GalleryNews

గ్రామ దేవతలను పూజిస్తుంటే కమ్యూనిస్టులకు కడుపు మంట!

238views

త భావజాలాన్ని ఊరు, వాడ తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారని కొంతమంది పెద్దలు పరోక్షంగా “సంఘ్ పరివార్” పై విమర్శలు గుప్పిస్తున్నారు. బొడ్రాయి పండుగ.. బతుకమ్మ పండుగల పేర్లతో హిందూ మతాన్ని రుద్దుతున్నారని సిపిఐ నిర్వహించిన సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు.

ఈనెల ఏడోతేదీన భాగ్యనగర్ లోని మగ్దుమ్ భవన్‌లో హిందూ వ్యతిరేక భావజాలం ఉన్న పెద్దలందరిని కలిపి సిపిఐ సదస్సు నిర్వహించింది. అందులో పాల్గొన్న ప్రముఖులందరూ మాట్లాడుతూ హిందుత్వంపై విషం కక్కారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ విధానాలపై విమర్శిస్తే తప్పులేదు కానీ, బిజెపిని అడ్డుపెట్టుకొని కమ్యూనిస్టులు అని చెప్పుకునే హిందూ వ్యతిరేకులు భారతీయ సంస్కృతి..హిందూ జీవన విధానంపై ఆక్కసు వెళ్ళగక్కారు. దేశభక్తిని ఎగతాళి చేసేలా మాట్లాడారు.

ఫాసిజం గురించి, కార్పొరేటర్ శక్తుల గురించి, పత్రికలు, టీవీల్లో కార్పొరేట్ ప్రకటనల గురించి మాట్లాడారు. అంతా ఓకే..! కానీ మొత్తంగా సారాంశం చెప్పాల్సింది ఏమిటంటే హిందుత్వాన్ని, భారతీయ జీవన విధానాన్ని తప్పుపడుతూ మాట్లాడడం అనేదాని మీదే మా అభ్యంతరం. నేడు బతుకమ్మ, బొడ్రాయి పండుగలు హిందూ సంస్థలు సృష్టించినవి కాదు. నిర్వాహకులు కూడా బిజెపి వారు కాదు అనే విషయాన్ని మేధావులు విస్మరించారు.

సనాతన హైందవ ధర్మం లక్షల సంవత్సరాల నుంచి వస్తున్న విషయాన్ని గమనించాలి. నేడు ప్రజల్లో భక్తి, హిందుత్వ భావం పెరిగిపోతుండటంతో తమ ఉనికి కనుమరుగవుతుందేమోనని అందులో పాల్గొన్న వక్తలందరూ గుండెలు బాదుకున్నట్టు కనిపిస్తోంది. దాదాపు 96 ఏళ్ళ కింద‌ట విదేశాల నుంచి ఈ దేశానికి దిగుమతి చేసుకున్న కమ్యూనిస్టు సిద్ధాంతం మొత్తం కూడా ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలపై, ఆచార వ్యవహారాలపై దాడులు చేసింది. దౌర్జన్యాలు చేసింది.

“అందితే జుట్టు. అందుకుంటే కాళ్లు” అనే సిద్ధాంతాన్ని అవలంబించింది. భారత ప్రజాస్వామ్యంలో గెలిస్తే రాజ్యాధికారం, ఎన్నికల్లో చేతగాక ఓడిపోతే నిరంకుశం, పాసిజం, అని రకరకాల పేర్లు పెట్టి వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారు. పశ్చిమబెంగాల్ , త్రిపుర లాంటి ప్రాంతాలలో దశాబ్దాల తరబడి పాలన కొనసాగించారు.

కానీ, ఎక్కడైతే పూలు అమ్మినారో, అక్కడే కట్టెలు అమ్మిన పరిస్థితి నేడు ఏర్పడింది. బెంగాల్ , త్రిపుర రాష్ట్రాలలో కనీసం అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించలేని దుస్థితికి తీసుకువచ్చాయి వారి విధి విధానాలు. కానీ, నేడు సమాజం వాస్తవం గ్రహించింది. హిందుత్వంపై కమ్యూనిస్టు పేరుతో చేస్తున్న దౌర్జన్యాలను గుర్తించింది. అయితే దీన్ని కమ్యూనిస్టులు జీర్ణించుకోవడం లేదు.

