
వారానికి ఆరు రోజులు మాత్రమే … ఆదివారం సెలవు
విశాఖపట్నం-సికింద్రాబాద్ ప్రయాణ సమయం 8.40 గంటలు
విశాఖ నుంచి ఉదయం 5.45 గంటలకు బయలుదేరనున్న రైలు
నాలుగే స్టాపులు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్
తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతాగానో ఎదురుచూస్తున్న ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ రైలు సంక్రాంతి కానుకగా వచ్చేస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచే ఇది పట్టాలపైకి వస్తోంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఈ రైలు వారానికి ఆరు రోజులు మాత్రమే నడపనున్నారు. ఆదివారం పూర్తిగా సెలవు. ఈ రెండు నగరాల మధ్య ప్రస్తుతం ఇతర ఏ రైలులో వెళ్లినా కనీస ప్రయాణ సమయం 12 గంటలు పడుతోంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఈ సమయాన్ని 3.20 గంటలు తగ్గిస్తుంది. అంటే 8.40 గంటల్లో గమ్యం చేరుస్తుంది. రైలు వేగం గంటకు రూ.160 కి.మీ. కాగా ఈ మార్గంలో దీనిని సరాసరి 80 నుంచి 90 కి.మీ. వేగంతో నడపనున్నారు. మధ్యలో స్టాపుల సంఖ్య కూడా బాగా పరిమితం చేశారు. కేవలం నాలుగు స్టేషన్లలో మాత్రమే ఇది ఆగేలా ప్లాన్ చేశారు. విశాఖలో బయలుదేరితే రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలోనే ఆగుతుంది. విశాఖ నుంచే బయలుదేరే రైలుకు 20833 నంబరు కేటాయించారు. అటు నుంచి బయలుదేరే రైలుకు 20834 నంబరు ఇచ్చారు.
ఇవీ ప్రయాణ సమయాలు..
వందే భారత్ రైలు ప్రతిరోజు ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. 7.55 గంటలకు రాజమండ్రి, 10.00 గంటలకు విజయవాడ, 11.00 గంటలకు ఖమ్మం, 12.05 గంటలకు వరంగల్ మీదుగా మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. అటు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3.00 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.35 గంటలకు వరంగల్, 5.45 గంటలకు ఖమ్మం, రాత్రి 7.00 గంటలకు విజయవాడ, 8.58 గంటలకు రాజమండ్రి, 11.30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఇందులో 16 కోచ్‌లు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్, చైర్ కారు అని రెండు తరగతులు ఉంటాయి. కూర్చొనే ప్రయాణం చేయాలి. పడుకునే వీలుండదు. దాదాపు అంతా పగటి పూట ప్రయాణమే కాబట్టి స్లీపర్ కోచ్‌లు ఏర్పాటు చేయలేదు.
తొలి రోజు మాత్రం ప్రత్యేకం… పలు స్టేషన్‌లలో హాల్ట్!
ఈ రైలును ఈ నెల 15న ప్రధాని నరేంద్రమోదీ చేతులు మీదుగా వర్చువల్‌గా ప్రారంభిస్తారు. అందుకని ఆ రోజు రైలు సమయం ప్రత్యేకంగా ఉంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి రాత్రి 8.45 గంటలకు విశాఖపట్నం వస్తుంది. ఆ ఒక్కరోజు మాత్రం ఈ రైలు చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారంపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. శుక్రవారం నాటికి ఇంకా దీనికి టిక్కెట్ ధరలను ఖరారు చేయలేదు. శనివారం నుంచి బుకింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.
ఛార్జీ ఎంతంటే..
వందే భారత్ ఛార్జీల విషయానికొస్తే.. విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఛైర్ కార్ టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.1720, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.3170గా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఛైర్ కార్ టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.905, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.1775గా ఉండగా.. రాజమండ్రికి ఛైర్ కార్ ధర రూ.1365, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.2485గా ఉంది. క్యాటరింగ్, రిజర్వేషన్, జీఎస్టీ, సూపర్ ఫాస్ట్ ఛార్జీలన్నీ కలిపి ఈ టికెట్ ధరలను నిర్ణయించారు.





