News

ప్రత్యేక ఖలిస్థాన్‌ దేశాన్ని కోరుకుంటున్నాం – అమృత్‌పాల్ సింగ్

254views

ప్రత్యేక ఖలిస్థాన్ దేశాన్ని తాము కోరుకుంటున్నామని, ఈ లక్ష్యం చెడ్డది కాదని వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల కలిగే భౌగోళిక రాజకీయ ప్రయోజనాల దృష్టితో చూడాలని తెలిపారు.

కిడ్నాప్ కేసులో అరెస్టయిన లవ్‌ప్రీత్ సింగ్ వురపు తూఫాన్‌ ను విడుదల చేయాలంటూ అమృత్‌పాల్ సింగ్ మద్దతుదారులు గురువారం అజ్నాలా పోలీస్ స్టేషన్‌లోకి చొరబడిన సంగతి తెలిసిందే. వీరంతా తుపాకులు, కత్తులను తిప్పుతూ పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. అమృత్‌పాల్ ఖలిస్థాన్ సానుభూతిపరుడు. ఈ నేపథ్యంలో అమృత్‌పాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టయిన వ్యక్తిని (తూఫాన్‌ను) శుక్రవారం సాయంత్రానికి విడుదల చేస్తారని భావిస్తున్నామన్నారు. న్యాయపరమైన కొన్ని లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత విడుదల చేస్తామన్నారని తెలిపారు. తూఫాన్ విడుదలైన తర్వాత స్వర్ణ దేవాలయంలో పూజలు చేస్తారని తెలిపారు.

గ్రామీణ అమృత్‌సర్ పోలీసు సూపరింటెండెంట్ సతీందర్ సింగ్ విలేకర్లతో మాట్లాడుతూ.. కిడ్నాప్ జరిగిన ప్రదేశంలో లవ్‌ప్రీత్ సింగ్ లేనట్లు సాక్ష్యాధారాలను అమృత్‌పాల్ పక్షం చూపించిందని తెలిపారు. ఈ సాక్ష్యాధారాలను న్యాయస్థానంలో సమర్పిస్తామన్నారు. ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయన్నారు.