
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మత మార్పిడులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మత మార్పిడులకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టం 2020 నవంబర్ నుంచే యూపీలో అమల్లో ఉందని చెబుతూనే.. ఎవరినీ బలవంతంగా మతం మార్చరాదని, అలా చేస్తే పదేళ్ల జైలు శిక్ష తప్పదన్నారు. అయితే వివిధ ప్రలోభాల కారణంగా ఇతర మతాల్లోకి వెళ్లిన వారు హిందూ మతంలోకి రావాలనుకుంటే స్వేచ్ఛగా రావొచ్చన్నారు. ఘర్ వాపసీ చేసుకునేవారు తిరిగి హిందువులుగా జీవించవచ్చన్నారు. వారిపై మత మార్పిడులకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టం వర్తించదని చెప్పారు. మహారాష్ట్ర జల్‌గావ్ జిల్లా జామ్‌నెర్‌లో జరుగుతున్న బంజారా కుంభ్ 2023 కార్యక్రమంలో ఈ సందర్బంగా ఆయన ప్రసంగించారు. కులాన్ని, ప్రాంతీయవాదాన్ని పక్కనపెడితే ప్రపంచంలో ఏ శక్తీ కూడా భారత్ పురోగతిని అడ్డుకోలేదని యోగి చెప్పారు. ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ సభలో యోగి మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మమంటే మానవత్వమని చెప్పారు. అంతకు ఒక రోజు ముందే యోగి సనాతన ధర్మమే భారత జాతీయ ధర్మమని, బ్రాహ్మణులను, గోవులను కాపాడాలన్నారు. గతంలో విధ్వంసానికి గురైన పవిత్ర మందిరాల పున: స్థాపన జరగాలని రాజస్థాన్ జాలౌర్‌లో జరిగిన సభలో ప్రసంగిస్తూ చెప్పారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం జరుగుతుందని, వచ్చే ఏడాది ఈ సమయానికి అందరూ శ్రీరాముడిని దర్శించుకోగలుగుతామన్నారు. దేశంలో విధ్వంసానికి గురైన అన్ని దేవాలయాలను మళ్లీ నిర్మించాలని యోగి పిలుపునిచ్చారు.





