
మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్స వాల్లో భాగంగా జరిగే కల్యాణానికి కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలను ఆలయ ఈవో వెంకటేష్ దంపతులతోపాటు పాలకమండలి చైర్మన్ మోహన్‌రెడ్డి దంపతులు తీసుకొచ్చారు. మహానంది చేరుకొన్న వీరికి ఆలయ ముఖ మంటపం వద్ద ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి, ఆధ్వర్యంలో వేదపండితులు, స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మవార్ల ఆలయాల్లో అర్చకులకు పట్టు వస్త్రాలను ఈవో, చైర్మన్ దంపతులు అందజేశారు. అనంతరం ప్రధాన ఆలయాల్లో మహానందీశ్వరునికి, కామేశ్వరీ దేవికి అభిషేకార్చన పూజలను నిర్వహించారు. ఆలయం ప్రాంగణంలోని కల్యాణ మంటపంలో వీరిని వేదపండితులు శాలువాతో సన్మానించగా ఈవో, స్వామివారి మెమెంటో, ప్రసాదాలు అందజేశారు. ప్రతి ఏడాది మహానంది బ్రహ్మోత్సవాలకు కాణిపాకం ఆలయం నుంచి పట్టు వస్త్రాలను తీసుకొని రావడం ఆనవాయితీ అని ఇందులో భాగంగానే ఈ ఏడాది తీసుకొచ్చినట్లు ఈవో తెలిపారు.





