తెలంగాణ రాష్ట్రానికి చెందిన గిరిజన వైద్యురాలు ధరావత్ ప్రీతిని తోటి సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులకు పాల్పడటంతో ఆమె రెండ్రోజుల కిందట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన స్థానిక వైద్యులు ప్రీతీని హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్ధిని ధరావత్ ప్రీతి(26) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు. ఆమెకు వెంటిలేటర్ తోపాటు ఎక్మో సాయంతో చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ ఎంజీఎంలో పీజీ చదువుతున్న ప్రీతి అనే వైద్య విద్యార్థినిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనస్థీషియా విభాగానికి చెందిన ఆమె.. మత్తు ఇంజెక్షన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో ప్రాణాపాయ స్థితిలో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులతోపాటు ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై గురువారం ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ఆసుపత్రికి వచ్చారు. వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆమె తల్లితండ్రులను ఓదార్చారు. ప్రీతిని బతికించాలని దేవుడిని ప్రార్ధించడంతోపాటు వైద్యులను కోరానని గవర్నర్ తెలిపారు. ఈ కేసును సమగ్రంగా విచారించాలన్నారు. ఇక మరోవైపు ప్రీతి శరీరంలోని పలు అవయవాలు పనిచేయడం లేదని, మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచేందుకు చికిత్స అందిస్తున్నామని నిమ్స్ సూపరింటెండెంట్ సత్యనారాయణ చెప్పారు. ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, కార్డియాజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వివరించారు.
ఆత్మహత్యకు కారణాలు ఇవే..
ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనలో విచారణ ముమ్మరమైంది. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలో ప్రొఫెసర్లు డాక్టర్ ఉపేందర్ (జనరల్ సర్జన్), డాక్టర్ సరళాదేవి(గైనిక్), డాక్టర్ బిక్షపతిరావు (జనరల్ మెడిసిన్), అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విశ్వనాథ్ తో నియమించిన కమిటీ విచారణ జరిపి నివేదికను సమర్పించింది. ప్రీతిని ఉద్దేశించి కొన్నాళ్లుగా సామాజిక మాధ్యమాల్లో కించపరిచేలా పోస్టులు పెట్టడం వల్ల ఆమె మనస్తాపానికి గురైందని సమాచారం. వేధింపులపై పైవాళ్లకు ఫిర్యాదు చేసిందని ఆగ్రహించిన సీనియర్లు .. ఆమెను కించపరస్తూ సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు పెట్టారు. రిజర్వేషన్ కోటాలో సీటు వస్తే చదువు విలువ నీకేం తెలుస్తుందన్నట్లు ప్రీతిని ఉద్దేశించి పెట్టిన పోస్టింగ్ ఆమెను మరింత కుంగదీసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై డీఎంఈ రమేశ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. పీజీ స్థాయిలో ర్యాగింగ్ ఉండదని.. అలాంటిది ఏమీ కాదని తోసిపుచ్చారు.
సైఫ్ వేధించినట్లు ఆధారాలు లభ్యం..
సైఫ్ అనే విద్యార్థి వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు తొలి నుంచి వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పటికే సైఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈక్రమంలో ప్రీతిని సైఫ్ వేధింపులకు గురి చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి. సైఫ్ ఫోన్‌ను చెక్ చేసిన పోలీసులకు చాటింగ్‌లో కొత్త విషయాలు వెలుగు చూశాయి. సైఫ్‌ఫై ర్యాగింగ్, వేధింపులతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
పీజీ సీటు రాకుండా ఉన్నా బాగుండేది – ప్రీతి తండ్రి నరేందర్
పీజీ ద్వితీయ సంవత్సరం (అనస్థీషియా) విద్యార్థి సైఫ్ వేధింపులు తట్టుకోలేకనే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని ఆమె తండ్రి, ఏఎ్‌సఐ ధారావత్ నరేందర్ ఆరోపించారు. గత ఏడాది నవంబరు 18న కేఎంసీలో పీజీ (అనస్థీషియా)లో చేరిందని, డిసెంబరు నుంచి సైఫ్ వేధిస్తున్నాడని చెప్పిందన్నారు. ప్రిన్సిపల్, హెచ్‌వోడీ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ర్యాగింగ్ జరగలేదని డీఎంఈ చెప్పడం సమస్యను పక్కదోవ పట్టించడమేనని ఆరోపించారు. తన కూతురు ఘటనకు ముందు రాత్రి డ్యూటీ చేసిందని, భోజనానికి కూడా పంపలేదన్నారు. ఉదయం 8.30 డ్యూటీ దిగుతుందని, కొద్ది నిమిషాల ముందే కూతురి మొబైల్ నుంచి ఫోన్ వచ్చిందన్నారు. ఫిర్యాదు చేయడానికి సమయం లేక తెల్లకాగితంపై సంతకం చేసి ఇచ్చి వచ్చానన్నారు. చేతికి గాయాలు ఉన్నాయని, కచ్చితంగా ఇది హత్యాయత్నమేనన్నారు. ‘నా కూతురిలా మరొకరికి జరగకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఎఫ్‌ఐర్‌లో ఆత్మహత్యాయత్నం కాదు.. హత్యాయత్నం అని మార్చాలి. పీజీ సీటు రాకుంటే తన కుమార్తెకు ఈ పరిస్థితి కాదేమోనని కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఏదైనా శృతిమించకూడదు..
సీనియర్లు జూనియర్లకు మార్గనిర్దేశకులుగా మాత్రమే ఉండాలి తప్పా.. వారిపై అజమాయిషీ చేసేలే ప్రయత్నించకూడదు. సీనియర్లకు ఉన్న అనుభవాన్ని వారి సూచనల ద్వారా జూనియర్లకు కొత్త విషయాలు నేర్పించాలి. కానీ కొందరు సీనియర్లు… జూనియర్ల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఇవన్నీ దగ్గరుండి గమనించి సరిదిద్దాల్సిన హెచ్‌వోడీలు, ప్రొఫెసర్లు పట్టీపట్టనట్లు వ్యవహరించడం వల్లే.. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నం వంటి సంఘటనలు చూడాల్సి వస్తోంది. వరంగల్ ఎంజీఎం, కేఎంసీలో ఇదే జరిగిందని వైద్యవర్గాలు అంటున్నాయి. ఏదైనా శృతిమించకూడదని సీనియర్లు కొన్ని హద్దుల్లో వ్యవహరించాలని తోటి వారిని జూనియర్లను గౌరవించాలని సూచిస్తున్నాయి. దీంతోపాటు లవ్ జీహాద్ పేరుతో కొందరు ముస్లిం యువకులు హిందూ యువతులే లక్ష్యంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని తెలంగాణ రాష్ట్రానికి చెందిన భజరంగ్‌దళ్, ఏబీవీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా మనిషి జీవితం ఎంతో విలువైనది అని తెలియజేసే వైద్యులే ఇలాంటి సంఘటనలకు పాల్పడితే.. సామాన్య ప్రజల్ని ఎవరు కాపాడతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఘటనపై పోలీసులు పాత్ర ఎంతంటే?
సీనియర్ పీజీ వైద్యుడు సైఫ్ వేధిస్తున్న విషయాన్ని డాక్టర్ ప్రీతి తన తండ్రి నరేందర్‌కు వివరించింది. ఆయన ఈ విషయాన్ని వరంగల్ మట్టెవాడ ఏసీపీ, సీఐల దృష్టికి తీసుకెళ్లారు. సంక్షిప్త సందేశాలు పంపారు. కానీ ఆ సమయంలో పోలీసులు కేఎంసీకి వెళ్లి ప్రిన్సిపల్ సమక్షంలో డాక్టర్ ప్రీతితోపాటు వేధించిన సైఫ్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి మందలించి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదని ప్రీతి తండ్రి నరేందర్ చెబుతున్నారు.