News

చైనాతో సంబంధాలున్న బెట్టింగ్, లోన్ యాప్స్ భారత్ ఉక్కుపాదం.. కారణం ఇదే!

276views

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో దేశంలో కార్యకలాపాలను నిర్వహిస్తోన్న 200లకు పైగా యాప్స్ ను నిషేధించింది. ఈ నిషేధ ప్రక్రియను తక్షణమే చేపట్టింది. ఈ మేరకు కేంద్ర హోం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధానికి గురయ్యే జాబితాలో 138 బెట్టింగ్ యాప్స్, 94 లోన్ యాప్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆయా యాప్స్ అన్నీ విస్తృతంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తోన్నాయి. ఆ యాప్స్ వల్ల ప్రజల వ్యక్తిగత సమాచారం, దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు చైనాకు చేరుతోన్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది. దీనికి సంబంధించిన కీలక సాక్ష్యాధారాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు పంపించింది.

ఇప్పటికిప్పుడు.. అత్యవసరంగా ఆయా యాప్స్ అన్నింటినీ నిషేధించాలని కేంద్రం సూచించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి దీనికి సంబంధించిన ప్రతిపాదనలు అందిన వెంటనే నిషేధ ప్రక్రియను ప్రారంభించింది ఐటీ శాఖ. ఆయా యాప్స్ అన్నీ కూడా దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు విఘాతం కలిగించే పరికరాలను కలిగి ఉన్నాయని తెలిపింది. అలాంటివి వినియోగించడం ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 69కు విరుద్ధమని పేర్కొంది.

బెట్టింగ్, లోన్ యాప్స్ పై పలు రాష్ట్రాలు నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ ను కూడా ఏపీ ప్రభుత్వం ఇదివరకే నిషేధించిన విషయం తెలిసిందే. బెట్టింగ్ పైనా నిషేధం ఉంది. కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019, కేబుల్ టీవీ నెట్‌వర్క్ కంట్రోల్ యాక్ట్ 1995, ఐటీ నిబంధనలు 2021 ప్రకారం ఈ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్ తో పాటు వాటి అనుబంధ కార్యకలాపాలపై నిషేధం ఉంది. ఆయా చట్టాలకు అనుగుణంగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది.