ArticlesNews

రష్యా-ఉక్రెయిన్‌ యుధంతో భారత్‌కు లాభమే.. ఎందుకంటే?

164views

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో భారతదేశానికి భౌగోళిక రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్‌ అమెరికాతో వాణిజ్య, సైనిక సంబంధాలను భారత్‌ పెంపొందించుకుంటూనే, మరోవైపు రష్యాతోనూ మిలటరీ సంబంధాలను కొనసాగించగలుగుతోంది. తూర్పు-పశ్చిమ ఆసియా, ఇండో-పసిఫిక్‌ భౌగోళిక రాజకీయ అంశాలలో భారతదేశం కీలకంగా మారింది. దీంతో భారత్‌తో సానుకూల వైఖరి అవలంభించాల్సిన అవసరం ఉందని అటు అమెరికా నేతృత్వ కూటమి, ఇటు రష్యా-చైనా కూటమి కూడా గుర్తించాయి. ఫలితంగా మనకు కావాల్సిన మిలిటరీ ఆయుధ సంపత్తిని రెండు కూటముల నుంచి సమకూర్చుకోవడంతోపాటు ముడి చమురునూ రష్యా నుంచి చౌకగా పొందుతోంది. ఇప్పుడు ఇరాన్‌ కూడా రష్యా వైపు మొగ్గుతుండటంతో, రష్యా నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతికి ఇరాన్‌లోని నౌకాశ్రయాలనూ వాడుకునేందుకు భారత్‌కు అవకాశం ఏర్పడింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురును శుద్ధి చేసి ఐరోపా, అమెరికాలకూ భారత్‌ ఎగుమతి చేస్తోంది. ఇది అమెరికా నేతృత్వంలోని దేశాలకు మింగుడుపడనప్పటికీ, అంతిమంగా దేశ ప్రజల ప్రయోజనాలకే తాము ప్రాధాన్యం ఇస్తామని ఎప్పటికప్పుడు భారత్‌ స్పష్టం చేస్తోంది.

రష్యాపై ఐరోపా సమాఖ్య త్వరలో మరిన్ని ఆంక్షలు అమలు చేయనున్న నేపథ్యంలో ఇంధన మార్కెట్‌లో భారతదేశ ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని భారత్‌ ఖండించడం లేదని, రష్యా నుంచి చమురు దిగుమతులు పెంచుకోవడం ద్వారా లాభపడుతోందని ఐరోపా దేశాలు చేస్తున్న విమర్శలను భారత విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌ దీటుగా తిప్పికొడుతున్నారు. భారత్‌ ఒక నెలలో కొనుగోలు చేసే ఇంధనాన్ని ఐరోపా ఒక్క పూటలోనే కొంటోందంటూ ధ్వజమెత్తుతున్నారు.

అంతరిక్షం వైపు కూడా..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో కొత్త కాంట్రాక్టులు వస్తున్నాయి. తమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు బ్రిటన్‌కు చెందిన నెట్‌వర్క్‌ యాక్సెస్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ (వన్‌ వెబ్‌) అదనంగా రూ.వెయ్యికోట్ల విలువైన కాంట్రాక్టులను ఇస్రోకు ఇచ్చింది. గతంలో వన్‌వెబ్‌ సంస్థ రష్యా రాకెట్ల ద్వారానే ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేది. కానీ… బ్రిటన్‌ నుంచి ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో వన్‌వెబ్‌ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు రష్యా నిరాకరిస్తోంది. దీంతో ఆ కాంట్రాక్టులు ఇస్రోకు లభిస్తున్నాయి. అందులో భాగంగా 36 ఉపగ్రహాలను 2022 అక్టోబరు 23న శ్రీహరి కోట నుంచి ప్రయోగించారు. మిగిలిన 36 ఉపగ్రహాలను వచ్చే నెలలో అంతరిక్షంలోకి పంపించే అవకాశం ఉంది. దీనివల్ల ఇతర దేశాలు కూడా ఇస్రో వైపు చూస్తున్నాయని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ పేర్కొన్నారు.