NewsSeva

నెల్లూరులో సేవాభారతి బాలమేళా.

924views

నెల్లూరులో సేవాభారతి సేవాబస్తీలలో గ్రామాలలో నిర్వహిస్తున్న అభ్యాసికల బాలమేళా నెల్లూరులోని స్థానిక బాలాజీనగర్ త్యాగరాజ కళ్యాణమండపములో జరిగినది. మొత్తం 10 అభ్యాసికలనుండి 180 మంది బాలబాలికలు పాల్గొన్నారు. వివిధ ఆటలపోటీలు వక్తృత్వ, క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులివ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా అశ్విని మెడికల్స్ అధినేత శ్రీ ఎక్కలి సూర్యప్రకాశ్ పాల్గొన్నారు. సేవాభారతి జిల్లా కార్యదర్శి మరియు సామాజిక సమరసత రాష్ట కార్యదర్శి శ్రీ కోడూరుసత్యం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్యవక్తగా ఆరెస్సెస్ ఆం.ప్ర ప్రాంత సహసేవాప్రముఖ్ శ్రీ కొండారెడ్డి మార్గదర్శనం చేశారు. శ్రీ కొండారెడ్డి మాట్లాడుతూ బాల్యం నుంచే పిల్లలకు తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా పిల్లలలో ఉన్నత సంస్కారాలను, దేశభక్తిని పెంపొందించవచ్చని, ఆ విధంగా ఉత్తమ పౌరుల నిర్మాణం జరుగుతుందని అన్నారు. శ్రేష్ఠులైన వ్యక్తుల ద్వారానే సమాజము, దేశము ఉన్నతిని సాధించగలుగుతాయని, ఉచిత శిక్షణా తరగతుల ద్వారా సేవా భారతి, పిల్లలలో సంస్కారాలను నింపుతోందని తెలిపారు. సేవాభారతి చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ తమ యొక్క సహకారం అందించాలని కోరారు.

అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన బాల బాలికలకు బహుమతులు ప్రదానం చేశారు.  చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.