Articles

లెఫ్ట్ వాదమెప్పుడూ రైట్ కాదెందుకు?

734views

వామపక్ష వ్యాఖ్యాతలు, చరిత్రకారులూ బాబ్రీ అంశాన్ని హిందూ-ముస్లిం వివాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు.
శ్రీ రాముడు అక్కడ జన్మించాడా లేదా, అక్కడ రాముని గుడి ఉండేదా లేదా అనే విషయాన్ని అలహాబాద్ హై కోర్టు ఎప్పుడో తేల్చేసింది. ప్రస్తుతం ఉన్న వివాదం ఆ ప్రాంతంలో ఉన్న కొంత భూమిమీద యాజమాన్య హక్కుల కోసం సుప్రీం కోర్టులో ఉన్న దావాకి సంబంధించినది.
రామజన్మభూమి మీద సెప్టెంబర్ 10 , 2010 న అలహాబాదు హై కోర్టు ఇచ్చిన తీర్పు వామపక్ష మేధావులకు చాలా అసంతృప్తి కలిగించింది. ప్రస్తుతం సుప్రీం కోర్టు ఎనిమిది వారాల గడువుతో ఒక మధ్యవర్తిత్వ పానెల్ ఏర్పాటు చేసాక ఈ అసంతృప్తి మరి కాస్త పెరిగింది. ఇప్పుడు ఈ విషయాన్ని రెండు మతాలకి సంబంధించిన వివాదంగా ప్రచారం చేయడం కోసం, అలాగే మధ్యవర్తిత్వం కోసం నియమించిన కమిటీ యొక్క విశ్వసనీయతని ప్రశ్నించడం కోసం ఒక పధ్ధతి ప్రకారం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రతాప్ భాను మెహతా చాలా నేర్పుగా చరిత్రలో మధ్య యుగ కాలాన్ని శ్రీరాముని కాలంగా పరిగణించి, శ్రీరాముని యొక్క చారిత్రికతని ప్రశ్నించాడు. 1989 లో జె.ఎన్.యూ లోని చరిత్ర అధ్యయన కేంద్రాన్ని దుర్వినియోగపరుస్తూ “The Political Abuse of History: Babri-Masjid Ramjanmabhumi Dispute— An Analysis by Twenty-Five Historians ” అనే పుస్తకాన్ని ప్రచురించడం ద్వారా వామపక్ష చరిత్రకారులు ఈ దుష్ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని, శ్రీరాముడు చారిత్రిక వ్యక్తి కాదు, అయోధ్య అనేది ఒక ఊహాజనిత నగరం, శ్రీరాముని ఆరాధించడం కేవలం 300 సంవత్సరాల క్రితమే ప్రారంభం అయింది అనే అవాస్తవాలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.

మరో వైపు, సంస్కృత పండితులైన మారిస్ వింటెర్నిజ్ (History of Indian Literature Vol, I-III), A.A. మేక్డొనాల్ (A History of Sanskrit Literature ), A.B. కీత్ (A History of Sanskrit Literature), జాన్ బ్రాకింగ్టన్ (Righteous Rama: The Evolution of an Epic) లాంటి వాళ్ళు రాసిన గ్రంధాలలో రామ చరితము దాదాపు క్రీస్తు పూర్వము 5 వ శతాబ్దము నాటికి చెప్పబడినదనీ, దానిని వాల్మీకి మహర్షి క్రీస్తు పూర్వం నాలుగు లేదా మూడవ శతాబ్దంలో గ్రంథస్థం చేశాడనీ పేర్కొన్నారు.

అలాగే 1976 -1971 మధ్య కాలంలో అవధ్ ప్రాంతాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకులైన విలియం ఫించ్, జెసూట్ జోసెఫ్ టియాఫెన్తాలేర్ లాంటివాళ్లు వ్రాసిన విషయాలు చూస్తే, ఆనాటి కాలంలో ప్రజలు శ్రీరాముని జన్మ స్థలముతో ఎంతగా మమేకమయ్యారో అర్ధమవుతుంది. నిజానికి, అక్కడి ముస్లిమ్స్ కూడా రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా ఉన్నారు.

అయినప్పటికీ వామపక్ష మేధావులు దీనిని మతపరమైన సమస్యగానే చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పుని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని వాళ్ళు భావించారు. కానీ ఆర్.ఎస్.ఎస్ అలా చేయకపోవడం వాళ్లకి జీర్ణం కాలేదు. అందుకని వాళ్ళు ఇప్పుడు మధ్యవర్తిత్వానికి నియమించిన ప్యానల్ నే తప్పు పడుతున్నారు. ఆ ప్యానల్ ని ఏర్పర్చిన నాటి నించీ వాళ్ళు శ్రీ శ్రీ రవి శంకర్ గారి యోగ్యత గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మెహతా తాను రాసిన వ్యాసములో ఎటువంటి ఆధారాలు చూపించకుండానే ‘రామ జన్మభూమిలో ఆలయం నిర్మించకపోతే దేశం లో హింస చెలరేగుతుందని శ్రీ శ్రీ రవి శంకర్ దేశం లోని వ్యవస్థలను బెదిరిస్తున్నారు’ అని వ్రాసారు.

కానీ శ్రీ శ్రీ రవి శంకర్ ఎప్పుడూ సంస్థలను బెదిరించడం కానీ, ఆలయం నిర్మించకపోతే హింస చెలరేగుతుందని వాదించడం కానీ చేయలేదు. వాస్తవానికి, సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పుని వెలువరించడానికి కొన్ని నెలల ముందు నుంచే ఆయన ఈ విషయంలో మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్నారు. శాంతిని నెలకొల్పడానికి వారు చేస్తున్న కృషిని గుర్తించి చాలా దేశాలు ఆయనని గౌరవించాయి. సమస్యను పరిష్కరించడం లో ఆయన ఒక అంతర్జాతీయ స్థాయి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. కేవలం వారు హిందూ మతానికి చెందిన ఒక ఆధ్యాత్మిక గురువు కాబట్టి వామ పక్షాలు ఆయనపై పగ పట్టాయి.

వారి సంస్థ ‘ఆర్ట్ అఫ్ లివింగ్’ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అలాంటప్పుడు ఏ ఆధారాలతో ‘ ఆయన (శ్రీ శ్రీ రవి శంకర్) ఆధునిక వ్యాపారవేత్తలోని సమాజానికి రుచించని అంశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఆయనకి ఆధ్యాత్మిక విషయాలకన్నా అధికారానికి దగ్గరవడం ముఖ్యమని’ మెహతా వ్రాసారో మనకి అర్ధం కాదు. ప్రజాదరణ పొందుతున్న ఆధ్యాత్మిక గురువులను నిందించడం ఇప్పుడు వామపక్షాల ఆయుధాగారం లో ఉన్న ఒక ఆయుధం. అయితే వాస్తవికతకు చాలా దూరం జరిగిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏమంత సాధించలేరు. శ్రీరాముని జన్మస్థలాన్ని ఈ దేశంలో అన్ని మతాల వారు గౌరవిస్తున్నారని, వారి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తే అది వాళ్లనే దహించివేస్తుందనే సత్యాన్ని వామపక్ష మేధావులు అర్ధం చేసుకోలేకపోతున్నారు.

 

Translated to telugu by Shri Venkata Seshasai Deevi.