ArticlesNews

‘కాస్ట్’ వ్యవస్థ – పాశ్చాత్య క్రైస్తవ పునాదులు

Side border of colorful question marks on multicolored paper in a random scatter over grey with copy space
105views

న సామాజిక వ్యవస్థకు పాశ్చాత్య క్రైస్తవ మేథావులు, మిషనరీలు పెట్టిన పేరు ‘కాస్ట్’. ఎంతో విస్తృతంగా గతనాలుగు శతాబ్దాల నుండి పరిశోధనలు చేసి కూడా దాని మూలాల గురించి వారు ఒక నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయారు. ‘కాస్ట్’ వ్యవస్థ క్రూరమయిందనీ, అమానుషమయిందనీ, యదేచ్ఛగా మానవహక్కుల ఉల్లంఘనకు కారణభూతమయిందని వారు ఆరోపిస్తుంటారు. హిందూ సమాజం ఒక నిచ్చెన మెట్లవ్యవస్థ అని, హెచ్చు తగ్గు భేదాలతో కునారిల్లుతున్నదని, వివిధ కాస్ట్స్ మధ్య మంచంపొత్తు, కంచంపొత్తు లేని కారణంగా సామాజిక ఐకమత్యం లేదని, కుల వైషమ్యాలు సర్వ సామాన్యమని, అంటరానితనం, రక్త స్వచ్ఛత (Purity), మైల (Pollution) వంటి భావాలకు హిందువులు దాసులని విశ్లేషిస్తుంటారు.

అనైతిక, అమానుష వ్యవస్థ :

కాస్ట్ వ్యవస్థ ఒక అనైతిక సామాజిక వ్యవస్థ అని, వివక్ష అన్ని నైతిక సూత్రాలకు విరుద్ధమని, అటువంటి వివక్షను సర్వసామాన్యం చేసిన సామాజిక వ్యవస్థ అనైతికతను విధిగా పాటించవలసిన కర్తవ్యంగా చేస్తున్నదని, అనైతికతను, వివక్షను విధిగా, ఉత్తరదాయిత్వంగా చేసిన సామాజికవ్యవస్థ ప్రపంచంలో మరొకటిలేదని కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉంటారు.

ఆ వ్యవస్థను తిరస్కరించకుండా, అందులోనే కొనసాగే వ్యక్తులు అలాంటి దురన్యాయాలను తమ విధిగా భావించి నడచుకోవటంలో వింతేమీ లేదని వారి అభిప్రాయం. భారతీయులు హేతుబద్ధంగా ప్రవర్తిస్తుంటారనిన్నీ, చట్టాలను అనుసరించి నడుస్తుంటారనిన్నీ కూడా పేరు పడ్డారు. కానీ సామాజిక స్థాయిలో వారి ప్రవర్తన తద్భిన్నంగా ఉండటం, అనైతిక, సహేతుకంకాని సామాజిక వ్యవస్థను అంగీకరించి, తదనుగుణంగా నడుచుకోవటం అనేక మంది పాశ్చాత్యమేథావులను తికమక పెడ్తున్న అంశం.

పాఠ్యగ్రంథాలలో భారతీయ సామాజిక వ్యవస్థ గురించి బహుళ ప్రచారం పొందిన ఈ కథనాలే ఉన్నాయి. తరతరాలుగా అనైతిక, అమానుష నియమనిబంధనలను గౌరవిస్తూ, పాటిస్తూ, వాటినే తమ పిల్లలకు బోధిస్తూ హిందువులు జీవిస్తున్నారని, దానితో వివక్షకు వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు చేసినా, సగటు భారతీయుడి దృక్పథంలో, తీరులో ఎటువంటి మార్పు రావటంలేదని వారు సిద్ధాంతీకరిస్తున్నారు. కాస్ట్ సంఘర్షణలు, వైషమ్యాలు సమకాలీన భారతదేశంలో ఇంకా సజీవంగానే ఉన్నాయని, సామాజికవ్యవస్థ యొక్క అనైతికత, అమానుషత్వానికి సంబంధించి బలమైన సాక్ష్యాధారాలు వారి కళ్ళ ఎదుట కనిపించినా, వారికి స్వానుభవంలోకి వచ్చినా హిందువులు ఆ వ్యవస్థనే పట్టుకొని వేళ్ళాడుతూ, దాని నియమనిబంధనలను, విధి నిషేథాలను పాటించటం ఆశ్చర్యం కల్గించే అంశమని
పాశ్చాత్య మేథావులు వ్రాశారు.

పాశ్చాత్యుల కథనాలు వాస్తవమే అయితే, కాస్ట్ వ్యవస్థకు గల శక్తి సామర్ధ్యాలు అపారమని అనుకోవలసి వస్తుంది. ఎందుకంటే పరిశోధకులు గుర్తించిన అనైతికతను, అమానుషత్వాన్ని ఇన్ని యుగాలుగా, ఇన్ని తరాలుగా భారతీయులు గుర్తించలేకపోయారా? నిజంగా అంత అమానుషమైనది, అసౌకర్యమైనది అయితే భారతీయ సమాజంలో ఏనాడో అంతర్యుద్ధం రావాలి కదా? ఎందుకు రాలేదు? అంటే భారతీయ కుల వ్యవస్థపై ఈ పాశ్చాత్య మేథావులు చేస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలో, అర్థ సత్యాలో అయ్యుండాలి కదా? ఆ వ్యవస్థలో సభ్యులు కాని వారికి ఆ వ్యవస్థ యొక్క అమానుషత్వం తెలుస్తున్నది. అనైతికత ఇట్టే కన్పడుతున్నది. అంటే లోపలి వారు ఆ వ్యవస్థయొక్క ‘నిజస్వరూపాన్ని’ పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారంటే, తెలుసుకొన్నా దాన్ని సమూలంగా నిర్మూలించటానికి గాని, సంస్కరించటానికి గాని గట్టి ప్రయత్నం చెయ్యటంలేదంటే, అది బయటి వారి పరిశీలనా, పరిశోధనా ఫలితంగా ఏర్పడిన అభిప్రాయమే తప్ప వాస్తవం కాదేమో అన్న అభిప్రాయం కలుగకమానదు.

‘విగ్రహారాధకుల హీనమతం’ యూదుమతమే :

పాశ్చాత్యులు యూదులను, పాగాన్లను విగ్రహారాధకులుగా పేర్కొంటారు. 17వ శతాబ్దంలో మనదేశానికి వచ్చిన విదేశీ యాత్రికుల రచనలు, మిషనరీల నివేదికల ఆధారంగా, నాలుగు తెగలుగా, అనేక ఉపతెగలుగా విభజించబడిన సామాజిక వ్యవస్థగల విగ్రహారధకుల దేశంగా పాశ్చాత్య మేథావులు మనదేశాన్ని గుర్తించారు. సామాజిక విభజనకు పుట్టుక, రక్త స్వచ్ఛత ఆధారమని, వాటి కారణంగానే వివిధ ‘కాస్ట్స్’ యొక్క సామాజిక స్థాయి నిర్ణయింపబడేదని వారు అనుకొన్నారు. కానీ అందుకై వారు ఎట్టి సర్వేక్షణలు చేయలేదు. అట్టి అభిప్రాయాన్ని వారు పెద్దగా విచారించకుండానే ఏర్పరచుకున్నారు.

జాతి ఆధారంగా ఏర్పడిన దేశాల నుంచి వచ్చిన పాశ్చాత్యులకు ఎక్కువ జనాభా గలిగి, వివిధ సంప్రదాయాలతో, సామరస్యంగా పరిఢవిల్లుతున్న హిందువులను ఒకే జాతిగా, ఒకే దేశానికి చెందినవారిగా గుర్తించటం ఇష్టం లేకపోయింది. ఎంతో వైవిధ్యం, భిన్న సంప్రదాయాలు, వాటితోపాటుగా హెచ్చుతగ్గుల సామాజికవ్యవస్థ ఉన్న దేశ ప్రజలందరూ ఒకేజాతికి ఎలా చెందుతారన్న ప్రశ్నను లేవదేశారు. వలసపాలనా కాలంలో జనాభాలెక్కల సేకరణ మొదలయింది. వివిధ ‘కాస్ట్స్’కు చెందిన హిందువుల సామాజికస్థాయిని నిర్ణయించి, వర్గీకరించే పనికి వారు పూనుకొన్నారు. కానీ అది అంత తేలికైన విషయంకాదని వారికి అర్ధమయింది. అయితే అందుకు వారు ఒక తేలికైన మార్గాన్ని ఎంచుకున్నారు. సామాజిక స్థాయిని నిర్ణయించటానికి బ్రాహ్మణులనే కొలమానంగా తీసుకొని, బ్రాహ్మణులకు, ఇతరులకు మధ్య ఉన్న దూరాన్ని బట్టి ఒక ‘కాస్ట్’ యొక్క సామాజిక స్థాయిని నిర్ణయించే దుస్సాహసం, దుష్ట ప్రయత్నం వారు చేశారు. వారు అనుసరించిన పద్ధతి శాస్త్రీయం కాకపోయినప్పటికీ విభజించి, పాలించు అనే వారి లక్ష్యానికి అనుగుణంగా ఉన్న కారణంగా ఆ పద్ధ్హతినే అనుసరించి హిందూ సమాజాన్ని వర్గీకరించారు. వారి సమాజాలలో ప్రాచుర్యంలో ఉన్న జాతి, తెగ, హీనమతం (Heathen Religion) అనే భావనలను (Concepts), వాటి చుట్టూ అల్లిన సిద్ధాంతాలను మన సమాజానికి కూడా వర్తింపజేశారు.

పాతనిబంధన యూదులతో సారూప్యం :

రోజిరిస్ (Rogerius) 1651లో వ్రాసిన తన పుస్తకం The Open Door to Hiden Heathendom లో నాలుగు ప్రధాన తెగలుగా విభజించబడ్డ విగ్రహారాధకుల జాతికి చెందినవారిగా భారతీయులను అభివర్ణించాడు. వేదం, వారి ప్రధాన న్యాయగ్రంధం (Lawbook) అని పేర్కొన్నాడు. అంతేకాక బ్రాహ్మణులకు, పాతనిబంధన (Old Testament) యూదులకు మధ్య సారూపత్య ఉందని, పాతనిబంధనలోని అనేక కథలను, ఆరాధనా పద్ధతులను బ్రాహ్మణులు కాపీ కొట్టారని ఘంటాపదంగా చెప్పాడు. రోజరస్, మరియు అతని వంటి అనేకమంది ఇతర రచయితల చేత కనుగొనబడిన పాతనిబంధన యూదులకు మరియు బ్రాహ్మణులకు మధ్యనున్న సారూప్యత పాశ్చాత్యమేథావులకు భారతదేశంలోని మత, సామాజిక వ్యవస్థలను అర్ధం చేసుకోవటానికి తేలికమార్గం అయింది. దానితో పురాతన ఇజ్రాయిల్ జాతికి చెందిన ఒకశాఖగా భారతజాతిని వారు భావించటం మొదలెట్టారు. పాత నిబంధన ప్రకారం, యూదుతెగలు దేవునితో చేసుకొన్న ఒడంబడిక (Covenant) ప్రకారం ఒకజాతిగా ఏర్పడ్డారు. అందులో లెవి తెగకు చెందిన వారు పూజారులుగా నియమించబడ్డారు. ఈ ‘లెవియట్లు’ పురోహితులుగా, వంశపారంపర్యంగా ఒకతరం తర్వాత మరొకతరంలో పనిచేస్తూ వచ్చారు. ఈ పురోహితవర్గం యూదుమతంలో ప్రధాన పాత్ర పోషించింది. పాపం, మాలిన్యం (Impurity) లను నిర్వచించి, నిర్ధారించి, అందుకు తగిన పరిహారాన్ని, శిక్షలను విధించే క్రమంలో వారిదే ప్రముఖపాత్ర. అనేకసార్లు నిర్ణ యాత్మక పాత్ర కూడా.

పాశ్చాత్యులు. క్రైస్తవ మేధావులు యూదుమతాన్ని విమర్శించేందుకు ఉపయోగించిన మేథోసాధనాలు భావనావనరుల (Conceptual Resources)తో మనదేశపు సాంస్కృతిక మర్యాదల యోగ్యతాయోగ్యతలను, సామాజిక కట్టుబాట్ల హేతుబద్ధతను, ధార్మిక విశ్వాసాల తాత్విక పునాదులను విశ్లేషించటం మొదలెట్టారు. భవిష్యత్తు పరిశోధకులకు సైతం ఇవే మార్గదర్శకం అయ్యేటట్లు చేశారు.

మోజస్ & మనువు:

ఒక రచయిత తర్వాత మరొక రచయిత, ఒక పరిశోధకుడి తర్వాత మరొక పరిశోధకుడు హిందువులమతం యూదు మతం యొక్క రూపాంతరం తప్ప మరేది కాదని గోబల్స్ ప్రచారం చేశారు. ఉదాహరణకు 1776లో Code of Gentoo Law కు ఉపోద్ఘాతం వ్రాస్తూ Nathaniel Halhed యూదుల మతానికి, హిందూమతానికి మధ్య ఉన్న పోలికలను, సారూప్యతను గురించి వ్రాశాడు. ఆ గ్రంథం సందర్భ రహితంగా క్రోడీకరించబడ్డ కొన్ని ధర్మశాస్త్రాల భాగాలకు ఆంగ్లతర్జుమా మాత్రమే.

యూదులకు మోజెస్ చాలా కీలకమైన ప్రవక్త. బానిసత్వం నుండి యూదులను విముక్తి చేసిన ప్రవక్త ఆయన. సీనాయ పర్వతం వద్ద దేవుని ఆదేశాలను, ఆజ్ఞలను యూదులకు చెప్పిన వాడు మోజెస్. 17వ శతాబ్దపు ప్రొటెస్టెంటు క్రైస్తవ రాజకీయ తత్త్వవేత్తల ఆలోచనా ధోరణిని పాతనిబంధన, మోజెస్ న్యాయసూత్రాలు అత్యంత ప్రభావితం చేశాయి.

పాశ్చాత్య క్రైస్తవ మేధావులు 17వ శతాబ్ది చివరి నుండి ఒక నిర్ధిష్ట అభిప్రాయానికి వచ్చారు. ప్రతి నాగరిక జాతికి మోజెస్ వంటి ఒక ప్రవక్త లేక తొలి ధర్మాచార్యుడు ఉండి ఉంటాడని, ఆ జాతి యొక్క మౌలిక న్యాయసూత్రాలను ఆయనే ఇచ్చివుంటాడని వారు ప్రగాఢంగా నమ్మేవారు. వివిధ తెగలను ఏకీకృతం చేసి, ఒక జాతిగా వారిని రూపొందించే క్రమంలో అందుకు చొరవచూపిన వ్యక్తులు దేవుని పేరుతో ఆపని చేస్తున్నట్లుగా చెప్పుకొని, దేవుని ఆజ్ఞలుగా కొన్ని ప్రాథమిక సూత్రాలను ఆ తెగల ప్రజలకు యిచ్చారు. మోజెస్ కూడా అలాంటివాడే. ప్రతిజాతికీ ఒక మోజెన్ ఉండే ఉంటాడని పాశ్చాత్య మేధావులు గాఢంగా నమ్మేవారు. మనదేశానికి సంబంధించి కూడా అటువంటి మొట్టమొదటి న్యాయసూత్రాలను యిచ్చిన వ్యక్తికోసం 18వ శతాబ్దిలో ఆంగ్ల మేధావులు అన్వేషించారు. మనుధర్మస్మృతి వారికంట పడినపుడు మనువును హిందువుల మోజెస్ గా వారు ప్రకటించారు. దేవుని చే ప్రేరేపింపబడి, మనువు హిందువుల ఆచార వ్యవహారాలను వారి మతంలో అంతర్భాగం చేసి న్యాయసూత్రాలను రూపొందించాడని నిర్ధారించి, హిందూజాతికి ఆద్యుడు, సంస్థాపకుడు మనువే అని వారు ప్రకటించారు. ఆవిధంగా రూపురేఖలలోనూ, లక్షణాలలోనూ భారతదేశపు, ఇజ్రాయిల్ దేశపు సామాజిక వ్యవస్థల మధ్య సారూప్యత కనుగొన్న తర్వాత, యూదుమతానికి సంబంధించిన ఇతర అంశాలు సైతం మనకు అన్వయించారు.

క్రైస్తవ దృష్టికోణం నుండే అధ్యయనం, కువిమర్శలు

హైందవ సంస్కృతి వెల్లి విరిసిన తీరును తమకు అనుభవంలో ఉన్న క్రైస్తవ అవగాహనా కోణం నుంచే వారు అధ్యయనం చేశారు. హిందువులలోనూ సంఘ బహిషృతులు ఉన్నారనే విషయాన్ని వారు గమనించి, యూదులలోనూ సంఘ బహిషృతులు ఉండేవారన్న విషయాన్ని వారు గుర్తుకు తెచ్చుకున్నారు. మోజెస్ చట్టాన్ని అతిక్రమించే వారిని యూదులు తమ సంఘం నుండి వెలివేసేవారు. యూదుల సంఘబహిష్కరణ ఆచారం క్రైస్తవమేధావులను భారతదేశం గురించి కూడా అటువంటి ప్రతిపాదన చేయటానికి పురికొల్పింది. హిందువులలో కొందరు ఆ ‘కాస్ట్ వ్యవస్థ’కు, సంప్రదాయలకు దూరంగా ఉన్నారని వారు తీర్మానించారు. 17వ శతాబ్దం మధ్యలోనే రోజరిస్ పెరియకులస్థుల గురించి వ్రాస్తూ, విగ్రహారాధకులు నాలుగు ప్రధాన తెగలకూ వారు చెందరని, పట్టణాలలోనూ, గ్రామాలలోనూ వారు ప్రత్యేకంగా నివసిస్తుంటారని వ్రాశాడు. ఆ తర్వాత శతాబ్దాలలో వారిని “ఔట్కాస్ట్స్”, “కాస్ట్ లెస్” లేదా “అంటరానివారు” అని వారికి పేర్లు పెట్టింది ఆంగ్లమేధావులే. వారి పట్ల మిగిలిన వారు అమానుషంగా ప్రవరిస్తారని, వారిని ఏవగించుకొంటారని కల్పించి వ్రాశారు.

