
జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో తాజాగా ఉగ్రవాదులు పాశవిక దాడితో 40 మంది సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లను బలిగొన్న నేపథ్యంలో ఆ ఘాతుకాన్ని నిరసిస్తూ “భారతీయ విద్యా భవన్, మచిలీపట్నం” “ కాశ్మీర్ సమస్య – గతం, వర్తమానం” అనే అంశం మీద స్థానిక జిల్లా గ్రంధాలయ సమావేశ మందిరంలో సదస్సు నిర్వహించింది.
శ్రీ జె. లక్ష్మీకాంత్ వక్తలను వేదికపైకి ఆహ్వానించారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన భారతీయ విద్యాభవన్ అధ్యక్షులు డా|| బృందావనం ధన్వంతరి మాట్లాడుతూ కాశ్మీర్ సాంస్కృతికంగా, చారిత్రక పరంగా భారతదేశంలో అంతర్భాగమేనన్నారు. ఆదిశంకరులు కాశ్మీర్లో అడుగు పెట్టి మొట్ట మొదట శారదా పీఠం స్థాపించారని చెప్పారు. అంతే కాక కాశ్మీర్ లోయలో సూర్య దేవాలయం, అతి పురాతన సరస్వతి ఆలయం వున్నాయని తెలిపారు. సాహిత్య పరంగా కూడా కాశ్మీర్ ఎంతో విశేషమైనదని, సంస్కృత భాషకు నెలవని తెలిపారు. కల్హణుడి రాజ తరంగిణి, అభినవ గుప్తుడు శైవం మీద వ్రాసిన కౌల, త్రిక అనే గ్రంధాలు కాశ్మీర్ నుంచి వచ్చినవేనని, భరతముని నాట్య శాస్త్రం మీద వ్యాఖ్యానం కూడా అభినవ గుప్తుడి రచనేనని తెలిపారు. జీసస్ కూడా కొంత కాలం కాశ్మీర్ లోయలో ఋషులతో గడిపి, అక్కడ నేర్చుకున్న అంశాల ఆధారంగానే తన బోధనలు ఇజ్రాయిల్ లో చేశాడని శ్రీ ధన్వంతరి వివరించారు.
స్వతంత్ర భారత దేశ తొలి తరం నాయకుల ఘోర తప్పిదాలకు గత ఏడు దశాబ్దాలుగా దేశం భారీ మూల్యం చెల్లిస్తూ వున్నదని, అందుకు సాక్ష్యం జమ్మూ కాశ్మీర్లో నేటికీ చెలరేగుతున్న హింసాకాండ, హత్యలేనని జమ్మూ కాశ్మీర్ అధ్యయన కేంద్రం సమన్వయకర్త డా|| దుగ్గరాజు శ్రీనివాసరావు అన్నారు. కీలకమైన సరిహద్దు రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ ను కబళించేందుకు పాకిస్థాన్ సర్వ సన్నద్దమై ఉన్న తరుణంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఆర్టికల్ 370 ద్వారా స్వయం ప్రతిపత్తి కల్పించి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశానికి ద్రోహం చెశారన్నారు. ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదని మనం అంగీకరించినట్లయ్యిందన్నారు. స్వయం ప్రతిపత్తి ఇచ్చి జమ్మూ కాశ్మీర్ లోకి మిగిలిన భారతీయులెవరూ ప్రవేశించే వీలు లేకుండా చేశారన్నారు. 370 ఆర్టికల్ కారణంగా భారతీయులెవరూ ఆ రాష్ట్రంలో పౌరులవలేరని, ఆస్తులు కొనుక్కునేందుకు వీలు ఉండదని, సుప్రీమ్ కోర్టు తీర్పులు ఆ రాష్ట్రంలో వర్తించవని, అసలు భారత దేశానికి సంబంధించినవేవి జమ్మూ కాశ్మీర్ కు వర్తించవని తెలిపారు. ఆర్టికల్ 370 ని అడ్డుపెట్టుకునే అక్కడ తీవ్రవాదులు చెలరేగిపోతున్నారని తెలిపారు. ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్లో 60వేల మంది పౌరులు, సైనిక దళాల సభ్యులు మరణించారని తెలిపారు. భారత ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ రాష్ట్రంలో అభివృద్దికి కుమ్మరిస్తున్నాఅక్కడ హింసా కాండ మాత్రం ఆగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి, కాశ్మీర్ ని భారత్లో సంపూర్ణంగా విలీనం చేసుకుంటే తప్ప ఆ హింస ఆగదని చెప్పారు.
ఆర్టికల్ 370 రద్దు మతపరమైనది కాదని, జాతి పరమైనదని ఈ విషయాన్ని దేశ ప్రజలందరికీ వివరంగా చెప్పేందుకే జమ్మూ కాశ్మీర్ అధ్యయన కేంద్రం ఢిల్లీలో ప్రారంభమైందని, విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ శాఖ పని చేస్తున్నదని సమన్వయ కర్త శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు వివరించారు.
జమ్మూకు చెందిన శ్రీమతి నీరూ మిశ్రా ఆ రాష్ట్రంలో ఆర్టికల్ 35[ఏ] వల్ల అక్కడ మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను వివరించారు. జమ్మూ కాశ్మీర్ మహిళ మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆమెకు ఆ రాష్ట్రంలో ఎటువంటి హక్కులు ఉండవని, అదే కాశ్మీరి పురుషుడు మరో రాష్ట్రం అమ్మాయిని వివాహం చేసుకుంటే ఆమెకు కలిగే సంతానానికి మాత్రం కాశ్మీర్ లో సర్వ హక్కులూ వున్నాయని తెలిపారు. పరదేశీయులను, ఉదాహరణకు పాకిస్థాన్ కు చెందిన వారిని పెళ్ళాడిన వారికి కూడా అన్ని హక్కులూ కల్పిస్తూ, భారతీయులను పెళ్ళాడిన వారి హక్కులను హరించే ఆర్టికల్ 35[ఏ] ని తక్షణం రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ మహిళలకు సమానత్వం కల్పించాలని నీరూ మిశ్రా డిమాండ్ చేశారు. కాశ్మీర్ లోయలోని పండిట్ల పరిస్థితి మరింత దుర్భరమని శ్రీమతి మిశ్రా వివరించారు. లోయలో మిగిలిన వారు బిక్కు బిక్కుమంటూ బ్రతుకు వెళ్ళదీస్తుండగా, ప్రాణ భయంతో లోయను వదిలినవారు స్వదేశంలోనే గత రెండు దశాబ్దాలుగా కాందిశీకులుగా బ్రతుకీడుస్తున్నారని నీరూ మిశ్రా వివరించారు.
అనంతరం పుల్వామా ఉగ్ర దాడిలో అసువులు బాసిన వీర సైనికుల మృతికి సంతాపంగా సభికులు మౌనం పాటించారు. చివరిగా భారతీయ విద్యాభవన్ కేంద్ర కార్యదర్శి డా|| బి. సారంగపాణి వందన సమర్పణ గావించారు.





