
తిరుమలలో వసతి గదుల అద్దెను పెంచడంపై ఏపీ బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని టీటీడీ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నాయకులు నిరసన చేపట్టారు. తిరుమలలో భక్తుల వసతి గదుల ధరలను టీటీడీ పెంచడాన్ని నిరసిస్తూ రాజమండ్రిలోని కలెక్టరేట్ ఎదుట బి.జె.పి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ధర్నా చేశారు.
హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ అవలంభిస్తున్న వైఖరి మానుకోవాలని నినాదాలు చేశారు. టిటిడి అద్దె గదుల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ కాలెక్టరేట్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ఆందోళన చేశారు. ఆందోళన లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయల పట్ల చిన్నచూపు చూస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రజలు తమ కష్టాలను దేవుడుకి చెప్పుకోవడానికి తిరుమల వస్తే వారిని ఇబ్బంది పెడతారా? వసతి గదుల అద్దె ధరలు పెంచితే భక్తులు ఎక్కడ ఉండాలంటూ ప్రశ్నించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసీపీ వ్యవహరిస్తోంది. సామాన్యులపై విపరీతంగా ఆర్ధిక భారం మోపడం బీజేపీ ఖండిస్తుందని జీవీఎల్ తెలిపారు.
పెరిగిన ధరలు ఇలా..
కొండపై ఉన్న వసతి గదులు ఇప్పుడు ఖరీదుగా మారిపోయాయి. సామాన్య భక్తులు ఒక రోజు ఉండి దర్శనం, మొక్కులు తీర్చుకునేందుకు నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వసతి గృహాల్లో ఉంటుంటారు. గతంలో ఈ వసతి గృహాల్లో 500 నుంచి 600 రూపాయలు అద్దె ఉండేది. కానీ ప్రస్తుతం జీఎస్టీతో కలిపి దాదాపు 1000 నుంచి 2000 వేలకు పైగా ధరలు పెంచారు. నారాయణగిరి రెస్ట్ హౌస్‌లో కూడా 1,2,3గదులను 150-250 ఉండే అద్దెను జీఎస్టీతో కలిపి ఏకంగా 1700 రూపాయలకు పెంచారు. ఇక రెస్ట్ హౌస్‌లోని 4లోని ఒక్కో గది అద్దె 750 ఉండగా దానికి వెయ్యి రూపాయలు అదనంగా పెంచి 1700 చేశారు. ఇక కార్నర్ సూట్‌ను జీఎస్టీతో కలిపి 2200 రూపాయలు, స్పెషల్ టైప్ కాటేజీల్లో 750 రూపాయల ఉండే గదిని 2800 రూపాయలకు పెరిగింది. దీంతోపాటు టీటీడీ మరో నిబంధనను తీసుకొచ్చింది. ఈ గదులను అద్దెకి తీసుకోవాలంటే అంతే మొత్తం డిపాజిట్ గా చెల్లించాలని చెప్పడంతో భక్తులు వాపోతున్నారు. భక్తులను ఇలా నిలువు దోపిడీ చేయడం ఎంతవరకూ సబబు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.