పాశ్చాత్యమేథావులు బైబిలు పాతనిబంధన కాలక్రమం (chronology), వారి జాతిచరిత్ర (Ethnology) చట్రంనుండే తమ వలసదేశాల ప్రజల మత, సామాజిక అంశాలను అధ్యయనం చేశారని చెప్పటానికి ఇప్పుడు బలమైన సాక్ష్యాధారాలు వెలుగులోకి వస్తున్నాయి. అధ్యయనం చేసేవారికి అవగాహన మరియు వివేచనాపటిమ లోపించినపుడుగానీ లేదా దురుద్దేశ్యాలు కలిగినప్పుడు గానీ కు వ్యాఖ్యలు చేస్తారు. యూదుజాతి, యూదుల మతం యొక్క ఒకానొక పాఠభేదం (Variant) గానే హిందువులను, భారతీయ సంస్కృతిని వారు పరిగణించటం ఆ కోవలోనిదే. ‘కాస్ట్’ గురించి వారు చేసిన సిద్ధాంత రాద్ధాంతాలకు కూడా ఆ దురుద్దేషమే కారణం కావచ్చు. బైబిలు పాతనిబంధనలో యూదులగురించి చెప్పబడిన విషయాలన్నీ, భారతదేశం గురించి ప్రతిపాదనలు చేయటానికి ప్రొటెస్టెంటు క్రైస్తవులకు ఎంతో ఉపయోగపడ్డాయి. హిందూ దేశాన్ని, దాని ప్రజలను, వారి సంప్రదాయాలను అర్ధం చేసుకోవటానికి పురాతన ఇజ్రాయిల్ రూపంలో వారికి ఒక నమూనా దొరికింది. ఆ నమూనాయే లేకుంటే, భారతదేశంలో వివిధ తెగలకు చెందిన ఒక క్రమానుగతి సామాజికవ్యవస్థ ఉందని, మనువు దాని సంస్థాపకుడని, ఆ వ్యవస్థలో పురోహితవర్గానిదే పెత్తనం లేక ప్రాబల్యం అని, పురోహితవర్గానికి ప్రత్యేక హక్కులు, విశేషాధికారం ఉండేవని తీర్మానం చేయగలిగేవాళ్ళు కాదు.

ఈనాటికీ పాఠ్య గ్రంథాలలో హిందువులు అనేక కాస్ట్ లుగా విభజించబడి ఉన్నారని, బ్రాహ్మణులు ప్రత్యేకాధికారం గల పురోహితవర్గం అని పేర్కొంటున్నారు. అంతేకాక కొన్ని సామాజిక వర్గాలవారు ఒకప్పుడు సామాజిక కట్టుబాట్లు ఉల్లంఘించిన కారణంగా వెలివేయబడ్డవారి వారసులని పేర్కొనటం కూడా కొనసాగుతూనే ఉంది.

పాశ్చాత్యమేథావులు ‘హీనమతస్థు’ల విగ్రహారాధనను ఎప్పుడూ నిరసిస్తూ ఉండేవారు. అవహేళన చేసేవారు. ఇతర మతాలను అనుసరించేవారిని, తమకంటే భిన్నమయిన విశ్వాసాలు కల్గిన వారిని విమర్శిస్తూ ఉండేవారు. తమ మతమే సత్యమతమని, తాము నమ్మిన దేవుడే గొప్పవాడని, తమ గ్రంథమే దైవగ్రంథమని క్రైస్తవమేథావులు చెప్పుకునేవారు. మనదేశాన్ని, దాని సంస్కృతిని, సంప్రదాయాలను నిష్పక్ష వైఖరితో వారు పరిశీలించలేదు. తమ గొప్పతనాన్ని చెప్పుకోవటానికి, నిలుపుకోవటానికి హిందువుల మత విశ్వాసాలను ఎందుకూ పనికిరానివిగానూ, హిందూ సామాజికవ్యవస్థను అమానుషమైనదిగానూ వారు చిత్రీకరించేవారు. అనైతిక, అమానుష ఆదేశాలను నైతికవిధిగా హిందూ సంఘంపై బ్రాహ్మణ పురోహితవర్గం రుద్దిందని విమర్శించేవారు. 17వ శతాబ్ది నుండి వారు, వీరు అని భేదం లేకుండా సామాజిక వ్యవస్థను బ్రాహ్మణులు తమ స్వార్ధప్రయోజనాలకోసం ఏర్పాటు చేశారని అన్ని పాశ్చాత్య దేశాల క్రైస్తవ మేథావులు ఏక కంఠంతో విమర్శించటం మొదలెట్టారు.

శృతిమించిన ఈ విమర్శ వెనుక కూడా క్రైస్తవ మతశాఖల మధ్య ఉన్న విభేదాలే కారణం అంటే ఆశ్చర్యం కల్గుతుంది. కర్మకాండకు, అర్ధం లేని సంప్రదాయాలకు ఊడిగం చేసే మతంగా యూదుల మతాన్ని వారు విమర్శించారు. బైబిలు కొత్త నిబంధన పాతనిబంధనను రద్దుచేసిందని, లేదా చెల్లుబాటు కాదని తేల్చిందని, అయినప్పటికీ యూదులు పాతనిబంధనను పట్టుకొని వేళ్ళాడుతున్నారని, ఇదికూడదని క్రైస్తవ తత్త్వవేత్తలు తీవ్ర విమర్శలు చేశారు. యూదులు వారి దేవుడితో చేసుకున్న ఒడంబడిక (Covenant) పత్రం, అందులో పేర్కొనబడ్డ ఆదేశాలు, ఆంక్షలు, నియమనిబంధనలు క్రైస్తవమత ఆవిర్భావంతో సారహీనం (Superflous) అయ్యాయని, వాటిని పాటించనవసరం లేదని, యూదులు తమ జుడాయిజంను వదలి వేసి, క్రీస్తును అనుసరించాలని వారు పేర్కొన్నారు. కానీ యూదులు తమ మతాన్ని రద్దు చేసుకోలేదు. దానితో యూదుమతాన్ని శూన్యమతమని, కేవలం కర్మకాండకు అంకితమయిన మతమని విమర్శించటం మొదలెట్టారు. ఆ విమర్శలనే హిందువుల మత విశ్వాసాలకు కూడా వర్తింపజేశారు.

