
మహాశివ రాత్రి పర్వదినానికి సర్వం సిద్ధమైంది. అన్ని శైవాలయా ల్లోనూ భక్తుల తాకిడికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా పంచారామక్షేత్రమైన కుమారరామ భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేశారు. అలాగే దక్షిణకాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణంలోని పాదగయ క్షేత్రం కూడా ము స్తాబైంది. శనిత్రయోదశి, మహాశివరాత్రి పర్వదినాలు కలిసి శనివారం 22 ఏళ్ల తర్వాత ఒకేరోజు కలిసిరావడంతో పాదగయ పుష్కరిణిలో స్నానాలు ఆచరించేందుకు, శనీశ్వరుడికి అభిషేకాల నిర్వహణ, కుక్కుటేశుని దర్శనాలు నిమిత్తం భక్తులు భారీగా తరలివచ్చే అవ కాశం ఉంది. భక్తుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా ప్రత్యేక క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటుచేశారు. పుష్కరిణి వద్ద 12 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉం చారు. లోపలకు వెళ్లే, బయటకు వచ్చే మార్గాలను ప్రత్యేకించారు. గత ఉత్సవాల్లో ఉన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా భక్తులకు ఇబ్బంది కలుగకుండా పోలీసు బందోబస్తు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు రెండు పర్యాయాలు ఏర్పాట్లు పరిశీలించారు. పాద గయ క్షేత్రం మీదుగా వెళ్లే ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రభుత్వాసుపత్రి సెంటర్ నుంచి సామర్లకోట రోడ్డు వెళ్లే వాహనాలను బైపాస్‌రోడ్డు మీదుగా మళ్లించి ఈ రహదారిలో వాహనాల రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. శనివారం రాత్రి వరకూ పిఠాపు రం పట్టణంలోకి ఎటువంటి భారీ వాహనాలు, టిప్పర్లు, లారీలు, గడ్డి ట్రాక్టర్లకు అనుమతి లేదని పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ స్పష్టం చేశారు. కత్తిపూడి నుంచి కాకినాడ వైపు 216వ జాతీయ రహదారిపై (బైపాస్) వెళ్లే వాహనాలు పిఠాపురం పట్టణంలోని పశువులసంత, ఆర్టీసీ కాంప్లెక్సు, చర్చి సెంటర్, చెరుకుల కాలువ, పాతబస్టాండు, ప్రభుత్వాసుపత్రి, చిత్రాడ ఆర్వోబీల మీదుగా వెళ్లాలని ఆయన సూచించారు. ఇక సామర్లకోట కుమార రామ భీమేశ్వరాలయంలో లక్షలాది భక్తులు హజరు కానున్నందున ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రం నలుమూలల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు రాక సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఆలయ పుష్కరిణితోపా టు ముఖద్వారం వద్ద దాతలు సమకూర్చిన జల్లు స్నాన ఘట్టం కూడా భక్తుల కోసం సిద్ధం చేశారు.





