
జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన తీవ్రవాద దాడిపై భారత్ తీవ్రంగా స్పందిస్తోంది. దేశంలోని ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదిస్తున్నారు. అటు ప్రధాని మోదీ సైతం పూర్తి అధికారాలు ఇవ్వడంతో.. పుల్వామా ఘటన జరిగిన నాలుగు రోజుల్లోనే ప్రధాన సూత్రధారులను ఆర్మీ మట్టుబెట్టింది. అంతేకాదు, కశ్మీర్ లోయను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. అటు సరిహద్దుల్లో మోహరించిన వాయుసేన యుద్ధవిమానాలు వార్ సిద్ధమంటూ సంకేతాలిస్తున్నాయి.
పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాల ప్రతీ కన్నీటి బొట్టుకు.. పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకునేలా భారత్ చర్యలు ప్రారంభించింది. ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా మన జవాన్లు దెబ్బకు దెబ్బ కొట్టారు. ఉగ్రమూకలు భారత్ లో అడుగుపెడితే అంతు చూస్తామని గట్టిగా జవాబు చెప్పారు. ఉగ్ర దాడిపై కసి తీర్చుకోవడం మొదలుపెట్టారు. ఏ కలుగులో దాగున్న వదిలేది లేదని చెప్పిన భద్రతా దళాలు చేసి చూపించాయి.
పుల్వామాలో ఆత్మాహుతి దాడి మాస్టర్ మైండ్.. సూసైడ్ బాంబర్ అదిల్ దార్ కు శిక్షణ ఇచ్చిన.. జేషే మహమ్మద్ అగ్ర ఉగ్రవాది కమ్రాన్ అలియాస్ అబ్దుల్ రషీద్ ఘాజీని భద్రతాదళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా పింగ్లాన్ లో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టారు ఆర్మీ జవాన్లు. ఈ ఎన్ కౌంటర్ లో రషీద్ తో పాటు మరో ఉగ్రవాది ముఫ్తీ అబ్దుల్లాను హతమయ్యాడు.
అనుమానిత ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి ఉన్నారన్న సమాచారం రావడంతో.. ఆర్మీ, సీఆర్పీఎఫ్ జాయింట్ ఆపరేషన్ మొదలు పెట్టింది. పింగ్లాన్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానిత ప్రాంతంలోకి రాగానే గాల్లోకి కాల్పులు జరిపారు. కలుగులో ఉన్న ఉగ్రవాదులను రెచ్చగొట్టి బయటకు లాగారు. హోరోహోరీ జరిగిన కాల్పుల్లో మేజర్ సహా నలుగురు జవాన్లు అమరులయ్యారు. పట్టువదలకుండా వారిని అంతం చేయాలన్న కసితో కాల్పులు జరిపిన జవాన్లు.. పుల్వామా దాడి మాస్టర్ మైండ్ ను మట్టుబెట్టారు.
ఆత్మాహుతి దాడికి కొన్ని రోజుల ముందు జరిగిన ఎన్‌కౌంటర్‌లో తృటిలో తప్పించుకున్న రషీద్ ఘాజీ.. యువకులను ఉగ్రవాదం వైపు మళ్లిస్తూ ఆత్మాహుతి దళాలుగా మారుస్తున్నాడు. గతంలో ఆప్ఘనిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న ఘాజీ అలీయాస్ రషీద్ ఐఈడీ బాంబులు తయారు చేయడంలో దిట్ట. పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన అదిల్‌కు కూడా ఘాజీయే శిక్షణ ఇచ్చినట్లు నిఘావర్గాలు పేర్కొంటున్నాయి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజార్‌కు అత్యంత నమ్మకస్తుడైన ఘాజీ.. పుల్వామా దాడికి ప్రధాన సూత్రదారి.
2011లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు వచ్చి.. జిహాది శిక్షకుడిగా మారాడు. మసూద్ అజార్ మేనల్లుడిని భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన తర్వాత ఘాజీ కాశ్మీర్ చేరుకుని ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే అదిల్ ను పక్కా పథకం ప్రకారం సీఆర్పీఎఫ్ బలగాలు వాహన శ్రేణిపై దాడికి పంపించాడు. అయితే, పుల్వామా దాడి జరిగిన నాలుగు రోజుల్లోనే ప్రధాన సూత్రధారిని మట్టుబెట్టిన సైన్యం.. ప్రతీకారం తీర్చుకుంది. అంతేకాదు, రక్షణ దళాలు జమ్ము కాశ్మీర్ మొత్తం జల్లెడ పడుతున్నాయి. ప్రధాని మోదీ సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో సైనికులు రెట్టింపు ఉత్సాహంతో ఉగ్రమూకల వేట కొనసాగిస్తున్నారు.
