
-
అమెరికా సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడి
న్యూఢిల్లీ: ఉత్తర భారత దేశంలోని దాదాపు ఏడు ఇండియన్ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్స్ పై చైనా ప్రభుత్వ అనుబంధ సైబర్ గ్రూపులు గూఢచర్యం చేసినట్టు అమెరికాలోని సైబర్ సెక్యూరిటీ గ్రూప్ ‘రికార్డెడ్ ఫ్యూచర్’ వెల్లడించింది. ఎస్.ఎల్.డి.సిలు ఉత్తర భారత దేశంలో విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా, గ్రిడ్ నియంత్రణ కోసం ఎప్పటికప్పుడు, నిరంతరం కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటాయి.
ఏయే పవర్ గ్రిడ్లపై చైనా సంస్థలు గూఢచర్యం చేశాయో రికార్డెడ్ ఫ్యూచర్ నిర్దిష్టంగా వెల్లడించలేదు. అయితే భారత్-చైనా మధ్య లడఖ్‌లో వివాదం జరుగుతున్న ప్రదేశానికి సమీపంలోనే ఈ గూఢచర్యం జరిగిందని చెప్పింది. దీనికి సంబంధించిన ఓ మ్యాపును కూడా విడుదల చేసింది. దీనిలో ఏడు ప్రదేశాలను మార్క్ చేసింది.
ఈ గూఢచర్యం కోసం ఉపయోగించిన షాడోప్యాడ్ అనే టూల్‌ను చైనా రాజ్య భద్రత మంత్రిత్వ శాఖ కాంట్రాక్టర్ల నుంచి వచ్చినట్టు తెలుస్తోందని పేర్కొంది. ఈ టూల్‌కు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సన్నిహిత అనుబంధం ఉన్నట్టు పేర్కొంది.





