
శ్రీలంకలో చోటు చేసుకున్న వరుస పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు అక్కడ దద్దరిల్లిపోయింది. ఈ పేలుళ్ల మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 8 పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 320కి పైగానే చేరుకుంది. మృతులలో ఎనిమిది మంది భారతీయులు ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు, 40 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు
కాగా ఈ దాడులను అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చిల్లో ప్రార్థనలు చేసుకుంటున్న క్రైస్తవులపై, హోటళ్లలో ఉన్న పర్యాటకులపై ఉగ్రవాదులు పంజా విసరడం తెలిసిందే. సుమారు ఎనిమిది చోట్ల పేలుళ్లు జరగ్గా 320 మందికి పైగా మృతి చెందారు. 450 మంది వరకు క్షతగాత్రులయ్యారు. అయితే, ఈ దాడులకు ముందే శ్రీలంకను భారత్ హెచ్చరించింది. కొలంబోలోని ఓ చర్చిలో తొలి దాడి జరగడానికి సరిగ్గా రెండుగంటల ముందు భారత నిఘా సంస్థ శ్రీలంక అధికారులతో తన వద్ద ఉన్న సమాచారాన్ని పంచుకుంది. చర్చిలు, ఇతర ప్రార్థన స్థలాలపై దాడులు జరిగే అవకాశం ఉందని భారత్ హెచ్చరించినట్టు శ్రీలంక రక్షణ శాఖ వర్గాలు అంగీకరించాయి. అంతేకాదు, అంతకుముందు రోజు రాత్రి కూడా అప్రమత్తంగా ఉండాలంటూ భారత్ నుంచి సందేశాలు వచ్చినట్టు శ్రీలంక వర్గాలు తెలిపాయి. అయితే, భారత్ హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో శ్రీలంక భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.