ఇక పుల్వామా ఎన్‌కౌంటర్ విజయవంతంగా ముగియడం, పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి రషీద్ ఘాజీ, అతనితోపాటూ.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ రీషీద్ ను సైన్యం మట్టుపెట్టడంపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి చర్చించారు. ఉగ్రవాదులు ఎలా చొరబడిందీ, ఆపరేషన్ ఎలా నిర్వహించిందీ అన్నీ వివరించారు. సరిహద్దుల్లో మరింత ఉగ్రవాదులు చొరబడుతున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలను ప్రధానికి వివరించగా.. వెనక్కి తగ్గొద్దని మోదీ సూచించినట్లు సమాచారం. మరోవైపు పాకిస్థాన్ సరిహద్దుల వెంట యుద్ధానికి సంబంధించి సైన్యం సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ చెప్పగా.. పరిస్థితిని బట్టీ తగిన గుణపాఠం చెబుదామని నరేంద్ర మోదీ అన్నట్లు తెలుస్తోంది.
ఇక కశ్మీర్ లోయలో వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తూ.. ఉగ్రవాదులకు మద్దతుపలుకుతున్న హురియత్ నేతలకు భద్రతను ఉపసంహరించుకున్న కేంద్రం.. భారత్ – పాకిస్థాన్ మధ్య యుద్ధం రావొచ్చన్న హురియత్ నేత అబ్దుల్ ఘనీ భట్ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చేందుకు ఆర్మీదళాలను సిద్ధం చేసింది. భారత వాయుసేన ఇక యుద్ధానికైనా సిద్ధమన్నట్లుగా పోక్రాన్‌లో విన్యాసాలు చేస్తోంది. సీఆర్పీఎఫ్ బలగాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను అంతమొందించే వరకు తన రక్తం మరుగుతూనే ఉంటుందని ప్రధాని మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను అంతమొందించే వరకు తన హృదయంలోని మంట చల్లారదని మరోసారి హెచ్చరించారు. కాశ్మీర్ లోయ ప్రాంతంలో పాతుకుపోయిన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు భద్రతా బలగాలను పూర్తి స్వేచ్ఛనిచ్చామని స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన శాస్తి జరిగింది. వాళ్లు పెంచి పోషిస్తున్న పాములు వాళ్లనే కాటేశాయి. ఆదివారం బలూచిస్థాన్ రాష్ట్రంలో పాక్ సైనిక కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ భీకర దాడిలో 9 మంది పాక్ సైనికులు చనిపోయారు. 11 మంది గాయపడ్డారు. బలూచిస్థాన్ దాడి వెనుక బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ సంస్థలు ఉన్నాయని పాక్ నిఘా ఏజెన్సీలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఆ రెండు సంస్థలు దాడికి తమదే బాధ్యత అని ప్రకటించినట్టు పాక్ మీడియా తెలిపింది. పుల్వామాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏ విధంగా అయితే భారత జవాన్ల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి తెగబడ్డారో సరిగ్గా అదే రీతిలో పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై సూసైడ్ బాంబర్ అటాక్ చేయడం యాదృచ్ఛికమే అయినా.. శత్రుదేశానికి తగిన శాస్తి జరిగిందనే వాదన వినిపిస్తోంది.
మరోవైపు పుల్వామా దాడి తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. కశ్మీర్ బంద్ నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించారు. అటు ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నారు. మరోవైపు ప్రతీకార దాడికి భారతసైన్యం వ్యూహరచన చేస్తోంది. సరిహద్దుల్లో 140 యుద్ధ విమానాలను మోహరించారు. వాయు విన్యాసాలు జరుపుతోంది. ఎలాంటి ఆపరేషన్ అయినా అమలు చేసేందుకు వైమానిక దళం రెడీ అయింది. జైషే మహహ్మద్ కు నిధులు ఇస్తున్న పాక్‌పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాకిస్థాన్ ను అష్ట దిగ్బంధం చేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది. వైమానిక, లక్ష్య ఛేధన సామర్థ్యం చాటుకునేందుకు సన్నద్దమైంది.
ఉగ్రవాదానికి స్వర్గధామంలా మారిన పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజం ముందు ఏకాకిని చేసేందుకు భారీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పాకిస్తాన్‌కు నిధులు వెళ్లే అన్ని దారుల్ని మూయించేలా వ్యూహాత్మక కసరత్తు చేస్తోంది. భారత్‌తో అగ్రరాజ్యం అమెరికా లాంటి దేశాలు కూడా వెన్నుదన్నుగా నిలవడంతో పాకి స్థాన్‌కు గడ్డుకాలం మొదలైందన్న సంకేతాలు వెళ్తున్నాయి. అటు పాకిస్తాన్ పై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఉగ్రవాద చర్యలకు ఊతమివ్వడం ఆపకపోతే.. భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాయి.
పుల్వామా ఘటనపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్.. దెబ్బకు దెబ్బ తప్పదని హెచ్చరిస్తోంది. పాక్‌పై ఎలాంటి వ్యూహం అనుసరించాలి అన్నదానిపై యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది. ఇప్పటికే అఖిలపక్ష సమావేశంలో అన్నిపార్టీలు మద్దతు తెలపడంతో పాక్ పై ప్రతీకార చర్యలుప్రారంభించింది కేంద్రం. పాక్ పీచమణచాలంటే ముఖ్యంగా దాని ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలి. దౌత్య పరంగా ఒంటరి చేయాలి. ఇప్పుడు భారత్ ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. ఇప్పటికే శత్రు దేశానికి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను ఉపసంహరించుకున్న కేంద్రం.. తాజాగా ఆ దేశానికి మరో పిడుగుపాటు లాంటి నిర్ణయాన్ని వెలువరించింది. పాకిస్థాన్ నుంచి దిగుమతయ్యే అన్నిరకాల వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని ఏకంగా 200 శాతం పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో పాక్ ఎగుమతులపై 49 వేల కోట్ల భారం పడనుంది.
పాకిస్థాన్ నుంచి భారత్ ప్రధానంగా ముడి ప్రత్తి, నూలు, కెమికల్స్, ప్లాస్టిక్, రంగులు దిగుమతి చేసుకుంటోంది. ఈ వస్తువులపై కస్టమ్స్ సుంకం భారీగా పెంచిన నేపథ్యంలో వ్యాపారులెవరూ వాటి జోలికి వెళ్లే సాహసం చేయకపోవచ్చు. దాంతో పాక్ లో ఉత్పత్తయిన ముడిసరుకు అక్కడే మగ్గిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్రం తీసుకున్న కస్టమ్స్ సుంకం పెంపు నిర్ణయం పాక్ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే అవకాశాలున్నాయని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
అటు పాకిస్తాన్‌ను అంతర్జాతీయ వేదికలపై ఒంటరి చేసేందుకు భారత్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఉగ్రసంస్థలకు ఆర్థిక సాయంపై నిఘా ఉంచే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌కు పుల్వామా ఘటనపై కీలక సాక్ష్యాధారాలను సమర్పించనుంది. వచ్చేవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఎఫ్‌ఏటీఏ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్‌కు పాకిస్తాన్ నిఘా సంస్థలు అందజేస్తున్న సాయాన్ని భారత్ ఎండగట్టనుంది.
అటు ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న పాకిస్తాన్‌ను ఒంటరిని చేయాలనే లక్ష్యంలో భాగంగా శనివారం విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోయల్ పలు దేశాల రాజయబారులతో చర్చలు జరిపారు. ఆసియా, ఆఫ్రికా దేశాల దౌత్యాధికారులతో భేటీ అయి పుల్వామా దుర్ఘటన వివరాలను తెలిపారు. ఆసియాన్, గల్ఫ్ సహకార మండలి రాయబారులను కలిశారు. శుక్రవారం 25 మంది రాయబారులతో సంప్రదింపులు జరిపి పరిస్థితిని తెలిపారు.
మరోవైవపు ప్రపంచ దేశాల నుంచి భారత్ కు పెద్దయెత్తున మద్దతు లభిస్తోంది. పుల్వామా దాడిని అమెరికా, చైనా, రష్యా సహా పలుదేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదాన్ని సమైక్యంగా ఎదుర్కొందామని ప్రతిన చేశాయి. ఉగ్రమూకల స్వర్గధామం పాకిస్థాన్‌పై పలు దేశాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఇప్పటికైనా ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఉపసంహరిం చాలని, లేని పక్షంలో ఏకాకి దేశంగా మిగిలిపోయే ప్రమాదం ఉందని పాకిస్థాన్‌ను ప్రపంచ దేశాలు హెచ్చరించాయి.
పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్ర కిరాతకంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాద కార్యాకలాపాలపై తీరు మార్చుకోవాల్సిందేనని పాక్‌ను అమెరికా హెచ్చరించింది. ఉగ్రవాదులకు మద్దతివ్వడం.. వారిని కాపాడేందుకు పాకిస్థాన్ ప్రయత్నించడాన్ని అమెరికా తీవ్రంగా తప్పుపట్టింది. తక్షణమే ముష్కరులకు మద్దతివ్వడాన్ని ఉపసంహరించుకోవాలి, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు చవి చూడక తప్పదని పాక్‌ను హెచ్చరించింది.
కాశ్మీర్‌లోయలో ఉగ్రదాడిని అమానుష చర్యగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు. ఇదో కిరాత నేరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 మందిపైగా జవాన్లను పొట్టపెట్టుకున్న ఈ ఘటనకు కారకులను, నేరగాళ్లకు సహకరించిన వాళ్లను విధిగా శిక్షించాల్సిందేనని పుతిన్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత్‌తో కలసి పని చేయటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
పుల్వామా ఉగ్రదాడిని ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదం క్యాన్సర్‌లా మారిందని.. దాన్ని రూపుమాపేందుకు అందరం సమష్టిగా పోరాటం చేయాలని తెలిపారు. ఉగ్రదాడిని ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక, అరబ్ ఎమిరేట్, భూటాన్, మాల్దీవులు తదితర దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్‌కు సంఘీభావం తెలిపాయి. ఉగ్రవాద నిర్మూలనలో సమష్టిగా పోరాటం చేద్దామని ప్రతిన చేశాయి.
ఇక ఇరాన్ సైతం పాకిస్తాన్ పై అగ్గిమీద గుగ్గిలమవుతోంది. పుల్వామా దాడికి ఒక్కరోజు ముందు ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 27 మంది పారామిలిటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. టెహ్రాన్ ఉగ్ర దాడికి తామే కారణమని పాకిస్థాన్ దేశం నుంచి నడుస్తున్న జైషే అల్ అదుల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ దేశం తరపున ఆ దేశ రాయబారి రఫత్ మసౌద్ కు సమన్లు జారీ చేశామని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి, అధికార ప్రతినిధి బహ్రం ఘాసేమి చెప్పారు. ఇరాన్ దేశంలో ఉగ్ర దాడికి కారణమైన తీవ్రవాద గ్రూపులపై వెంటనే చర్యలు తీసుకోవాలని తాము పాకిస్థాన్ దేశాన్ని కోరినట్లు ఘాసేమి తెలిపారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత్ యుద్ధానికి దిగితే ఇరాన్ కూడా కచ్చితంగా మద్దతు తెలిపే అవకాశం వుంది.
అటు పాక్ భారత్ యుద్ధానికి దిగితే కచ్చితంగా వెంట నడుస్తామని బలూచిస్తాన్ వేర్పాటువాద సంస్థ బెలూచ్ నేషనల్ కాంగ్రెస్ ప్రకటించింది. పాక్ తో భారత్ అన్ని ద్వైపాక్షి సంబంధాలు తెంచుకోవాలని.. పుల్వామా ఉగ్రదాడి కారకులను కఠినంగా శిక్షించాలని బి.ఎన్.సి. అధ్యక్షుడు వహీద్ పిలుపునిచ్చారు. పాకిస్థాన్ నుంచి తమకు స్వాతంత్ర్యం కావాలని బీఎన్సీ ఎంతో కాలంగా పోరాడుతోంది. పుల్వామా దాడి తర్వాత ఇలా ప్రపంచదేశాలన్నీ ముక్తకంఠంతో భారత్ కు మద్దతు పలుకుతుంటే.. మన పక్కలో బల్లెం లాంటి డ్రాగన్ కంట్రీ మాత్రం రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోంది. పుల్వామా దాడిని పైకి తీవ్రంగా ఖండించిన చైనా.. జైషే ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు మాత్రం మోకాలడ్డుతోంది.
పాకిస్తాన్‌తో తమకు ఉన్న క్రిడ్ ప్రోకో ఒప్పందం వల్లే జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు చైనా నిరాకరిస్తోందని రా మాజీ చీఫ్ విక్రమ్ సూద్ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఆదిల్ ఒక్కడి వల్లే సాధ్యం కాలేదని, అతడి వెనుక పెద్ద టీమ్ ఉందని వ్యాఖ్యానించారు. భారత్‌ను ప్రత్యక్షంగా ఎదుర్కోలేకే పాకిస్తాన్ ఇలా పరోక్షంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాక్‌కు.. అంతర్జాతీయ సమాజంలో చైనా ఒక్కటే వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు.
ఇదిలావుంటే, నిన్నమొన్నటిదాకా ప్రధాని మోదీతో స్నేహరాగం ఆలపించిన సౌది అరేబియా యువరాజు సైతం ప్లేటు ఫిరాయించారు. ఆదివారం పాక్ లో పర్యటించిన సౌది ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్.. ఆ దేశంతో 20 బిలియన్ డాలర్ల ఆర్థిక ఒప్పందం చేసుకున్నారు. అంతేకాదు, పాకిస్తాన్ తమకు ఎల్లప్పుడూ ప్రియమైన దేశమేనని వ్యాఖ్యానించారు. త్వరలోనే పాకిస్తాన్ ఆర్థికంగా బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు తమ దేశంలో ఖైదీలుగా ఉన్న 2107 మంది పాక్ పౌరులను జైలు నుంచి విడుదల చేయాలన్న ఇమ్రాన్ ఖాన్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు.
పుల్వామా ఘటనతో పాకిస్థాన్ పై చర్యలు తీసుకోకుంటే.. ప్రభుత్వాన్నైనా కూల్చేసేట్టుగా ఉన్నారు ప్రజలు. దీంతో ఇరు దేశాల మధ్య వాతావరణం తీవ్రంగా వేడెక్కుతోంది. సరిహద్దుల్లో యుద్ధ ఘంటికలు మోగుతున్నాయి. ఇప్పటికే పెద్దయెత్తు వాయుసేన విమానాలు సరిహద్దుల్లో మోహరించింది. ఈ తరుణంలో భారత్ తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి..? యుద్ధానికి దిగుతుందా..? లేక మరో సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తుందా..? అదే జరిగితే పాక్ స్పందన ఎలా వుంటుంది..? తిరుగు దాడి చేస్తుందా..? అణ్వస్త్రాలు ప్రయోగిస్తుందా..? లేక, చైనా సాయం కోరి మనపై ఉసిగొల్పుతుందా..? అసలు ఇదే మూడవ ప్రపంచ యుద్దానికి పునాది కానుందా..?
పుల్వామా ఘటనతో భారత్ సైన్యం కసితో వుంది. ఇక భారత ప్రభుత్వానికి కూడా వేరే దారిలేదు. ఈసారి వెనకడుగు వేస్తే, ప్రభుత్వాలే కూలిపోతాయి. అందుకే ఇప్పటికే ప్రధాని, సైన్యానికి ఈ విషయంలో సర్వహక్కులు ఇచ్చేసినట్టే తెలుస్తుంది. ఇందులో భాగంగా సర్జికల్ దాడుల నుంచి పాక్‌లోని కీలక ఉగ్రనేతలను మట్టుబెట్టడం, అణుస్థావరాల ధ్వంసం దాకా పలు మార్గాలను మన భద్రతా దళాలు పరిశీలిస్తున్నాయని తెలుస్తోంది.
పాకిస్థాన్ ప్రస్తుతం చాలా బలహీనంగా కనిపిస్తోందని, ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షిణించిందని, ఆ దేశ మంత్రులు, ఉన్నతాధికారులు వాడుతున్న విలాసవంతమైన కార్లను, ఇతరత్రా ఖరీదైన వస్తువులను వేలం వేసి సొమ్ము సమకూర్చుకుంటున్నదుస్థితి నెలకొందని అంటున్నారు. ఆ దేశ రక్షణ రంగ పరిస్థితి కూడా ఘోరంగా ఉన్నందని చెబుతున్నారు. ఈ దశలో పాక్ పై భారత్ యుద్ధానికి దిగితే.. అది కోలుకోలేని దెబ్బతినడం ఖాయమని అంటున్నారు.
గతంలో సర్జికల్ దాడులు జరిపినప్పుడు.. అలాంటివేమీ జరగలేదని తన ప్రజలకు చెప్పుకొనే ప్రయత్నం చేసిందే తప్ప కనీస ప్రతిదాడి చేయలేకపోయింది. నిజంగానే పాకిస్థాన్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తుంది. అంటే ఆత్మాహుతి దాడులతో దొంగ దెబ్బలు తీయడం తప్ప, స్వయంగా యుద్ధభూమిలో అడుగు పెట్టలేదని స్పష్టంగా అర్ధం అవుతుంది. ఇక మన త్రివిధ దళాలతో పోలిస్తే.. పాక్ సైన్యం, వైమానికదళం, నౌకాదళం అన్నీ బలహీనంగా ఉన్నాయి. ఏవీ భారత్‌కు పోటీనిచ్చే స్థితిలో లేవు. భారత్ కొనుగోలు చేస్తున్న రాఫెల్ యుద్ధవిమానాలకు దీటైన యుద్ధవిమానాలు సమకూర్చుకునే స్థోమత కూడా పాక్‌కు లేదు.
వీటన్నిటినీ పక్కన పెట్టినా.. పాకిస్థాన్ గనక భారత్‌పై ఎగబడితే ఆర్థికంగా మరింత నష్టపోతుందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పీకల్లోతు అప్పుల భారంలో మునిగిపోయి బావురుమంటున్న పాక్ ఆర్థిక వ్యవస్థ.. సంప్రదాయ యుద్ధమంటూ జరిగితే పూర్తిగా మునిగిపోతుంది. మనకు పాకిస్థాన్‌తో మాత్రమే లైవ్ బోర్డర్ ఉంది. కానీ.. పాక్ దుష్ట విధానాల కారణంగా ఆ దేశానికి మూడు వైపులా లైవ్ బోర్డర్ ఉంది. ఇటీవలే పాక్-ఇరాన్ సరిహద్దులకు సమీపంలో ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్’పై దాడికి పాల్పడిన ఓ సాయుధ ముఠాకు పాక్ ఆర్మీ సాయం చేసింది. ఆ దాడిలో 27 మంది ఇరాన్ సైనికులు చనిపోయారు. దీనితో పాక్‌పై ఇరాన్ గుర్రుగా ఉంది.
ఏదో సామెత చెప్పినట్టుగా, శత్రువుకు శత్రువు మిత్రుడనే నెపంతో.. భారత్‌తో యుద్ధమంటూ వస్తే చైనా తమకు అండగా నిలబడుతుందని పాకిస్థానీలు భావిస్తున్నారు. కానీ, అది కూడా జరిగే అవకాశం లేదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, అదే జరిగితే భారత్‌కు తమ ఉత్పత్తుల ఎగుమతి పూర్తిగా నిలిచిపోతుందనే విషయం చైనాకు తెలుసు. అంతేకాదు, మనదేశంలో ఉన్న చైనా కంపెనీల ఉత్పత్తి, పరిశోధన విభాగాలు మూతపడతాయి. దీనివల్ల అంతర్జాతీయంగా ఆ దేశ ఉత్పత్తులకు భారీ నష్టం కలుగుతుంది. ఇది ఆ దేశానికి ఆర్థికంగా దెబ్బ. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని.. 1965, 1999లలో భారత్-పాక్ మధ్య యుద్ధాలు జరిగిన సమయంలో ఎలా వ్యవహరించిందో చైనా ఈసారి కూడా యుద్ధం వస్తే అలాగే వ్యవహరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత్ ఇప్పుడు యుద్ధం చేయడం అన్నివిధాలా విదేశాంగ నిపుణులు చెబుతున్నమాట. ఉగ్రదేశానికి బుద్ధి చెప్పడానికి ఇంతకు మించి మంచి తరుణం దొరక్కపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి, భారత్ వార్ సిద్ధమవుతుందో.. లేక మళ్లీ శాంతిమంత్రం జపిస్తుందో చూడాలి.
-source : big banner
writter : chary, Sr.sub-editor





