News

గో సేవకు జీవితాన్ని అంకితం చేసిన 80ఏళ్ళ మాతృమూర్తి…

355views

ఏటా ఎండుగడ్డి కోసమే 3.5 లక్షలు ఖర్చు

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉంటున్న ఎనభై ఏళ్ళ బదాంబాయికి మూగజీవాలంటే ప్రేమ. పాతికేళ్ళ క్రితం గోశాల ఏర్పాటు చేసిన ఆమె, నేటికీ గో సంరక్షణ కోసం పాటుపడుతోంది. గోవులపై ఆమెకున్న ప్రేమకు కుటుంబం కూడా మద్దతుగా ఉంటుంది. శక్తి ఉన్నన్ని రోజులు గో సేవ చేస్తానని చెబుతున్న ఆమెను అందరూ గోవుల అమ్మగా కీర్తిస్తుంటారు.

మదన్‌లాల్, బదాంబాయి దంపతులు తమ వైవాహిక జీవితం మొదలుపెట్టిన నాటి నుంచే ఆవు కనబడితే చాలు దండం పెట్టుకునేవారట. ఈ విషయం గురించి బదాంబాయిని అడిగితే ప్రతీ రోజూ ఉదయం క్రమం తప్పకుండా గో పూజ చేసేదాన్నని, ఆ భక్తి, ప్రేమ ఏళ్ళు గడిచినకొద్దీ పెరిగిందే కానీ తగ్గలేదని చెబుతుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎలక్ట్రానిక్స్‌ వ్యాపారంలో రాణించాడు మదన్‌లాల్‌. పిల్లలు పెద్దవాళ్లయ్యారు.

వారూ జీవితాల్లో స్థిరపడుతున్నారు. ఆ సమయంలోనే గోశాల పెట్టాలన్న ఆలోచనను భర్తకు వివరించింది బదాంబాయి. అందుకోసం స్థలాన్వేషణ చేశారు. 1996లో 44వ నంబరు జాతీయ రహదారిపై జంగంపల్లి వద్ద స్థలాన్ని కొనుగోలు చేశాడు. ‘శ్రీ కుమార్‌ పాల్‌ జీవ్‌ దయా ట్రస్ట్‌’ను ఏర్పాటు చేసి అదే సంవత్సరం 21 ఆవులతో గోశాల మొదలుపెట్టారు. వాటి సంరక్షణకు పనివాళ్లను నియమించారు. బదాంబాయి రోజూ ఉదయం 9 గంటలకు టిఫిన్‌బాక్స్‌ పట్టుకొని గోశాలకు చేరుకునేది. అక్కడే సాయంత్రం వరకు గోవులను చూసుకుని తిరిగి ఇంటికి చేరుకునేది. మదన్‌లాల్, ఆయన కొడుకులు కూడా వ్యాపారంలో బిజీగా ఉన్నా ప్రతీ ఆదివారం గోశాలకు వచ్చేవారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి