ArticlesNews

సంఘ కార్యానికి.. రజ్జూ భయ్యా జీవితం అంకితం!

669views

పరమ పూజనీయ శ్రీ రాజేంద్రసింహాజీని రజ్జూ భయ్యా అని కూడా పిలుస్తారు. ఈయన ఆర్ఎస్ఎస్ 4వ సర్ సంఘచాలక్‌గా 1994 నుంచి 2000 సంవత్సరం వరకూ సేవలందించారు. రజ్జూ భయ్యా 1922 జనవరి 29న ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌ షహర్ లో జన్మించారు. ఆయన తల్లి జ్వాలాదేవి, తండ్రి బల్బీర్ సింగ్. ఈయన ప్రాథమిక విద్య ఢిల్లీలోని మోడ్రన్‌ స్కూల్లోనూ, నైనిటాల్ పబ్లిక్ స్కూల్లోనూ పూర్తి చేశారు. ఆ తర్వాత అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి 21 సంవత్సరాల వయసులోనే ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.

సంఘ కార్యంకోసం ఉద్యోగాన్ని వదులుకుని.. సేవకు అంకితమై..
అలహాబాద్‌ విశ్వవిద్యాలయంలో రజ్జూ భయ్య అనేక సంవత్సరాలు న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగానికి అధ్యాపకుడిగా పనిచేశారు. అంతకు ముందు రాజేంద్ర సింహాజీ…. నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ పర్యవేక్షణలో తెలివైన విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనతి కాలంలోనే అంటే.. 1960లో భౌతికశాస్త్ర విభాగానికి అధిపతిగా రజ్జూ భయ్యా బాధ్యతలు చేపట్టారు. ఈక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల ఆకర్షితులైన ఆయన… సంఘ కార్యం కోసం 1966లో తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి సేవకు అంకితమయ్యారు. కొంత కాలానికి రాజేద్రసింహాజీ ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఈనేపథ్యంలో సర్‌ సీవీ రామన్ రజ్జూ భయ్యాకు ఫెలోషిప్ ఇచ్చారు.

?️ ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఇలా..
1942 క్విట్ ఇండియా ఉద్యమంలో రజ్జూ భయ్యా చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆర్ఎస్ఎస్ తో ఆయనకు పరిచయం ఏర్పడింది. యువకుడిగా ఉన్నప్పటి నుంచే సంఘ్ లో అనేక బాధ్యతలు ఆయన నిర్వహిస్తూ వచ్చారు. 1966లో ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత… 1967 నుంచి ఈశాన్య ప్రాంతాల ప్రచారక్ గా పనిచేశారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోనూ కొంతకాలం ప్రచారక్ గా పనిచేశారు. 1975-77 ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణతో కలిసి ఉద్యమాన్ని ముందుకు నడిపించి విజయవంతం చేశారు. జనతా పార్టీ ఏర్పాటులోనూ ఆయన కీలకపాత్ర వహించారు. 1976లో ఢిల్లీలో జస్టిస్ వీఎం తార్కండే అధ్యక్షతన నిర్వహించిన మానవ హక్కుల సదస్సుకు రజ్జూ భయ్యా అధ్యక్షత వహించారు. దేశమంతా అనేక పర్యాయాలు పర్యటన చేశారు. 1977లో సహ సర్ కార్యవాహ బాధ్యతలు చేపట్టారు. 1978 సర్ కార్యవాహగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజల్ని చైతన్య పరచడంలో ఎప్పుడూ ముందుండే రజ్జూ భయ్యా.. 1994 మార్చిలో ఆర్ఎస్ఎస్ 3వ సర్ సంఘచాలక్ శ్రీ మధుకర దత్తాత్రేయ దేవరస్ ఆరోగ్యం క్షీణించడం వల్ల రాజేంద్ర సింహాజీకి సర్ సంఘచాలక్ గా బాధ్యతలు అప్పగించారు. రజ్జూ భయ్యా స్వతహాగా విద్యావేత్త కావడంతో… సమాజంలోని వివిధ రంగాల మేధావులతో మంచి సంబంధాలను ఏర్పరుచుకున్నారు. విదేశాల్లో కూడా పలు పర్యటనలు చేశారు. యుకే, అమెరికా , ఆఫ్రికా ఖండాలలో విస్తృతంగా పర్యటించారు.

?️ గ్రామీణ ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ..

భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక పరిస్థితులు మెరుగుపరిచేందుకు రజ్జూ భయ్యా కృషి చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయడానికి అహర్నిశలు పనిచేశారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి 1995లో గ్రామాలను ఆకలి రహిత, వ్యాధుల రహితంగా, విద్య ,స్వయం సమృద్ధి గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రకటించారు. ఆ విధంగా దేశవ్యాప్తంగా 100కు పైగా ఆదర్శ గ్రామాలను అభివృద్ధి చేశారు. స్వయం సేవకులు చేసిన ఈ గ్రామీణ అభివృద్ధి పనులు చుట్టుపక్కల అనేక గ్రామాల ప్రజలకు ప్రేరణగా రూపాంతరం చెందాయి.

?️ ప్రతి వ్యక్తి కావాలి.. జాతికి శక్తి నినాదంతో..
సంఘ కార్యం… ఆలోచన సరళి ఏ పరిస్థితుల్లోనైనా విశిష్టమైనదేనని రజ్జూభయ్యా విశదీకరించారు. సమాజంలో మౌలికమైన మార్పు రావాలంటే ప్రతి వ్యక్తిలోనూ ఆదర్శమైన పరివర్తన రావాలి అని వ్యక్తి మారకుండా ప్రభుత్వాల అధికారం చేతులు మారినంత మాత్రాన సమాజంలో సరైన మార్పురాదని ఆయన నమ్మేవారు. ప్రతి వ్యక్తిలో ఈ సమాజం నాదనే భావన నిర్మాణమైనప్పుడే సమగ్రమైన మార్పు వస్తుందని ఆయన చెప్పారు. ప్రతి వ్యక్తి జాతికి ఒక శక్తిగా నిలవాలన్న వారి పిలుపు సామాజిక కార్యకర్తలకు ముఖ్యంగా స్వయం సేవకులకు మార్గదర్శకంగా ఉంది. ఇక 2000 సంవత్సరంలో సర్ సంఘచాలక్ గా ఉన్న రజ్జూ భయ్యా ఆరోగ్యం క్షీణించడంతో ఆ బాధ్యతలను 5వ సర్‌ సంఘ్‌చాలక్‌గా శ్రీ కే.యస్ సుదర్శన్ జీకి అప్పగించారు.