అదేవిధంగా రోమన్ కాథలిక్ చర్చి ఆగడాలకు, దురన్యాయాలకు వ్యతిరేకంగా మొదలయిన ప్రొటెస్టెంటు శాఖ చర్చి పురోహితవర్గంపై తీవ్ర విమర్శలు చేసింది. ఆ విమర్శలను కూడా హిందూ పురోహిత వర్గానికి వర్తింపజేశారు. పోప్, ఇతరమతాధికారుల ఆధిపత్యాన్ని వారు ప్రశ్నించారు. తిరస్కరించారు. ఇది క్రమేపి ‘పూజారి లేక పురోహిత వర్గమతం’ పట్ల విమర్శగా రూపొందింది. ప్రొటెస్టెంటు ఉద్యమం కాథలిక్ మతాన్ని, జూడాయిజంను తీవ్రాతి తీవ్రంగా విమర్శించింది. ప్రొటెస్టెంటు మత శాఖను క్రైస్తవ ఉదారవాద భావనలకు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలబెట్టారు. క్యాథలిక్, జూడాయిజంలను పురోహిత వర్గ నియంతృత్వానికి అర్ధంపర్ధం లేని ఆచారాలకు, కర్మకాండకు ప్రాధాన్యం యిచ్చేమతాలుగా దిగజార్చారు. ఈ నమూనా (Template)ను ఆ తర్వాత “తప్పుడు లేక అసత్య” (False) మతాలను విమర్శించటానికి వాడుకున్నారు. ఆ తర్వాత సెక్యులర్ పరిభాషలో పరమతాలను విమర్శించటానికి ఉపయోగించారు.

దేవుని పేరుతో పురోహిత వర్గం అర్థం పర్థంలేని ఆచారాలను, విగ్రహారాధనను తమ అధికార ప్రాబల్యాన్ని అడ్డుపెట్టుకొని సమాజంపై రుద్దిందని, ఆ పురోహితవర్గ నియంతృత్వ పోకడలను అడ్డుకొని, తప్పుడు మతాలనుండి మానవాళిని కాపాడాలంటే వారి దృష్టిలో సత్యమతమయిన క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చెయ్యాలని, అది తప్పనిసరిగా జరుగవలసిన ప్రక్రియ అని ప్రొటెస్టెంటు చర్చి భావించి, అందుకు పూనుకున్నది. ఆ కాలానికి చెందిన వారి గెజెట్స్, నిఘంటువులు, విజ్ఞాన సర్వస్వగ్రంథాలు ఇదే విషయాన్ని చెప్పాయి. క్రమంగా ఆంగ్ల విద్యాపారంగతులయిన భారతీయులు కూడా దాన్ని నమ్మటం మొదలెట్టారు.

క్రైస్తవంలో కులాచారాలకు అనుమతి :

19వ శతాబ్ది మొదటి దశాబ్దంలో ‘కాస్ట్’ వ్యవస్థ ‘అనైతికతను’ బయటపెడ్తూ అనేక రచనలను వెలువరించారు. ఛార్లెస్ గ్రాంట్ ఇలా వ్రాశాడు “నిరంకుశత్వం హిందూస్థాన్ ప్రభుత్వాలకే పరిమితంకాలేదు. అది అక్కడి సమాజపు మౌలిక, మూలాధారమైన, తిరుగులేని లక్షణం కూడా. అసహ్యకరమైన ఆ ప్రాణాంతకవ్యాధి ప్రభావంతో నాలుగు వర్ణాలకు చెందినవారు పనికిరాని వారుగా, దయనీయులుగా మారిపొయ్యారు. హిందూసమాజం అనైతిక సూత్రాలపై నిర్మాణం చెయ్యబడ్డది. కాస్ట్ వ్యవస్థ న్యాయానికి సంబంధించిన ప్రతి సూత్రానికీ వ్యతిరేకం. దాని నియమనిబంధనలు అమానుషమైనవి. అధర్మమైనవి. అన్ని రకాల సహోదరత్వ, ఉదార సంవేదనలను అది చంపివేస్తుంది”.

భారతదేశంలోని సామాజిక పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని, అసత్యమతం హిందువుల జీవితంలోని ప్రతి అంశాన్నీ ప్రభావితం చేస్తున్నదని, కాస్ట్ ను సత్యమతమైన క్రైస్తవవ్యాప్తి ద్వారా నిర్మూలించకపోతే, హిందువులకు ఉపశమనం కలగదని మత ప్రచారకులు, ఈస్టిండియా కంపెనీకి చెందిన మతోన్మాదులు పదేపదే విజ్ఞాపనలు పంపారు. అయితే భారతదేశం పట్ల కొంత సానుభూతిగల కొందరు మేధావులు, ఉద్యోగులు క్రైస్తవ మతవ్యాప్తి ద్వారా భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను ధ్వంసం చేయవద్దని హితవు చెప్పారు. దురదృష్టవశాత్తు వారి మాట చెల్లుబాటు కాలేదు.

‘కాస్ట్ వ్యవస్థ’ను అమానుషమైనదని వారు ఖండించినా ‘కాస్ట్’ భేదాలు, హెచ్చుతగ్గుల, అనైతిక విగ్రహారాధకవ్యవస్థ క్రైస్తవంతో పొసగదని వారు ఏనాడూ అనుకోలేదు. వాస్తవానికి వారు ఖండించిన అనేక పద్ధతులను భారతీయ క్రైస్తవసమాజంలోనూ, చర్చిలలోనూ ప్రవేశపెట్టటానికి వారికి అభ్యంతరం లేకపోయింది. ఉదాహరణకు కులాల వారీగా చర్చిలలో కూర్చోవటానికి, దైవపీఠం (Lord’s Table) దగ్గరకు వెళ్ళటానికి అనుమతించారు. 18వ శతాబ్దంలో ప్రసిద్ధి పొందిన మిషనరీలు ఎవరూ ‘కాస్ట్’ భేదాలను అంగీకారం కాదని ఎప్పుడూ ఖండించలేదు. అంతేకాక ‘కాస్ట్’ ఆచారాలను అనుసరించటాన్ని తప్పుపట్టలేదు కూడా.

