
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి ఉండే డిమాండ్‌ను క్యాష్ చేసుకునేలా కొంతమంది అక్రమర్కులు భక్తులను టార్గెట్ చేస్తున్నారు. తిరుమలకు రవాణాతోపాటు దర్శనం, వసతి, భోజనం కల్పిస్తామంటూ ప్యాకేజీలను కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ఎంతో అదృష్టం ఉంటే కానీ శ్రీవారి దర్శనం లభించని ప్రస్తుత పరిస్థితుల్లో భక్తులు కూడా ఈ ఆఫర్లకు ఆకర్షితులవుతున్నారు. నిజమా కాదా అనే తెలుసుకునే ప్రయత్నంలో కొందరుంటే.. మరికొందరు నగదు చెల్లించి మోసపోతున్నట్టు సమాచారం.
సాధారణంగా శ్రీవారి దర్శనానికి టీటీడీ ప్రతినెలా ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేస్తుంది. అలాగే ప్రతిరోజూ తిరుపతిలో టైంస్లాట్ సర్వదర్శనాన్ని కేటాయిస్తుంది. ఆర్జితసేవలు, అంగప్రదక్షిణ, సీనియర్ సిటిజన్ల కోటానూ టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్’ లేదా ‘టీటీదేవస్థానమ్స్’ అనే మొబైల్ యాప్ ద్వారా విడుదల చేస్తుంది. అయితే ప్రస్తుతం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న టికెట్లు, టోకెన్లు క్షణాల్లో బుక్ అయిపోతున్నాయి. దీంతో దర్శన టికెట్లు లభించని భక్తులు వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తుంటారనే పాయింట్ ఆధారంగా కొంతమంది అక్రమాలకు తెరతీసి భక్తులను మోసగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ సంస్థ పేరుతో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. చెన్నై ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో తీసుకువెళతామని, అక్కడి నుంచి కారులో తిరుమలకు తీసుకెళ్లి బస కల్పించడంతో పాటు వీవీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని, దీనికోసం ఒకరికి రూ.98,999 చెల్లించాలని పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. అలాగే తిరుమల, తిరుపతి క్షేత్రదర్శనం-నిత్యాన్నదాన ట్రస్ట్ పేరుతో ఏడాదిలో ఏడుసార్లు శ్రీవారి దర్శనం కల్పిస్తామని, ఈ ఏడురోజులు వసతి కల్పించడంతోపాటు తిరుమల-తిరుపతికి బస్సు టికెట్లను కూడా అందజేస్తామని ఓ సంస్థ పెట్టిన పోస్టు కూడా వైరల్‌గా మారింది.. ఈ ప్యాకేజ్ ఒకరికి రూ.9,999గా నిర్ణయించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. చాలా మంది భక్తులు ఈ పోస్టులు చూసి ఆయా నంబర్లను సంప్రదించి మోసపోతున్నట్టు తెలుస్తోంది. నిత్యం పెరిగిపోతున్న ఇలాంటి పోస్టులను అరికట్టేందుకు టీటీడీ విజిలెన్స్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. భక్తులను మోసగించడంతోపాటు టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ సీవీఎస్వో నరసింహకిషోర్ తెలిపారు.





