
-
ప్రశంసించిన ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ
న్యూఢిల్లీ: దేశంలోని పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనపై అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ప్రశంసల జల్లు కురిపించింది. కరోనా కష్టకాలంలోనూ భారత్‌లో తీవ్ర పేదరికం స్థాయి పెరగకుండా ఈ పథకం ఎంతగానో దోహదపడుతున్నట్టు కొనియాడింది.
కరోనా మహమ్మారి సంవత్సరాలలో భారతదేశంలో పేదరికం, వినియోగ అసమానతలను అంచనా వేస్తూ ఐఎంఎఫ్ ఒక నివేదికను విడుదల చేసింది. కరోనా మహమ్మారి ముందు సంవత్సరం(2019)లో దేశంలో కడు పేదరికం 1 శాతం కంటే తక్కువగా(0.8శాతం) ఉన్నట్టు తెలిపింది. పాండమిక్ తర్వాత కూడా 2020లో భారత్‌లో కడు పేదరికం అదే స్థాయిలోనే ఉన్నట్టు తెలిపింది.
కరోనా పాండమిక్ సంవత్సరం(2020)లో దేశంలో కడు పేదరికం స్థాయి పెరగకుండా నిరోధించడంలో ఈ పథకం కీలకమని ఐఎంఎఫ్ కొనియాడింది. కరోనా మహమ్మారి సంవత్సరంతో సహా వరుసగా రెండు సంవత్సరాలలో కడు పేదరికం స్థాయిని నియంత్రించడం.. తీవ్ర పేదరిక నిర్మూలనగానే పరిగణించవచ్చని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది.





