News

బైడెన్​ సర్కార్​లో భారతీయుల హవా, 130 మందికి ఉన్నత పదవులు

380views

న్యూఢిల్లీ: అమెరికా జనాభాలో భారత సంతతి వారు ఒక‌ శాతమే అయినా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో ఏకంగా 130 మంది భారతీయులు ఉన్నత పదవులు దక్కించుకోవ‌డం విశేషం. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను బైడెన్‌ ఎంపిక చేసుకున్న విషయం విదితమే. భారతీయులకు మునుపటి అమెరికా అధ్యక్షులు ఇచ్చిన పదవులకన్నా చాలా ఎక్కువ పదవులను బైడెన్‌ ఇచ్చారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలూ, సంస్థల్లో భారతీయులు ముఖ్య స్థానాలను అలంకరిస్తున్నారు.

పూర్వ అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ మొట్టమొదటిసారిగా ఒక భారతీయుడికి ఉన్నత పదవి ఇవ్వగా, బరాక్‌ ఒబామా 60 మందికి పైగా, డోనాల్డ్‌ ట్రంప్‌ 80 మందికిపైగా భారతీయులను నియమించారు. ఇప్పుడు బైడెన్‌ ఆ రికార్డును బద్దలుకొట్టారు. భారతీయ అమెరికన్లకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పిస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈసారి 40 మందికిపైగా భారత సంతతి వారు రాష్ట్రాల చట్టసభలకు, ఫెడరల్‌ లెజిస్లేచర్‌కూ ఎన్నికయ్యారు. వీరిలో నలుగురు అమెరికా కాంగ్రెస్​లో (పార్లమెంటు) దిగువ సభకు ఎన్నికయ్యారు. మరో నలుగురు వివిధ అమెరికన్‌ నగర పాలికలకు మేయర్లు అయ్యారు. పలువురు భారతీయ అమెరికన్లు విదేశాల్లో యూఎస్‌ రాయబారులుగా నియమితులయ్యారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి