News

ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌… అయోధ్య రామాలయ నిర్మాణానికి మద్దతుగా నిలిచిన వకీల్‌సాబ్‌!

255views

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా కన్నడిగుడు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నియమితులవడంపై కర్ణాటకలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రిటైరైన ఐదు వారాలకే గవర్నర్‌ పదవిని ఆయన పొందారు. ప్రధానంగా అయోధ్యలో రామాలయం నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన ఉన్నారు. ఆయన గత నెల 4వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీవిరమణ చేసిన సంగతి తెలిసిందే. కోస్తా కర్ణాటకలోని బెళువాయిలో 1958 జనవరి 4న ఆయన జన్మించారు. మూడబిదరిలోని మహావీర కాలేజీలో బీకాం పూర్తిచేశారు. మంగళూరు (కొదియాల్‌బెయిల్‌) శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర (ఎస్‌డీఎం) లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1983 ఫిబ్రవరి 18న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. 2003 మేలో అదే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, మరుసటి ఏడాది సెప్టెంబరులో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అప్పట్లో ఏ హైకోర్టుకూ చీఫ్‌ జస్టి్‌సగా పనిచేయకుండా నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ముగ్గురు జడ్జిల్లో ఈయనా ఒకరు. 2017లో ట్రిపుల్‌ తలాక్‌ కేసును నిషేధిస్తూ 3:2 మెజారిటీతో తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ నజీర్‌ కూడా ఉన్నారు. అయితే ఈయన ట్రిపుల్‌ తలాక్‌ సంప్రదాయాన్ని సమర్థిస్తూ తీర్పు ఇవ్వడం గమనార్హం. ఈ ధర్మాసనంలో ఈయనొక్కరే ముస్లిం. అయోధ్యలో బాబ్రీమసీదు-రామజన్మభూమి స్థలం హిందువులకే చెందుతుందని తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలోనూ జస్టిస్‌ నజీర్‌ ఉన్నారు. మసీదు అడుగున హిందూ దేవాలయం ఉందని భారతీయ పురావస్తు సర్వే విభాగం ఇచ్చిన నివేదికను ఆయన సమర్థించారు. రామాలయ నిర్మాణానికి అనుకూలంగా 2019లో 5-0 మెజారిటీతో ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చిన నాటి రాజ్యాంగ ధర్మాసనంలోనూ ఉన్నారు. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని.. ఉన్నత పదవుల్లో ఉన్నవారి వాక్‌స్వాతంత్య్ర, భావ వ్యక్తీకరణ హక్కుపై అదనపు ఆంక్షలు పెట్టలేమని పేర్కొంటూ తీర్పులిచ్చిన ధర్మాసనాల్లోనూ జస్టిస్‌ నజీర్‌ కీలక భాగస్వామి. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌నూ సమర్థించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆయన సారథ్యంలోని ధర్మాసనం 4:1 మెజారిటీతో సమర్థించిన విషయం తెలిసిందే.

పలువురి ప్రశంసలు..
జస్టిస్‌ నజీర్‌ నిరాడంబరతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ బహుధా ప్రశంసించారు. గత నెలారంభంలో ఆయన పదవీవిరమణ రోజున చీఫ్‌ జస్టిస్‌ మాట్లాడుతూ.. 2019 వరకు జస్టిస్‌ నజీర్‌కు పాస్‌పోర్టు కూడా లేదన్నారు. అప్పటికి కొన్ని వారాల క్రితమే మాస్కోకు ప్రయాణించాల్సి వచ్చినందున తొలిసారిగా పాస్‌పోర్ట్‌ తీసుకున్నారని తెలిపారు. నిరాడంబర జీవనం సాగించే ఆయన వద్ద గుర్తింపు కార్డు మినహా ఇతర కార్డులు ఉండేవి కావన్నారు. జస్టిస్‌ నజీర్‌ రిటైర్మెంట్‌ తర్వాత గవర్నర్‌ కావడం సంతోషదాయకమని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అన్నారు.