ఆర్‌ఎస్‌ఎస్ పేరు కోసం పనిచేయదు.. దేశం కోసం మాత్రమే పనిచేస్తుంది – అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై కొందరు కల్పించిన అభూత కల్పనలు, అపోహలను ‘ఆర్ఎస్ఎస్ ప్రణాళిక-21వ శతాబ్దం కోసం’ పుస్తకం కచ్చితంగా తొలగిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ సునీల్ అంబేకర్ రచించిన ‘ఆర్ఎస్ఎస్ ప్రణాళిక-21వ శతాబ్దం కోసం’ పుస్తకావి ష్కరణ కార్యక్రమం విజయవాడ పుస్తక మహోత్సవంలో శుక్రవారం నిర్వహించారు. గొల్లపూడి మారుతీరావు సాహిత్య వేదికపై జరిగిన ఈ కార్యక్రమంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ పనితీరు, దేశభక్తిని ప్రస్పుటించేలా పుస్తకం ఉందన్నారు. ఏ లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ ఏర్పాటైందో? దేశ వ్యాప్తంగా ఉన్న శాఖలు ఏం చేస్తాయన్నది పుస్తకంలో ఉందన్నారు. శాస్త్రీయ దృక్పథంతో పరిశీలిస్తే ఆర్ఎస్ఎస్ ఆదర్శ భావజాలం ఈ పుస్తక రూపంలో ప్రతి ఒక్కరికీ అర్ధం అవుతుందన్నారు. సమాజ సేవ కోసం ఆరాట పడే ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలని కోరారు. భారతదేశంలో ఈ 21వ శతాబ్దంలో ఎలాంటి పౌర సమాజం ఉండాలి, ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండాలి అనే విషయాలు ఈ పుస్తకంలో చక్కగా వివరించారన్నారు. సీనియర్ జర్నలిస్టు వల్లీశ్వర్ మాట్లాడుతూ… ఆర్ఎస్ఎస్ స్వరూపాన్ని ఆవిష్కరించిన తొలి పుస్తకం ఇదేనన్నారు.
పుస్తక రచయిత సునీల్ అంబేకర్ మాట్లాడుతూ… 2025 నాటికి ఆర్ఎస్ఎస్ ఏర్పాటై 100 సంవత్సరాలు అవుతుందన్నారు. ఏనాడూ పేరు కోసం ఆర్ఎస్ఎస్ తాపత్రయ పడలేదని, దేశ అభివృద్దే ఏకైక ఎజెండాగా పనిచేస్తోందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఎప్పుడూ దేశం బాగుండాలని, దేశాభివృద్ధి జరగాలని కోరుకుంటుందన్నారు. సంఘంలోని ఎంతో మంది సీనియర్ స్వయం సేవకులు.. అనేకమంది యువకులను ప్రోత్సహిస్తూ.. వారికి అన్ని విధాలుగా తోడుంటున్నరన్నారు. ఈ విధంగా సంఘం ఒక కుటుంబంగా విస్తరిస్తుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఎప్పుడూ దేశం గురించి, ఇక్కడి ప్రజల యేగక్షేమాల గురించే ఆలోచిస్తుందన్నారు. యువకులందరూ కలిసి దేశాభివృద్దికి కృషి చేయాలన్నారు. ప్రతి సామాన్య వ్యక్తి కూడా ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం అర్థం చేసుకోవచ్చాన్నారు. సాధారణ వ్యక్తులే ఎన్నో అద్భుతాలు చేస్తారని, వారు తలుచుకుంటే దేశంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టవచ్చన్నారు. ఈ విషయాన్నే ఆర్‌ఎస్‌ఎస్ ఎప్పుడూ నమ్ముతుందన్నారు. ఈ సిద్దాంతం ప్రకారం పనిచేస్తుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఫౌండర్ డాక్టర్ హెగ్డేవార్‌జీ ఆశయాల సాధన దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలన్నారు. ఒక ప్రత్యేక విధానం, ప్రణాళికతో దేశాభివృద్ది కోసం పనిచేస్తున్న ఏకైక సంఘం ఆర్‌ఎస్‌ఎస్ అని తెలిపారు. సంఘం ఓ విధానంతో పనిచేస్తుందన్నారు. 21వ దశాబ్దంలో దేశంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. వాటన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండలన్నారు. చివరిగా ‘ఆర్ఎస్ఎస్ ప్రణాళిక-21వ శతాబ్దం కోసం’ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన వెంకటేశ్వరరెడ్డి, అందుకు సహకరించిన వల్లీశ్వర్‌జీ, పబ్లిషర్ ఎమ్మెస్కో అధినేత విజయకుమార్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచార ప్రముఖ బయ్యా వాసు మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ గురించి ఎవరికైనా అర్థం కావాలంటే సంఘలోకి ముందు ఆ వ్యక్తి ప్రవేశించాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎలాంటి సభ్యత్వం, రాజీనామాలు ఉండవన్నారు. సంఘంలోకి ఎవరు వచ్చినా కుటుంబానుబంధం ఏర్పడుతుందన్నారు. ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఇతర దేశాల్లో ఉండదని.. ఈ దేశంలోనే దానికి పరిష్కార మార్గం ఉందని ఈ విషయాన్ని ‘ఆర్‌ఎస్‌స్ 21వ శతాబ్ధ ప్రణాళిక పుస్తకం’లో అంబేకర్‌జీ విపులంగా వివరించారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వర్థిల్లాలి, జిందాబాబ్ అనే వాల్‌రైట్‌లు ఎక్కడా ఉండవని.. కేవలం భారత్ మాతాకీ జై,, వందేమాతరం అనే నినాదాలు మాత్రమే సంఘ్ సభ్యులు చెబుతారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ గురించి తెలుసుకోవాలంటే కేవలం పుస్తకం మాత్రమే చదివితే సరిపోదని.. సంఘంలోకి ప్రవేశించి కొన్నాళ్లు ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు. కేవలం 26 మంది సభ్యులతో ఏర్పడి ఎటువంటి లిఖిత రాజ్యాంగం లేని సంఘం ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది ఆర్‌ఎస్‌ఎస్ అని ఆయన స్పష్టం చేశారు. దేశ నిర్మాణం, నిజమైన చరిత్రను వెలికితీసే పనిలో నేడు స్వయం సేవకులు ఉన్నారన్నారు. చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలను వెలికితీయాలని ఏబీవీపీ విద్యార్థులు నిరంతంర పోరాటం చేస్తున్నారన్నారు. హిందుత్వం అంటే జాతీయ నినాదమని తెలిపారు. కులాల మధ్య వ్యత్యాసాలను తొలగించడమే ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్య లక్ష్యమన్నారు.
ఎమెస్కో అధినేత విజయకుమార్ మాట్లాడుతూ.. 1963లో త్రివిధ దళాలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌స్, ఇతర సంస్థలతోపాటు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు కూడా మార్చింగ్ చేసే అవకాశం జవహర్‌లాల్ నెహ్రూ కోరారు. దివిసీమ ఉప్పెన సమయంలో కూడా సంఘం అనేక కార్యక్రమాలు చేసింది. ఎలాంటి విపత్తులు వచ్చినా ఆర్‌ఎస్‌ఎస్ ముందుంటుందని తెలిపారు. ప్రపంచంలోనే అనేక సంస్థలు ఉన్నప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. సంఘంలో ఎవరి కులం గురించి ఎవరూ అడగరు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్ కూడా సంఘంలోని సేవకుల్లో ఉన్న క్రమశిక్షణ చూసి ఆశ్చర్యపోయారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో కేవలం సేవకులు మాత్రమే కాదు.. స్వయం సేవికలు కూడా ఉన్నారు. తల్లుల దగ్గర నుంచే వీరు అన్ని విద్యలు నేర్చుకుంటున్నారు.
ఆర్‌ఎస్‌స్ 21వ శతాబ్ధ ప్రణాళిక పుస్తకం తెలుగు అనువాదకులు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ఒక గొప్ప పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ అనువాద ప్రక్రియలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అఖిల భారతీయ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్‌జీ రచించిన ”ఆర్‌ఎస్‌స్ 21వ శతాబ్ధ ప్రణాళిక పుస్తకం” చదివిన వెంటనే ఎంతో ఉత్సాహం, ఆసక్తిని రేకెత్తించాయని తెలిపారు. ఇలాంటి మంచి పుస్తకం మరెందరికో చేరువకావాలనే ఉద్దేశంలో అనువాదం చేసేందుకు సంకల్పించానని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎలాంటి సొంత భావజాలానికి అవకాశం ఇవ్వకుండా.. కేవలం అనువాదం మాత్రమే చేశానని ఆయన వివరించారు.