ArticlesNews

స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి విశ్వగురువుగా భారత్

418views

వరు ఒప్పుకున్నా,ఒప్పుకోకపోయినా మేరా భారత్ మహాన్… అవును 75 సంవత్సరాల స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకుంటున్న మేరా భారత్ నిజంగా, నిస్సందేహంగా మహాన్. వర్తమాన ఆధునిక ప్రపంచంతో అడుగులు కలుపుతూ 5 – జి టెలికామ్ సర్వీసులను లాంఛనంగా ప్రారంభించి గొప్ప సాంకేతిక విప్లవానికి తెరతీసిన భారత్ ఎంతో శక్తిమంతమైన దేశమని మరో సారి రుజువైంది. ప్రపంచానికి చోదక శక్తిగా గుర్తింపు పొందిన సెమి కండక్టర్ల (చిప్స్) తయారీకి వేదాంత గ్రూపుతో సహా ఎన్నో సంస్థలు శ్రీకారం చుట్టి, మేకిన్ ఇండియా నినాదానికి పుష్టిని తీసుకుని వచ్చి ప్రపంచ పటంపై భారత్ డిజిటల్ జెండా ఎగురవేస్తున్నారు. వాస్తవానికి “డిజిటల్ విప్లవం” ఇప్పుడు భారతీయుల పిడికిట్లో ఉందంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. పైలెట్ రహిత యుద్ధ విమానాలు, తేజస్ వంటి తేలికపాటి యుద్ద విమానాలు, బ్రహ్మోస్ క్షిపణులు, రష్యా సాంకేతిక బదలాయింపుతో నిర్మితమవుతున్న యుద్ద ట్యాంకులు ఇందుకు నిదర్శనం. వీటిలో కొన్నింటిని -ఎగుమతి కూడా చేస్తూ భారత్ కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

ప్రపంచ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలకు భారత సంతతి తేజో మూర్తులు సిఈఓలుగా మార్గదర్శనం చేస్తూ భారత దేశ మేథకు ఎనలేని గౌరవాన్ని, ఔన్నత్యాన్ని తీసుకుని వస్తున్నారంటే మేరా భారత్ మహాన్ అనటంలో ఎవరికీ అభ్యంతరాలు ఉండటానికి వీలే లేదు. టెక్నాలజీ ఆవిష్కరణల్లోనే కాకుండా, ప్రపంచ రాజకీయ, అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ గుండె చప్పుడు ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. తాజాగా బ్రిటిష్ ప్రధానమంత్రి రేసులో ముందున్న ఋషి సనక్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ భారత సంతతి వారేనన్న సంగతి విస్మరించరాదు. కెనడా తదితర దేశాల్లో ప్రభావ శీల రాజకీయాల్లో మనవారున్నారు. వారంతా భారత సంతతి ఆణిముత్యాలు. అనేక అంతర్జాతీయ వేదికలపై భారత్ గొంతు బలంగా వినిపిస్తోంది. ప్రభావశీల నిపుణులు ఎంతో మంది ప్రపంచ యవనికపై తారల్లా మెరుస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన యుద్ధ నౌక చెన్నై దగ్గర ఎల్ అండ్ టీ షిప్ యార్డుకు మరమ్మత్తులకోసం వచ్చింది. భారత్ శక్తి ఏమిటో దీంతో తేటతెల్లమవుతోంది. ఇదే సమయంలో చైనాకు చెందిన ఓ గూఢచార నౌక శ్రీలంకతీరంలో లంగరు వేసేందుకు సిద్ధమైతే, వర్తమాన సంక్షుభిత సమయంలో ఆ నౌక రావడం మంచిది కాదనీ, రావటానికి వీల్లేదనీ భారత్ హెచ్చరించడంతో ఆ నౌక వెనక్కి తగ్గినట్టు సమాచారం. రష్యా – ఉక్రెయిన్ల మధ్య యుద్దం సాగుతున్న సమయంలో వేలాది మంది భారత వైద్య విద్యార్ధులను స్వదేశానికి క్షేమంగా తీసుకురావడంలోనే ప్రపంచంలో భారత్ ప్రతిష్ట, పలుకుబడి, పరపతి ఎలాంటివో ప్రపంచం మొత్తం వీక్షించింది. కొంత కాలం క్రితం కోవిడ్ టీకాలను, సంజీవని వంటి ఔషధాలనూ ప్రపంచానికి సరఫరా చేయడంతో అమెరికా సహా అనేక దేశాలు ముకుళిత హస్తాలతో ధన్యవాదాలు తెలిపిన సంగతిని మనం విస్మరించరాదు. భారత్ కు గొప్ప దాతృత్వ గుణం ఉండ వల్లనే రష్యా ఇప్పుడు భారత్ కి భారీ డిస్కౌంట్ తో చమురును అందిస్తోంది. ఆ చెల్లింపులు భారత కరెన్సీలోనే జరగడం ఓ గొప్ప అసాధారణ పరిణామం. దీంతో ప్రపంచం భారత్ ను చూసి ఈర్ష్య పడుతోంది. ఆ మేరకు మీడియాలో అనేక మాటలు తరచుగా వినబడుతూనే ఉన్నాయి. జి-20, క్వాడ్ లాంటి అనేక కూటముల్లోకి సంపన్న దేశాలు భారత్ ని సాదరంగా ఆహ్వానించాయి. అక్కడ ఎంతో విజ్ఞతతో వ్యవహరించడం వల్ల భారత్ పలుకుబడి- పరపతి ద్విగుణీకృతమైంది. అనేక ప్రపంచ వేదికలపై ఈ విషయం ద్యోతకమవుతోంది. అంతేకాక, విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల అమెరికా- యూరప్ ల తీరును వారి గడ్డపైనే నిర్మొహమాటంగా ఎండగట్టడంతో ఆ దేశాలు ఖంగు తిన్నాయి. ఒక్కసారిగా గొంతు సవరించుకున్నాయి. ప్రస్తుత భారత్ పాలకులు నిజాయితీకి, నిక్కచ్చితత్వానికి పెద్ద పీట వేయడం వల్లనే భారత్ పట్ల యూరప్ దేశాల పూర్వవైఖరిలో మార్పు వచ్చింది. అమెరికా అయితే, కాట్సా చట్టం ద్వారా భారత్ పై ఆంక్షలు విధించదలచి చివరకు ఉపసంహరించుకుంది. ఈ ఒక్క పరిణామమే చాలు ‘మేరా భారత్ మహాన్’ అని నొక్కి పలకడానికి.

ఆర్థిక మాంద్యం కారణంగా అనేక దేశాలు కుదేలవుతున్నాయి. తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. భారత్ తోపాటు స్వాతంత్ర్యం పొందిన పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. శ్రీలంక సరేసరి. తాజాగా బంగ్లాదేశ్ సైతం దివాళా అంచుల్లోకి జారుకుంటున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సంక్షోభ సమయంలోనూ భారత్ నిలదొక్కుకుని చైనా వృద్ధి రేటు కన్నా అభివృద్ధిని నమోదు చేయడం, ఇదే జోరు కొనసాగితే త్వరలోనే ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడం కష్టం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రిజర్వు బ్యాంకులో విదేశీ మారకద్రవ్య నిల్వలు, బంగారు నిల్వలు దండిగా ఉన్నాయి. ఇది దేనికి సంకేతం? వందేళ్ళ క్రితం బ్రిటిష్ వలస పాలకులు నిర్మించిన పార్లమెంటు భవనం స్థానంలో సరికొత్త అత్యాధునిక, ప్రతిష్టాత్మక భవనం నిర్మితమైంది. వచ్చే శీతాకాల సమావేశాలు అందులోనే జరగనున్నాయి. ఇది కదా ఆజాదీకా అమృత్ మహోత్సవానికి ప్రతీక? ఆ ప్రజాస్వామ్య దేవాలయంపై మువ్వెన్నల జెండా సగర్వంగా కించిత్ పొగరుతో రెపరెపలాడుతోంది. ఇది కదా ప్రతిభారతీయుడు ఆశించింది? దీని కోసమే కదా ఎంతో మంది అమరులైంది. అసంఖ్యాకమైన మహనీయులు త్యాగాలు చేసింది. వారి కలలు సాకారమైనందుకు మనందరం గర్వపడదాం. ఆ గర్వం, సంబంరం మొన్న ఆగస్టు 15 నాడు దేశమంతటా ఇంటింటా కనిపించింది. మహారాష్ట్ర ఔరంగాబాద్లో 16 వేల మంది విద్యార్ధులు ఈ సందర్భంగా జాతీయ గీతం ఆలపించి తమ దేశభక్తిని, మాతృదేశం పట్ల మమకారాన్నిచాటుకున్నారు. రాజస్థాన్లోని వివిధ పట్టణాల్లో ఏక కాలంలో లక్షకు పైగా జాతీయగీతం గానం చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇలాంటి అనేక దృశ్యాలు, సన్నివేశాలు ఆసేతు హిమాచలం దర్శనమిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ర్యాలీలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఇళ్ళపై, మోటారు వాహనాలపై పతాకాలను కట్టి ప్రతిఒక్కరూ తమ మాతృభూమి పట్ల తమ వంతు ప్రేమను చాటుతున్నారు. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం, తాజాగా డిజిటల్ విప్లవం వల్ల పల్లెలు సైతం సంపదతో తులతూగుతున్నాయి. ఆ సంతోషమే పరావర్తనమై ఈ వేడుకల్లో కనిపిస్తోంది. అందరి కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. భారతమాల పేర దేశమంతటా జాతీయ రహదారులు వేయడం అవసరమైన చోట్ల భారీ వంతెనలను నిర్మించడం, వీటితో పాటు హైస్పీడ్ రైళ్ళ ప్రవేశంతో దేశం మొత్తమ్మీద దృశ్యమే మారిపోయింది. జమ్ము నుంచి కాశ్మీర్ వరకూ వేగవంతమైన రైళ్ళులో ప్రయాణించే సౌలభ్యం లభించింది. ఇక సాగరమాల పేరిట తీర ప్రాంతాలనూ, ఓడరేవులనూ అభివృద్ధి పరిచి ఎగుమతులతో ఆర్థిక పుష్టికి దోహదపడటంతో యువత కలలకు రెక్కలొచ్చాయి. ఆ రెక్కలతో చంద్రయాన్, మంగళయాన్తో అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతోంది మన దేశం. ఇది ఒక అపురూప సన్నివేశం. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవడం ప్రజాస్వామ్య ప్రగతికి చిహ్నం. మరో పాతికేళ్ళలో స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి మేరా భారత్ మహాన్ కాదు, మేరా భారత్ విశ్వగురు అని చెప్పుకోవడం ఖాయం. అందుకు అన్ని శుభ శకునములూ ఈ అమృతోత్సవ సంబరాల వేళ అంబరాన్ని అంటుతున్నాయి. నిజమే కదా?

– వుప్పల నరసింహం
9985781799

(ఆంధ్రప్రభ సౌజన్యంతో….)

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.