అందుకే మేధావుల పేరుతో సదస్సులు నిర్వహించి, తమకు అనుకూలమైన ప్రసార మాధ్యమాల ద్వారా హిందుత్వంపై విషం చిమ్మి ప్రయత్నం చేస్తున్నారు. చెప్పే విషయం ఏమిటంటే కమ్యూనిస్టులు పార్టీ పరంగా ఉద్యమాలు చేస్తే మంచిది. కానీ, హిందుత్వాన్ని నాశనం చేయాలని ఏకైక సంకల్పంతో పనిచేయడం అనేది ముమ్మాటికి తప్పు. దాన్ని జనాలు కూడా స్వీకరించలేని పరిస్థితి ఉంది.

ప్రజాపక్షం ఎడిటర్ గారు మాట్లాడుతూ కార్పొరేట్ వ్యవస్థలను విమర్శించారు. మరి అదే ప్రజాపక్షం నేడు దేశంలోనే కార్పొరేట్ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు దగ్గర మోకరిల్లి మునుగోడు ఎలక్షన్ల దగ్గర బంధం ఏర్పరచుకున్నది నిజాం కాదా..? ప్రజాపక్షం పత్రికకు యాడ్స్ గుమ్మరించుకుంటున్నది వాస్తవం కాదా..? . ఈ విధానాన్ని ఏమనాలో పెద్దలే సమాధానం చెప్పాలి.

గద్దర్ గారు…

సంస్కృతి పేరుతో ఏమీ చేయలేని బిజెపి, ప్రజలను దోపిడీ చేసే సంస్కృతి తీసుకువచ్చి అధికారంలోకి వచ్చిందని ప్రజా గాయకుడిగా పిలుచుకునే గద్దర్ విమర్శించారు. మరి మొన్న పరేడ్ గ్రామంలో జరిగిన బీజేపీ సభ ముందు ఈ విషయం తెలవదా గద్దర్ గారికి. పిలవకుండానే బిజెపి సభలకు వెళ్లి, పిలవకుండానే చిన జీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లిన గద్దర్ గారు తన పబ్లిసిటీని తాను, తన ఉనికిని తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న గద్దర్ గారు ఈ విధంగా మాట్లాడితే ఏమనుకోవాలి?
ప్రజలను ఇంత ఘోరంగా పిచ్చివాళ్లను చేయడంలో ఆంతర్యం ఏమిటి..?

ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న గారు…

మార్క్సిజాన్ని మించిన సత్య సిద్ధాంతం ప్రపంచంలో మరోటి లేదని తేల్చి చెప్పిన ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న గారు మరి కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వదిలి టిఆర్ఎస్ లో ఎందుకు చేరాల్సి వచ్చిందో? ఓ ప్రముఖ పత్రిక ఎడిటర్ మాట్లాడుతూ బిజెపి దేశభక్తిని శంకించే ప్రయత్నం చేశారు. అయితే విదేశీ రష్యా, చైనా సిద్ధాంతాన్ని భారతదేశంలో బలవంతంగా రుద్దే నాయకుల దేశభక్తి సర్టిఫికెట్ బిజెపికి అవసరం లేదనిపిస్తోంది.

సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఏం తినాలో, ఏం కట్టుకోవాలో బిజెపి అనుమతి తీసుకోవాలా? అని మాట్లాడారు. అయితే మీరు తినే ఆహారం, కట్టుకునే అహర్యంపై ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మేము ముక్కోటి దేవతలకు నిలయంగా భావించి, పూజించే మా గోమాతలను వధించవద్దు అని మాత్రమే చెప్పాము. అది కూడా చట్టపరంగా.!

చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఏ రోజూ ప్రవర్తించలేదు. ఇవన్నీ కూడా హిందుత్వానికి , దేశభక్తికి సంబంధించిన అంశాలు. వీటిపై మాట్లాడితే ప్రతి హిందువు స్పందిస్తాడు. కానీ రాజకీయపరంగా భారతీయ జనతా పార్టీ తీసుకునే విధివిధానాలపై ఎవరైనా ఎటువంటి ఉద్యమమైన చేయవచ్చు. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఆ హక్కు వారికి ఉంటుంది.

కానీ, హిందూ వ్యతిరేక విధానాలే లక్ష్యంగా, హిందుత్వాన్ని నాశనం చేయడమే టార్గెట్ గా పనిచేస్తే హిందువులంతా ఏకమై తిరుగుబాటు చేయక తప్పదు. ప్రత్యేకంగా నేడు బతుకమ్మ.. బొడ్రాయి పండుగ అనేది గ్రామస్థాయిలో బడుగులు, బలహీనవర్గాలు, అణగాని వర్గాలు చేసుకునే పండగ.

దీనిపై కమ్యూనిస్టులకు కన్నుకుట్టినట్టయింది. మేం బతుకమ్మను పూజిస్తే.. బొడ్రాయిని కొలిస్తే కమ్యూనిస్టులు జీర్ణించుకోకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. ఊరువాడ సంఘటితమై సమైక్యంగా భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తుంటే మీకు కడుపు మంట ఎందుకని? విశ్వహిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది.

హిందూ సమాజం ఐక్యత కోసం తీసుకువచ్చిన వినాయక ఉత్సవాలు కేవలం క్లాస్ పీపుల్స్ మాత్రమే నిర్వహించుకుంటున్నారు. దీనివల్ల మనకు ఏమాత్రం నష్టం లేదు. కానీ ఈరోజు గ్రామస్థాయిలో ప్రతి పల్లె, ప్రతి గల్లీ, ఊరు వాడ. తండాతో పాటూ దేశ విదేశాలలో గౌరమ్మను పూజిస్తూ, బతుకమ్మను కొలుస్తున్నారు. నవరాత్రులపాటు దుర్గామాతను పూజిస్తున్నారు. మహిళలు.. యువకులు.. పిల్లలు అంతా ఒక్కటై సంబరాలు చేసుకుంటున్నారు.

దీంతో కడుపు మండిన కొంతమంది మేధావులు మత భావజాలాన్ని ఊరూరా తీసుకెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించడం ఏమనాలి..? మా బడుగులు పూజిస్తుంటే.. మా హిందువులు భక్తిశ్రద్ధలు కలిగి ఉంటే మీకు వచ్చిన నష్టం ఏమిటి ..? అని విశ్వహిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది.

భ‌యం… భ‌యం!

అసలు “దేవుడే లేడు.. దేవుడు, పూజ అనేది మూఢనమ్మకాలు” అని చెప్పుకునే మీకు మా దేవుడిని, మా భక్తిని , మా పూజలను చూస్తే భయమెందుకు వేస్తోంది.? సదస్సులు.. సమావేశాలు నిర్వహించి చర్చించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఏది ఏమైనా లక్షల సంవత్సరాల నుంచి విరాజిల్లుతున్న హిందూ సమాజాన్ని అంతమొదించాలని చూసిన వారే కాలగర్భంలో కలిసిపోయారు.

కానీ, హిందూ సమాజం నేడు ప్రపంచ వ్యాప్తంగా దేదీప్యంగా వెలుగొందుతోంది. దేశాలకు దేశాలే హిందూ జీవన విధానం వైపు మల్లుతున్నాయి. ప్రపంచ దేశాలలో అగ్రగామిగా భావించే అమెరికా, కెనడా లాంటి దేశాలు దీపావళి.. దుర్గా నవరాత్రి మాసాలను హిందూ మాసాలుగా అధికారికంగా ప్రకటిస్తున్నాయి. ఇది చాలదా హిందూ వైభవ ప్రతీకకు తార్కాణం. మరణం లేనిది హైందవ జీవన విధానం.. శాశ్వతమైనది హిందూ సంస్కృతి సంప్రదాయం.
భారత్ మాతాకీ జై…! జైశ్రీరామ్..!!

– పగుడాకుల బాలస్వామి, తెలంగాణ ప్రచార ప్రముఖ్, విశ్వహిందూ పరిషత్.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి