News

లవ్‌ జీహాద్‌, ల్యాండ్‌ జీహాద్‌కు వ్యతిరేకంగా ముంబయిలో భారీ ర్యాలీ..! ర్యాలీలో బాలలు సైతం పాల్గొని నినాదాలు?

512views

దేశ ఆర్థిక రాజధాని ముంబయితోపాటు, మహారాష్ట్ర వ్యాప్తంగా హిందువుల భూముల ఆక్రమణలు, హిందూ యువతులను ప్రేమ పేరుతో మోసం చేయడం వంటి సంఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ముంబయి నగరంలో హిందువులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ముస్లింలు హిందువుల భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం, హిందూ యువతులను ప్రేమ పేరుతో తీసుకెళ్లిపోయి, మతం మార్చుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసన ర్యాలీలో అనేక హిందూ సంస్థలు, వాటి మద్దతుదారులు, సాధారణ ప్రజానీకం ఆదివారం ఉదయం ముంబయిలోని శివాజీ పార్క్ వద్ద తమ నిరసన గళాన్ని వినిపించారు. ఈ ర్యాలీలో చిన్నారులు కూడా పాల్గొన్నారు.. సకల హిందూ సమాజం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మీనాతాయ్ థాకరే విగ్రహం నుంచి ప్రభాదేవి కామ్‌గార్ మైదానం వరకు ఈ ప్రదర్శన నిర్వహించారు. లవ్ జీహాద్, ల్యాండ్ జీహాద్‌లకు వ్యతిరేక నినాదాలతో కూడిన బ్యానర్లను వారు ప్రదర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులను మేలుకొలిపే నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు.

ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ.. లవ్ జీహాద్ గ్రామాలతోపాటు, నగరాల్లో కూడా ఎక్కువైందని తెలిపారు. ఈ సంస్కృతి తమ ఇళ్లలోకి రాకూడదని కోరుకుంటున్నామన్నారు. లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చాయని, మహారాష్ట్రలో కూడా అటువంటి చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. అసలు ప్రేమ అనే పదానికి అర్థం చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రేమించుకున్న వారి మధ్య గొడవ జరిగితే.. వెంటనే ఆ అమ్మాయిని 35 ముక్కలుగా నరకి… ఆమె తలను ఫ్రిజ్‌లో పెట్టడమా? అని ప్రశ్నించారు. ఇటీవల శ్రద్ధా వాకర్ హత్యోదంతాన్ని వీరు పరోక్షంగా ప్రస్తావించారు. మన దేశంలో పారశీకులు, సిక్కులు, జైనులు వంటి మతాలవారు ఉన్నారని, ఆ మతాల పెద్దలు జనాన్ని బ్రెయిన్‌వాష్ చేస్తున్నట్లు మనకు ఎందుకు కనిపించడం లేదని అడిగారు.

మన దేశాన్ని చూసి గర్వపడాలి…
భారత దేశంలో జీవించే ప్రజలు ఈ దేశాన్ని చూసి గర్వపడాలని మరికొందరు నిరసనకారులు చెప్పారు. వారు ఉదాహరణలను చెబుతూ.. చైనీయులు, జపనీయులు వారి దేశం పట్ల విపరీతమైన అభిమానాన్ని కలిగి ఉంటారన్నారు. చైనీయులు కేవలం చైనాను మాత్రమే అభిమానిస్తారరి,, జపనీయులు కేవలం జపాన్‌ను మాత్రమే ప్రేమిస్తారన్నారు. కానీ లవ్ జీహాద్‌లో యువతులను పురుషులు మోసం చేస్తున్నారని, పురుషులు హిందువులుగా నటిస్తూ… ఈ మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. పేరు, రూపం హిందువుగా మార్చుకుని, యువతులను బుట్టలో వేసుకుని, తమతోపాటు కలిసి ఉండేలా చేస్తున్నారని, ఆ తర్వాత ఆ యువతుల మతాన్ని మార్చుతూ వికృత చేష్టలకు తెగబడుతున్నారని పేర్కొన్నారు.

భూములను లాక్కుంటున్నారు…
హిందువుల భూములను ముస్లింలు అక్రమంగా లాక్కుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. హిందువులను వేధించి, చట్టవిరుద్ధంగా భూములను సొంతం చేసుకుంటున్నారన్నారు. అస్సాంను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో స్థానిక జనాభాలో వారి సంఖ్యాబలాన్ని పెంచుకోవడం కోసం భూములను లాక్కుంటున్నారన్నారు. మహారాష్ట్రలో కూడా చట్టవిరుద్ధంగా నిర్మిస్తున్న మసీదులు, ఇతర నిర్మాణాలు ల్యాండ్ జీహాద్‌కు సంకేతాలని తెలిపారు. దీనిపై తాము ప్రజలను మేలుకొలుపుతున్నామని చెప్పారు. ఈ కాన్సెప్ట్‌ను అర్థం చేసుకుంటేనే, జరుగుతున్నది ఏమిటో ప్రజలు తెలుసుకోగలుగుతారని చెప్పారు.

అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నాం..
అందరూ ఐకమత్యంగా ఉండాలనే హిందువులు కోరుకుంటారని కొందరు తెలిపారు. తమకు ముస్లిం స్నేహితులు ఉన్నారని, దేశం ముక్కలవాలని, విభజన బీజాలు నాటాలని తాము కోరుకోవడం లేదన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తమకు ఆదర్శమని చెప్పారు. ముస్లింలు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భారత సైన్యంలో సైనికుడు అబ్దుల్ హమీద్‌కు మరణానంతరం భారత దేశ అత్యున్నత సైనిక పురస్కారం పరమ వీర్ చక్రను అందజేశారని గుర్తు చేశారు. వారిలో ప్రతి ముస్లిం జాతీయభావాలతో జీవిస్తే తమకు ఇబ్బంది లేదన్నారు. మతం అనే ముసుగులో దాడులు చేయడం, మత మార్పిడులు చేయడం మానుకోవాలన్నారు.