
* విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సౌత్ ఇండియా సంచార జాతుల సమావేశంలో వక్తల శపథం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు నందిగామ పట్టణ పరిధిలో సంచార జాతులకు చెందిన దాసరి కులానికి చెందిన మహిళలకు జరిగిగిన ఘోర అవమానానికి నిందితులకు కఠిన శిక్ష పడేవరకు తమ పోరాటం ఆగదని సంచార జాతుల అభివృద్ధి మండలి నాయకులు స్పష్టం చేశారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో సంచార జాతుల అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో జరిగిన సౌత్ ఇండియా సంచార జాతుల సమావేశంలో వక్తలు ఈ మేరకు ప్రకటించారు.


నందిగామ బాధితులకు మద్దతు గా నిలబడటానికి విజయవాడలో “సంచార జాతుల అభివృద్ధి మండలి” ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీ ఏ.ఆర్. వెంకట్ ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా సంచార జాతుల సమావేశానికి సౌత్ ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, తమిళనాడు, కేరళ, పాండిచేరి రాష్ట్రలలోని సంచార జాతుల నాయకులు హాజరయ్యారు.


సంచార జాతుల అభివృద్ధి మండలి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీ AR.వెంకట్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ,అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు సంచార జాతుల మహిళలకు జరిగిగిన ఘోర అవమానాన్ని సభకు వివరించారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైనా సంచార జాతుల ఇంకా స్వాతంత్ర్యం రాలేదని, పట్టపగలు నడిరోడ్డు మీద ఇద్దరు సంచార జాతుల మహిళలను వివస్త్రలను చేసి అతి దారుణం గా నాలుగు గంటల పాటు హింసిస్తే ఆదుకునే వారే కరవయ్యారని శ్రీ వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత వెనకబడిన సంచార జాతులకు చెందిన మహిళలు అంటే అంత చులకన భావం ఇప్పటికీ ఈ సమాజంలో ఉండటం సిగ్గుచేటని ఆయన అభిప్రాయపడ్డారు. వారికి జరిగిన అన్యాయంపై బాధితులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తే… అసలు దోషులను వదిలేసి, ఎవరో కొందరిమీద నామ మాత్రపు కేసులు నమోదు చేసి దోషులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి వీరికి నాయ్యం ఎలా జరగాలి? అని ప్రశ్నిస్తూ, ఎస్ టీ, ఎస్ సి లకు ఉన్న అట్రాసిటీ చట్టం వెంటనే సంచార జాతులకు కూడ ఏర్పాటు చేయాలని శ్రీ వెంకట్ డిమాండ్ చేశారు. ఈ మహిళా బాధితులకు నాయ్యం జరిగే వరకూ ప్రాంతాలకు అతీతంగా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని DNT సౌత్ ఇండియా నాయకులు హామీ ఇచ్చారు.


బాధితులు తమకు జరిగిన ఘోరాన్ని చెబుతున్నప్పుడు…. సభలోని ప్రతిఒక్కరూ కంటతడి పెట్టారు, DNT మహిళా నాయకురాళ్ళు అందరూ బరువెక్కిన హృదయాలతో, కన్నీరు తుడుచుకుంటూ మాట్లాడారు.
కార్యక్రమంలో.. పాండిచేరి DNT నాయకులు జగన్నాథన్, నవీన్, తమిళనాడు లాయర్ జీవహన్ , తెలంగాణ చిరంజీవి, చితరంజన్, కుమార్, శంకర్, పుణ్యరాజ్,..కేరళ లితికల,బాలసుబ్రహ్మణ్యన్, నితిన్, ఏపీ సామజిక సమరసత సాహిత్యవేత్త శ్రీ దుర్గాప్రసాద్ మరియు ఆంధ్రప్రదేశ్ లోని 8జిల్లాలకు చెందిన DNT నాయకులు పాల్గొన్నారు.


23/4/2022 సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విజయవాడ ప్రెస్ క్లబ్ లో సౌత్ ఇండియా సంచార జాతుల ప్రతినిధుల, బాధితులతో ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి
1.నిందితులను తగిన సెక్షన్ ప్రకారం కఠినంగా శిక్షించాలని
2.బాధితులను ఆరోగ్య పరంగా, ఆర్థికంగా ఆదుకోవాలని
3.DNT లకు అట్రాసిటీ హక్కు కల్పించాలని అన్ని రాష్ట్రల నాయకులు డిమాండ్ చేశారు.
ప్రెస్ మీట్ లో బాధితులు తమ ఆవేదన చెందుతున్నప్పుడు ప్రెస్ వారు కూడా నిశ్శబ్దంతో కూడిన బరువెక్కిన హృదయాలతో చలించి పోయారు.





