
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై యావత్ ప్రపంచం గుర్రుగా వుంది. ఫ్రాన్స్, జర్మనీ తర్వాత అమెరికా కూడా ఉగ్రదేశం పాక్ పై తనదైన శైలిలో విరుచుకుపడుతోంది.
ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని పాక్ కు అమెరికా స్పష్టం చేసింది. మరో సారి భారత్ పై ఉగ్ర దాడి జరిగితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికా పాక్ ను హెచ్చరించింది.
వైట్ హౌస్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో అమెరికాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ “ పాకిస్థాన్ తీవ్రవాద ముఠాలపై స్పష్టమైన, కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వుంది. ముఖ్యంగా జైషే మొహమ్మద్, లష్కరే తోయిబాలపై ఉక్కుపాదం మోపవలసి వుంది. పాక్ ఈ ముష్కర ముఠాలను అదుపుచేయక, వారి ద్వారా భారత్ లో ఏవైనా దాడులు జరిగితే పాకిస్థాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.
తీవ్రవాదుల అరెస్ట్ ల పై పాక్ చేసే నాటకాలపై కూడా ఆయన మండి పడ్డారు. “ మేము గతంలో కూడా కొన్ని సందర్భాలలో పాక్ ప్రభుత్వం కొన్ని నకిలీ అరెస్టులను చూపి కొన్నాళ్ళ తర్వాత వారిని విడిచిపెట్టడం చూశాము. ఇప్పుడు అలాంటి నాటకాలను ఏమాత్రమూ సహించబోము. పాకిస్థాన్ ఎట్టి పరిస్థితులలోనూ కఠిన చర్యలు తీసుకోవాల్సిందే” అని స్పష్టం చేశారు. ఏదేమైనా, ఏ చర్య తీసుకున్నా అది పాక్ చేతిలోనే వుందని, పాక్ తీసుకునే చర్యలను అనుసరించే ఆర్ధిక విషయాలలో పాక్ తో తమ భవిష్యత్ వ్యవహారం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. తీవ్రవాద ముఠాలపై కఠిన వైఖరి అవలంబించటం ద్వారా పాక్ అంతర్జాతీయ సమాజంలో బాధ్యత కలిగిన దేశంగా వ్యవహరిస్తుందా? లేదా? అన్నది పాక్ చేతిలోనే వున్నదని ఆయన పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా, తీవ్రవాదంపై ఎలాంటి ఉపేక్షకు అవకాశామివ్వకూడదని నిర్ణయించిందని తెలిపారు. “ పుల్వామా తరహా దాడులు భారత్ లో మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవలసిన బాధ్యత పాక్ పై వుంది”. అని ఆయన పేర్కొన్నారు.
ఆయన జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించనివ్వకుండా మోకాలడ్డుతున్న చైనా తీరును కూడా తప్పు పట్టారు. “పాకిస్థాన్ ను రక్షించకుండా, మిగతా అంతర్జాతీయ సమాజంతో కలిసి తీవ్రవాదంపై కఠిన చర్యలు తీసుకునేటట్లుగా పాకిస్థాన్ పై ఒత్తిడి తేవలసిన బాధ్యత చైనా పై కూడా వుంది.” అని ఆయన వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ తీవ్రవాదంపై తన చర్యలను తీవ్రతరం చెయ్యకుంటే పాకిస్థాన్ ను ఈ ప్రపంచంలో ఈ శక్తీ కాపాడలేదని, ఏ ఇతర దేశమూ అందుకు ముందుకు రాదన్న విషయాన్ని పాక్ గ్రహించాలని తెలిపారు.
Source : Ritam.





