రెండు దేశాల మధ్య సంబంధాలను ఇద్దరు నాయకులు సమీక్షించినట్లు పేర్కొంది.

చైనా భాష మాండరిన్‌పై శిల్పక్‌కు మంచి అవగాహన ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇదివరకటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌లు చైనా నాయకులను కలిసినప్పుడు వీరికి ‘‘అఫీషియల్ ట్రాన్స్‌లేటర్’’గా శిల్పక్ వెళ్లారు.

అయితే, తాజా సమావేశంలో ఇద్దరు నాయకులు ప్రధానంగా సరిహద్దు వివాదంపైనే దృష్టి సారించినట్లు ఆ సమావేశం పేరును చూస్తే స్పష్టం అవుతోంది. లద్దాఖ్‌ సెక్టార్‌లో ఇటు భారత్, అటు చైనా 50,000 మందికిపైగా సైనికులను మోహరించాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని యాంగ్సేలో గత డిసెంబరులో ఘర్షణల అనంతరం అక్కడ కూడా మోహరింపులను మరింత పెంచారు.