
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లో ఉగ్ర శిబిరాలపై భారత్ భీకరంగా దాడి చేసిన సంగతి తెలిసిందే . నియంత్రణ రేఖను దాటి బాలాకోట్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో దాదాపు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్ర శిబిరాల్లో బాలాకోట్ శిబిరం చాలా పెద్దది. దాదాపు 6 నుంచి 7 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. ఇక్కడ దాడి జరిగిందంటే మృతుల సంఖ్య ఎక్కువే ఉంటుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. దాడిపై భారత ప్రభుత్వం ఇంతవరకూ అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు పాకిస్థాన్ మాత్రం ఈ వార్తలను తిప్పికొడుతోంది. పాక్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన భారత యుద్ధ విమానాలను తాము సమర్థంగా తిప్పికొట్టామని ఆ దేశ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ అసిఫ్ గఫూర్ తెలిపారు. తమ వైపు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.
పాకిస్థాన్ కుట్ర..! తిప్పికొట్టిన భారత్:
అహ్మదాబాద్ : ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి చేసిన కొద్దిసేపటికే పాకిస్థాన్ కి చెందిన డ్రోన్ భారత్ భూభాగంలోకి రావడం కలకలం రేపింది. గుజరాత్ లోని కచ్ అంతర్జాతీయ సరిహద్దును ఆనుకుని ఉన్న నలియా ఎయిర్ బేస్ సమీపంలో ఉదయం 6 గంటల 30 నిమిషాలకు దానిని గుర్తించిన వాయుసేన సిబ్బంది కూల్చివేశారు.