కలకత్తాలో ఆంగ్లికన్ చర్చి రెండవబిషప్, 1859లో ఏమంటున్నాడో చూడండి. “ఐరోపాలో కాస్ట్ లేదా? అమెరికాలో కాస్ట్ లేదా? ఇంగ్లీషు చర్చిలలో గొప్పవారు, తక్కువవారు వేరువేరుగా కూర్చోవటం లేదా? మంచి దుస్తులు ధరించిన, ఎక్కువ కాస్ట్ కు చెందిన మనవాళ్ళు దైవపీఠం లేదా బలిపీఠం దగ్గఱకు వెళ్ళి ప్రార్ధన చేయటానికి ముందుకు వెళ్ళటం లేదా? మనదేశంలో ఉన్నవారు, లేనివారు వెళ్ళే పాఠశాలలు వేరువేరుగా లేవా? మనలో ‘పరియా’లు లేరా? ఇతర నాగరిక దేశాలలో కాస్ట్ లేకపోయినా, కాస్ట్ లతో వచ్చే హెచ్చుతగ్గభావనలు లేవా?
బిషప్ తన వాదన కొనసాగిస్తూ దేవుని దృష్టిలో అందరూ సమానమే అయినా, మనిషి దృష్టిలో ఖచ్చితంగా మానవులందరూ సమానంకాదని, ప్రతిసమాజంలోనూ హెచ్చు తగ్గులు ఉంటాయని, అంతేకాక అందరూ మానవులూ సమానంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడనేది ఒక సముచితమైన అభిప్రాయం అయినప్పటికీ, సామాజిక అంతరాలు ఉంటాయని, కనుక కాస్ట్ తేడాల గురించి పట్టింపులు అవసరంలేదని అన్నాడు.

17వ శతాబ్దంలో మలబార్ తీరంలో ఒక వివాదం చెలరేగింది. మతం మారినప్పటికీ కొన్ని కులాల వారు జంధ్యం ధరించటం, పిలక పెట్టుకోవటం, గంధం బొట్టు పెట్టుకోవటం మానలేదు. వాటిని మతాచారాలుగా భావించి, అనుమతి నిరాకరించాలా లేక కులాచారాలుగా భావించి అనుమతించాలా అన్న వివాదం చెలరేగి, పోప్ 15వ జార్జి వరకూ వెళ్ళింది. విచారణ చేసి భారతీయ క్రైస్తవులు తమ కులాచారాలు పాటించవచ్చని జంధ్యం, బొట్టు తీసివేయవలసిన అవసరం లేదని ఆయన తీర్పు ప్రకటించాడు. హిందూమతానికి సంబంధించి అవి అంత ప్రాముఖ్యంలేని అంశాలుగా పరిగణించటం వలననే పోప్ కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు మార్చుకోవలసిన అవసరం లేదని చెప్పాడు. అందుకే ఈనాటకీ మన దేశంలో కాథలిక్ మతస్థులు బొట్టుపెట్టుకుంటారు. మంగళసూత్రం, మెట్టెలు ధరిస్తారు.

క్రైస్తవానికి వివిధ దేశాలలో ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి. కొత్తగా క్రైస్తవ్యం స్వీకరించిన వారు విగ్రహారాధన చెయ్యకుండా ఉంటే చాలునని మతాధికారులు అభిప్రాయపడేవారు. క్రైస్తవం తొలినాళ్ళలో రోమన్ సామ్రాజ్యంలోనూ వారికి ఈ సమస్య ఎదురయింది. కొత్తగా మతం మారిన వారు తమ పాత పద్ధతులను, పాటించే వారు. తమ పాత దేవీ దేవతలకు మొక్కేవారు. అసత్య దేవుళ్ళను

పూజించటం అనేది రోమన్ సామ్రాజ్యం అంతటా ధృడంగా పాతుకొని పోయిందని క్రైస్తవ మతాధికారులు వాపోయేవారు. విగ్రహారాధన కొనసాగటం వారికి మింగుడు పడలేదు. అయినప్పటికీ ప్రయత్నపూర్వకంగా ఆ అలవాటును మాన్పించటం కోసం వారు కొత్త విశ్వాసులను భయపెట్టేవారు. విగ్రహాలను, దేవాలయాలను పగులగొట్టేవారు. క్రైస్తవమత పెద్దలు కొత్తవిశ్వాసులు తప్పనిసరిగా క్రైస్తవ దేవుని ప్రార్ధనా సమావేశాలకు హాజరుకావాలని ఆజ్ఞాపించేవారు. వారం వారం క్రమం తప్పకుండా క్రొత్త విశ్వాసులు చర్చి ప్రార్ధనలకు హాజరయ్యేలా చూసేవారు. ఏ రూపంలోనూ విగ్రహారాధనను అనుమతించేవారు కాదు. సహించేవారు కాదు. కానీ మిగిలిన విషయాలలో కొత్త విశ్వాసులకు స్వేచ్ఛను యిచ్చారు. చర్చి ప్రార్ధనలకు హాజరు అవటం, విగ్రహారాధన చెయ్యకపోవటం విశ్వాసులు తప్పని సరిగా చెయ్యవలసిన విధులు. ప్రపంచంలో మిగిలిన దేశాలలోనూ వారు యించుమించి ఇవే పద్ధతులను అమలుచేశారు.

ప్రొటెస్టెంట్ ల అభిప్రాయం :

హిందువులను, వారి హీనమతాన్ని కలిపి ఉంచినదేమిటో క్రైస్తవ మేథావులకు ఒక పట్టాన అర్ధం కాలేదు. ఎట్టకేలకు కలిపి ఉంచింది ‘కాస్ట్’ అని వారు తేల్చారు.

“కాస్ట్” హిందూ వ్యవస్థలో విడదీయరాని అంతర్భాగం. దానిని మతం అని పిలవబడుతున్న దాని నుండి ఏమాత్రం వేరు చేసినా హిందూయిజం ఒక పెద్ద గందరగోళంలోకి నెట్టివేయబడుతుంది. ‘కాస్ట్’ తప్ప హిందువులందరికీ సర్వసాధారణమైన అంశం మరొకటి లేదు కాబట్టి ఈ కీలకమైన వ్యవస్థే లేకపోతే, హిందూమతం దానంతట అదే కుప్పకూలుతుందని వారు భ్రమించారు. ‘కాస్ట్’ అనేది హిందూమతంలో ఒక పవిత్రమైన వ్యవస్థగా వారు భావించారు. దానితో ‘కాస్ట్’ను హిందువుల మత, సామాజిక వ్యవస్థల సహజ లక్షణంగా (Structural Property) వారు పేర్కొనటం మొదలెట్టారు.

క్రైస్తవ దృష్టికోణం ప్రకారం…. మత విధులకు, వ్యవహార విధులకు మధ్య తేడా ఉంది. మతానికి సంబంధించిన విశ్వాసాలు, విధులు దేవుని వల్ల నిర్దేశింపబడితే, వ్యవహారవిధులు మానవులచే నిర్ణయింపబడుతాయి. కనుక మత, వ్యవహార లేక పౌరవ్యవస్థలు వేరు వేరు. క్రైస్తవ సంస్కర్తలు లూథర్, కాల్విన్ ప్రకారం మానవుల అధికారం కేవలం రాజకీయ వ్యవహార విధులకే పరిమితమని, మత విషయాలకు సంబంధించి వారికెట్టి అధికారమూ లేదని చర్చి చట్టాల (Canon Laws)కు ఎట్టి ప్రాముఖ్యతా లేదని సూత్రీకరించారు. చర్చి, దాని అధికారులు భూమి మీద భగవంతుని ప్రతినిధులు కారు కనుక భగవంతుని ఉద్దేశ్యాలకు, లక్ష్యాలకు వారు భాష్యకారులు కాదని, కనుక మతాధికారులు చేసిన చట్టాలకు ఎట్టి విలువా లేదని తేల్చారు.

ప్రొటెస్టెంటు క్రైస్తవ మేధావులు ఈ విమర్శను హిందూమతానికి కూడా వర్తింపజేశారు. ‘కాస్ట్’కు సంబంధించిన వ్యవహార విధులకు (Civil Laws of Caste) భగవదనుమతి ఉందని చెప్పి, బలవంతంగా సంఘం మీద రుద్దారని వారు తేల్చి, ‘కాస్ట్’ కు లేని జవసత్వాలను దానికి కలిగించబడినవని వారన్నారు. అకారణంగా దాని అనైతిక విధినిషేదాజ్ఞల వలన ఎప్పుడో కుప్పకూలవలసిన కాస్ట్ తరతరాలుగా కొనసాగుతుందని వారు సిద్ధాంతీకరించారు.

ప్రొటెస్టెంటు క్రైస్తవ మత ప్రచారకుల ఉద్దేశంలో క్రైస్తవీకరణకు కులం పెద్ద ప్రతిబంధకమైంది. హిందూమతస్థులను కలిపి ఉంచింది. సువార్తను ప్రకటించినప్పటికీ పెద్ద ఎత్తున క్రైస్తవంలోకి ప్రజలను ఆకర్షించలేకపోవటానికి ప్రధాన కారణం కులమని వారు ప్రగాఢంగా అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయమే ‘కులం’ను మతంలో భాగంగా చేయటానికి వారిని పురికొల్పింది. హిందూమతంలో కులం అంతర్భాగమని, విగ్రహారాధకుల హీనమతంలో కులమే ప్రధానమైన అంశమని సిద్ధాంతీకరించటానికి, ప్రచారం చెయ్యటానికి దారి తీసింది.

ప్రొటెస్టెంటు క్రైస్తవశాఖది పైచేయి అయిన తర్వాత, పాశ్చాత్య క్రైస్తవ మిషనరీలు, వలసవాదులు, క్రైస్తవ పండితులు భారత దేశపు సమాజాన్ని అధ్యయనం చేసి, ఒక కొత్త భావ సముదాయానికి రూపకల్పన చేశారు. అదే “కాస్ట్ సిస్టమ్”. హిందువుల గురించిన వివిధ భావనల సమగ్ర సముచ్ఛయమది. దాని ప్రకారం హిందువుల జాతి యూదు జూతియొక్క రూపాంతరం తప్ప వేరుకాదు; బ్రాహ్మణ పురోహితవర్గం, వారి పద్ధతులు అసత్యమతానికి సంకేతాలు; వారి పద్ధతులు, సంప్రదాయాలు ఇతర అసత్యమతాలైన కాథలిక్, యూదు మతాలను పోలి ఉన్నాయి; వారిచే కల్పించబడి, అనుసరింపబడుతున్నవన్నీ దైవాజ్ఞల పేరుతో చలామణి అవుతూ విశ్వాసులను మోసం చేస్తున్నాయి; బాహ్య కర్మకాండ, అర్ధంపర్ధం లేని శుచి, అశుచుల చుట్టూ హిందూమతం పరిభ్రమిస్తూంటుంది; మతంలో వాటికే అత్యంత ప్రాముఖ్యత.

బ్రాహ్మణ పురోహిత వర్గం సమాజంలో సర్వోత్కృష్ట స్థానంలో ఉందని వాస్తవాలు పూర్తిగా విచారించకుండానే మిషనరీలు, వలసదారులు ప్రచారం చేశారు. హిందువుల పురోహితవర్గం వారిమత జీవితాన్నే కాక, సామాజిక జీవితాన్ని సైతం తమ గుప్పెట్లోకి తెచ్చుకోగలిగారని, పౌరస్మృతులు అంటే సామాన్యప్రజలు నిత్యజీవితంలో పాటించవలసిన విధి నిషేధాలను మోసపూరితంగా దైవాదేశాల పేరుతో సంఘం మీద రుద్ది మత జీవితానికి, ప్రజలనిత్య జీవితానికి మధ్య తేడా లేకుండా చేశారని వారు ఆరోపించారు. దీనినే వారు “స్కీమ్ ఆఫ్ కాస్ట్” అన్నారు. పౌర చట్టాలను (Civil laws) మతాన్ని కలగాపులం చేసి దేవుడే స్వయంగా చెప్పాడని ప్రచారం చేసి, ప్రాబల్యం సంపాదించుకొన్నారని నిందించారు. 1850లో జరిగిన మద్రాసు మిషనరీ కాన్ఫరెన్సు వారు కులం గురించి దశాబ్దాలపాటు కొనసాగిన వివాదానికి ముగింపు పలుకుతూ ఈ క్రింది తీర్మానం చేసింది.

“హిందువుల ప్రత్యేకత అయిన కాస్ట్ పుట్టుక పవిత్రత, అపవిత్రత (Birth Purity and Impurity) మీద ఆధారపడింది. ఇది నూటికి నూరుపాళ్ళూ మతానికి సంబంధించిన వ్యవస్థ. అంతేకానీ కేవలం లౌకిక భేదంకాదు. మనువు, ఇతర ధర్మశాస్త్రాల ప్రకారం ప్రజలను నాల్గు విభాగాలుగా విభజింపబడటాన్ని దైవనిర్ణయంగా భావించారు. ఈ కాలపు హిందువులు తమ కాస్ట్ ను కోల్పోవటం, కాపాడాలనుకోవటం మీదే ఆధారపడి తమ భవితవ్యం ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు.”

ప్రొటెస్టెంటు క్రైస్తవం వ్యాప్తి చెందాక విశ్వాసులు తమ పాత మత, కుల చిహ్నాలను పూర్తిగా వదిలి పెట్టాలని తీర్మానించారు. 1850ల నాటికి దేశంలో ప్రొటెస్టెంటు క్రైస్తవ మిషనరీలు ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. పాత మత సంప్రదాయలతో పాటుగా, కులాచారాలు, కట్టూబొట్టును పూర్తిగా వదలి వేసినప్పుడే, క్రీస్తు పట్ల విశ్వాసం ప్రకటించినట్లుగా భావించాలని తీర్మానించారు. దానితో ప్రొటెస్టెంటు మతంలో చేరిన వారు తమ కట్టుబొట్లు తీసివేయవలసి వచ్చింది. కాథలిక్కులకు అట్టి పట్టింపు లేదు కనుక వారు వాటిని నిలుపుకోగలిగారు.

హిందువులది మతంకాదు :

మిషనరీల దృష్టిలో హిందువుల మతానికి మతం అనే పేరుకే అర్హత లేదు. వీరు అనుసరిస్తున్న ఒక పెద్ద గందరగోళ విధానాన్నే వారు మతం అని అనుకుంటున్నారని మిషనరీలు అభిప్రాయపడ్డారు. మతానికి ఉండవలసిన ప్రాథమిక లక్షణాలు – ఒక ప్రవక్త, ఒక ఉమ్మడి దైవగ్రంథం, మతస్థులకు మార్గదర్శనం చేసే ఒక మతాధికారుల వ్యవస్థ హిందూ మతానికి లేవు. భిన్నభిన్న సంప్రదాయాలు, నమ్మకాలు, విశ్వాసాలు సంప్రదాయాలతో ఎవరికి తోచిన విధంగా వారు నడుచుకొనే స్వేచ్ఛ ఇచ్చినది మతం ఎలా అవుతుందన్నది వారి ప్రశ్న. హిందువుల మతం పాశ్చాత్యులు నిర్వచించిన మతానికంటే విస్తృతమైనదన్న ఆలోచన వారికి రాలేదు. ఇతరమతాలు – ఇస్లాం, క్రైస్తవం, జూడాయిజం వారి నిర్వచనానికి లోబడి ఉన్నాయి. వారి దృష్టి కోణం నుంచే హిందువుల ఆరాధనా పద్ధతులను చూసి, హిందువులది మతం కానే కాదని తీర్మానించటమే కాక హిందువులను అవహేళన చేశారు. అవమానపరచారు. భారతదేశం విగ్రహారాధకులుండే దేశంగానూ, వారి జాతిని ‘Nation of Castes’ గాను అభివర్ణించారు.

హిందువులు ఆచరిస్తున్న మతం వారిదృష్టిలో మతం కాకపోయినప్పటికీ, ఎన్నో వేల సంవత్సరాల నుండి అప్రతిహతంగా సాగుతున్నది. ‘మతాని’కి ఉండవలసిన ప్రాథమిక లక్షణాలు లేకపోయినప్పటికీ, కాలానికి తట్టుకొని హిందూ విశ్వాసాలు, ఆరాధనాపద్ధతులు సజీవంగా నిలిచి ఉన్నాయి. కనుక లోతుగా అధ్యయనం చేసినట్లుయితే హిందువులను ఒక జాతిగా కలిపి ఉంచినదేమిటో వారికి అవగతం అయ్యేది. కానీ వారి లక్ష్యం అదికాదు. క్రైస్తవాన్ని హిందూ దేశంలో వ్యాప్తి చెయ్యటమే వారి ఉద్దేశ్యం. ‘విగ్రహారాధకుల హీనమతం’ స్థానే క్రీస్తుమతస్థాపనే లక్ష్యంగా వారి అధ్యయనాలు, పరిశోధనలు జరిగాయి. వారి అవగాహన లోపంవల్ల హిందూ సంఘంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని, హిందువులకు తాత్విక చింతన లేదని వారు అనుకున్నారు. వారి అవగాహన లేమిని హిందువులపైకి నెట్టారు. వారి నిర్వచనాలకు లొంగలేదు కాబట్టి హిందువులది మతమే కాదు పొమ్మన్నారు. వారియొక్క ఆ దృష్టికోణము, అభిప్రాయమే వారు హిందువుల మతాన్ని “ఒక పెద్ద గొందరగోళంగా” “ఒక పెద్ద కీకారణ్యంగా”, “ఒక పెద్ద మర్రిచెట్టుగా” అభివర్ణించటానికి దారి తీసింది.

‘కాస్ట్’ వ్యవస్థ గురించి ఈ ప్రొటెస్టెంట్ల భావనలే నిలిచాయి తప్ప ఇతరుల భావనలకు తగినంత ప్రాచుర్యం లభించలేదు. ‘కాస్ట్’ వ్యవస్థ గురించి ఈనాటికి కూడా చర్చంతా క్రైస్తవ మేథావులు, మత ప్రచారకులు ప్రతిపాదించిన సిద్ధాంతాల చుట్టే పరిభ్రమించటం విచారకరం. ఈ దురుద్దేశపూరిత సిద్ధాంతాలను ప్రశ్నించవలసిన సమయం వచ్చింది. స్వతంత్ర అధ్యయనాల ద్వారా మన సమాజంలోని వివిధ వ్యవస్థలను భారతీయకోణం నుంచి పరిశీలించటానికి తగినంత కృషి జరగాలి. మన భారతీయ మేథావులు పాశ్చాత్య మేథావులను గ్రుడ్డిగా అనుకరించటం మాని స్వతంత్రంగా పరిశోధనలు చేసి వాస్తవాలను వెలికి తీయాలి.

– డాక్టర్ బి. సారంగపాణి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.