
భారత్ సాధిస్తున్న అసాధారణ ప్రగతి చూస్తే.. ఎంతతి పెద్ద సమస్యలనైనా ఎదుర్కొనే సత్తా ఆ దేశానికి ఉన్నట్లు కనిపిస్తోందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, గేట్స్ ఫౌండేషన్ స్థాపకులు బిల్‌గేట్స్ తెలిపారు. ప్రపంచానికి భవిష్యత్తుపై భారత్ గొప్ప ఆశను కలిగిస్తోందని ఆయన అన్నారు. తన బ్లాగ్ ‘గేట్స్ నోట్’లో ఈ విషయాలను పేర్కొన్నారు. అనేక విషయాల్లో ప్రపంచానికి స్ఫూర్తిదాయక నాయకత్వం భారత్ అందిస్తోందని కొనియాడారు. ‘‘చేతిలో డబ్బులేదు. చేయడానికి సమయం లేదు. ఈ రెండు సమస్యలనూ ఏకకాలంలో అధిగమించలేమనే భావన మనలో ఉంది. కానీ.. ఈ భావన సరికాదని భారత్ నిరూపించింది. భారత్‌ను చూస్తే భవిష్యత్తుపై నాకు ఆశ కలుగుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమది. అయినా ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచే పనులెన్నో చేయగలుగుతోంది. పోలియాను నిర్మూలించింది. హెచ్‌ఐవీని దాదాపు కట్టడి చేసింది. ఆర్థిక సేవలను విస్తృతపరిచింది’’ అని ఆయన కొనియాడారు.