News

మూడేళ్ళ‌ కుమార్తెను నేలకేసి కొట్టిన తండ్రి అలీఖాన్‌!

505views

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్​లోని బోరబండ నివాసి బాసిత్‌ అలీఖాన్‌, మాసబ్‌ట్యాంక్‌ సమీప ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన సనా ఫాతిమా 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమార్తెలున్నారు. ఏసీగార్డ్స్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సనా ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి. ఆటోడ్రైవర్‌గా వచ్చే సంపాదన చాలక, ఇతర కారణాలతో బాసిత్‌ కొన్నాళ్ళుగా పిల్లలపై విపరీతంగా కోప్పడటం, కొట్టడం చేస్తున్నాడు.

శనివారం సాయంత్రం పనికి వెళ్ళే సమయంలో మూడో కుమార్తె సకీనా ఫాతీమా(3) స్నానాల గదిలో ఆడుకుంటోంది. బయటకు రమ్మని తండ్రి పిలిస్తే వెళ్ళ‌లేదు. పట్టలేని కోపంతో గరిటెతో ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. అడ్డుకోబోయిన భార్యను నెట్టేశాడు. కిందపడి ఆమె స్పృహ తప్పింది. తర్వాత కుమార్తెను పైకెత్తి నేలకేసి కొట్టి బయటికెళ్ళిపోయాడు.

స్పృహ వచ్చాక చూసి కుమార్తె నిద్రపోతోందని తల్లి భావించింది. కొద్దిసేపటి తరువాత పాలు పట్టేందుకు లేపేందుకు యత్నించగా, శరీరం చల్లగా ఉండటం.. నోటి నుంచి నురగలు రావటంతో ఆందోళనకు గురై వెంటనే నిలోఫర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లింది.

పరీక్షించిన వైద్యులు ఉస్మానియాకు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త బాసిత్‌పై కేసు నమోదు చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి