
గత ఐదేళ్ళ కాలంలో వర్షాలు లేక అనంతపురం జిల్లా ప్రజల పరిస్థితి దయనీయంగా వుంది. జిల్లా అంతటా కరువు తాండవిస్తోంది. మిగిలిన అవసరాల సంగతి దేవుడెరుగు. కనీసం దాహమేస్తే గొంతు తడుపుకోవడానికి కూడా గుక్క నీరు లేక ప్రజానీకం విలవిలలాడిపోతున్నారు. కడివెడు నీటి కోసం మైళ్ళ కొద్దీ నడవాల్సిన పరిస్థితి. వున్న వారు ట్యాంకర్లతో నీరు తోలించుకుంటున్నారు. మరి లేని వారో? “గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీరు ఎక్కడ దొరుకుతుందా?” అని గంపెడాశతో ఎదురు చూడాల్సిన పరిస్థితి. అలాంటి వారికి మేమున్నామని ఆపన్న హస్తం అందిస్తున్నారు సేవా భారతి కార్యకర్తలు. అనంతపురం జిల్లా కదిరి మండల సేవాభారతి కార్యకర్తలు ట్యాంకర్లతో గ్రామాలకు ఉచితంగా నీటిని అందిస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. గ్రామాలలో వారి ఇళ్ళ వద్దకే వెళ్లి గ్రామీణులకు నీరందిస్తున్నారు. సేవా భారతి అందిస్తున్న ఈ సాయానికి ప్రజలు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ళకోసారి వచ్చి కల్లబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు దండుకుపోయే రాజకీయ నాయకులకన్నా, నిరంతరం సామాన్యుల సేవలో మునిగి వుండే సేవాభారతే తమను ఇలాంటి సందర్భాలలో ఆదుకుంటూ వున్నదని, విద్య, వైద్య సేవలను కూడా సేవాభారతి తమకు అందిస్తూ వున్నదని ప్రజలు కొనియాడుతున్నారు.
ఈ ఉచిత మంచి నీటి సరఫరా కార్యక్రమాన్ని త్వరలో జిల్లా అంతటా చేపట్టనున్నామని, జిల్లాలో నీటి కొరత వున్న ప్రాంతాలను గుర్తించే పనిలో ఉన్నామని సేవా భారతి సహ ప్రాంత ప్రముఖ్ శ్రీ కొండారెడ్డి తెలిపారు.





