News

గోవా బార్‌ కేసులో స్మృతి ఇరానీ కూతురికి ఊరట

190views

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు గోవాలో అక్రమంగా బార్‌ నిర్వహిస్తోందని కాంగ్రెస్‌ నేతలు కొద్ది రోజుల కింద‌ట‌ ఆరోపించారు. గోవాలో బార్‌ వ్యవహారం దేశంలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ఆ కేసులో స్మృతి ఇరానీ కూతురికి భారీ ఊరట లభించింది. అసలు గోవాలోని రెస్టారెంట్‌కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఆమె కుమార్తె జోయిష్‌ ఓనర్లు కాదని సోమవారం ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

వారికి అసలు లైసెన్సులే జారీ కాలేదని పేర్కొంది. వారు ఎన్నడూ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోలేదని స్పష్టం చేసింది. రెస్టారెంట్‌, ఆ భూమి కూడా స్మృతి ఇరానీ, ఆమె కుమార్తెకు చెందినది కాదని తెలిపింది. కాంగ్రెస్‌ నేతలు జైరాం రమేశ్‌, పవన్ ఖేరా, నెట్టా డీసౌజాలు ఆరోపణలు చేసిన క్రమంలో వారిపై రూ.2 కోట్లకు పరువు నష్టం దావాను కేంద్ర మంత్రి వేశారు.

ఆ కేసు విచారణ సందర్భంగా ఈ మేరకు స్పష్టం చేసింది ఢిల్లీ హైకోర్టు. ‘డాక్యుమెంట్లను పరిశీలిస్తే గతంలో ఎన్నడూ స్మృతి ఇరానీ, ఆమె కుమార్తె పేరున లైసెన్స్ జారీ కాలేదు. రెస్టారెంట్‌కు వారు ఓనర్లు కాదు. ఎప్పుడూ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం లేదు.’ అని పేర్కొంది. కాంగ్రెస్‌ నేతలు చేసిన ప్రకటనలు అపవాదు వేయాలనే దురుద్దేశంతో బోగస్‌గా అనిపిస్తున్నాయని అభిప్రాయపడింది. అలాగే.. ప్రజల దృష్టిలో పడేందుకు కొందరిని టార్గెట్‌ చేసుకున్నట్టు ఉందని పేర్కొంది. కాంగ్రెస్‌ నేతలు తమ ట్వీట్లను తొలగించకపోతే.. ట్విట్టర్‌ ఆ పని చేస్తుందని స్పష్టం చేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి