
ఈ ఏడాది మార్చి నెల 21,22,23 తేదీలు అనగా గురు, శుక్ర, శని వారాలలో గుంటూరు జిల్లా బాపట్ల పట్టణములోని టి.టి.డి కళ్యాణ మండపము ప్రక్కనున్న మైదానములో చిత్తూరు జిల్లా ఏర్పేడులోని శ్రీ వ్యాసాశ్రమము వారి అధ్వర్యంలో 93వ శ్రీ సనాతన వేదాంత సభలు జరుగనున్నాయని నిర్వాహకులు తెలిపారు.
క్రీ.శ.1885వ సం||లో కేరళలో జన్మించిన సద్గురు మళయాళ స్వామి క్రీ.శ.1926వ సం||లో తిరుపతి, శ్రీకాళహస్తి మధ్యలోని ఏర్పేడు గ్రామం దగ్గర శ్రీ వ్యాసాశ్రమాన్ని నెలకొల్పారు. వారు క్రీ.శ 1962వ సం||లో దేహ ముక్తులైన తర్వాత పూజ్యశ్రీ విమలానంద గిరి స్వామి, వారి తదనంతరం శ్రీ విద్యానందగిరి స్వామిలు ఆశ్రమ పీఠాన్నధిష్ఠించి ఆశ్రమ కార్యకలాపాలను నిర్విఘ్నంగా కొనసాగించారు. ప్రస్తుతం పూజ్యశ్రీ పరిపూర్ణానందగిరి స్వామి మార్గదర్శనం చేస్తున్నారు. ఆశ్రమ ప్రారంభం నుంచి నేటి వరకు గత 92సం||లుగా రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో ప్రతి ఏడాదీ మూడు రోజులపాటు శ్రీ సనాతన వేదాంత సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది గుంటూరు జిల్లా బాపట్లలో జరపాలని నిశ్చయించారు.
పై కార్యక్రమంలో పూజ్యశ్రీ త్యాగమయానంద భారతీ మాతాజీ, పూజ్య అమృతానందగిరి మాతాజీ, పూజ్య నిష్క్రియానందగిరి మాతాజీలు పాల్గొని ప్రసంగిస్తారని, మరియు అనేక మంది మాతాజీలు, మహాత్ములు, పండితులు పాల్గొని తమ ఆశీస్సులందజేస్తారని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. కావున హైందవ ధార్మిక చైతన్యానికి దోహదపడే ఈ పవిత్ర కార్యక్రమానికి హిందూ సంస్థల కార్యకర్తలు, భక్తులు తమ చేయూతనందించాలని, ప్రజలు వేలాదిగా పాల్గొని సభలను విజయవంతం చెయ్యాలని నిర్వాహకులు కోరారు.





