
ఈమధ్య నా వాట్సప్ కు ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఒక బంధువుల కుర్రాడి తాలూకూ ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ అది. అందులో వధువు తాలూకు వివరాలు చూసి నేను ఒకింత ఆశ్చర్యపోయా. కారణం ఆ అమ్మాయిది వేరే కులం. పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు. తల్లిదండ్రులు కష్టంగానైనా ఒప్పుకున్నారు. త్వరలో వారిద్దరూ ఒక్కటవనున్నారు. సంతోషం.
ఏదేమైనా ఈమధ్య కులాంతర వివాహాలు మన సమాజంలో బాగా పెరిగాయి. ఇది ఒక శుభపరిణామం. 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో 5.8 శాతం కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. నా అంచనా అయితే ఇప్పటికి అది నాలుగైదు రెట్లు పెరిగి ఉంటుంది.
పురాణాలలోనూ దృష్టాంతాలెన్నో…
మనం పరిశీలిస్తే… పురాణకాలంలో వివాహాల విషయంలో కుల పట్టింపులు పెద్దగా ఉన్నట్టుగా కనిపించదు. పరాశరుడు – మత్స్యగంధి, శంతనుడు – మత్స్యగంధి, రుక్మిణి – శ్రీకృష్ణుడు, అర్జునుడు – సుభద్ర, అర్జునుడు – ఉలూపి (నాగకన్య), భీముడు – హిడింబి (రాక్షస కన్య), వశిష్ఠుడు – అరుంధతి…. ఇలా చెప్పుకుంటూ పోతే కులాంతర వివాహాలకు లెక్కలేనన్ని దృష్టాంతాలు కనబడతాయి.
కులాలు కేవలం వృత్తిని బట్టి కాక వారి వారి ఆరాధనా పద్ధతులు, ఆచార వ్యవహారాలను బట్టి కూడా నిర్ణయించబడ్డాయి. వారిలో కొందరు వైదిక ఆచారాలు, యమ నియమాలు పాటించే వారు కాగా…. మిగిలిన వారు శక్తి ఉపాసకులు. వీరికీ వారికీ ఈ ఆరాధనా పద్ధతులు, ఆచార వ్యవహారాలలో కొన్ని స్పష్టమైన తేడాలున్నాయి. ఆ కారణంగానే తరువాతి కాలంలో వారి మధ్య వివాహాల వంటివి క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అదే క్రమంలో అంతరాలు, ఉచ్ఛ నీచ భేదభావాలు ఏర్పడి, అంటరానితనం అనే దురాచారం వరకూ దారితీశాయి.
అయితే ఇప్పుడు ఆ వృత్తులు లేవు, వృత్తుల మధ్య అంతరాలూ లేవు. అన్ని వర్గాలవారూ చదువుకునే అవకాశాలు ఏర్పడడంతో…. అందరూ అన్ని రంగాలలోనూ పని చేస్తున్నారు. అందరూ అన్ని పనులలోనూ నిపుణత సాధిస్తున్నారు. ఆరాధనా పద్ధతులలోని తేడాలు సైతం సమసి పోయాయి. పట్టింపులు పూర్తిగా తగ్గాయి. అందరూ అన్నిటినీ అవలంబించే పరిస్థితులు నెలకొన్నాయి. శూద్ర కులాల వారు కూడా యజ్ఞయాగాదులు, హోమాల వంటి క్రతువులకు ధన సమర్పణ చెయ్యడం, వాటిలో పాల్గొంటూ ఉండడం మనం చూస్తున్నాం. సమరసతా సేవా ఫౌండేషన్ (SSF) హరిజన, గిరిజన, మత్స్యకార గ్రామాలలో నిర్మించిన వందలాది దేవాలయాలలో TTD ద్వారా శిక్షణ పొందిన ఆయా కులస్తులే అర్చకులుగా కొనసాగుతూ ఉండడం కూడా మనం చూస్తున్నాం. కనుక పూజాది కార్యాల మధ్య పూర్వం ఉన్న అంతరం నేడు మటుమాయమయిందనే చెప్పాలి.
సమాజంలో సమరస భావ నిర్మాణం కోసం కులాంతర వివాహాలను ప్రోత్సహించిన అన్నాదురై, పెరియార్ రామస్వామి, రఘుపతి వెంకటరత్నం నాయుడు, మంతెన వెంకటరాజు వంటివారి కృషి తో పాటు, 9 దశాబ్దాలుగా తమ సంస్థలలో, కార్యకలాపాలలో కుల ప్రస్తావనే లేకుండా, సహజంగా కులభావన లేని వ్యక్తులను నిర్మిస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, శ్రీ దత్తోపంత్ ఠేంగ్డే రూపొందించిన సామాజిక సమరసతా వేదిక, ఆంధ్రనాట ధార్మిక, సమరస భావ వికాసం కోసం పనిచేస్తున్న సమరసతా సేవా ఫౌండేషన్ (SSF) వంటి సంస్థల కృషి ఫలితంగా కూడా సమాజంలో ఈ పరివర్తన సాధ్యమైందని చెప్పవచ్చు. వధూవరులలో ఏ ఒక్కరైనా దళితులై ఉండి, వారు తమ వివాహాన్ని 1955 హిందూ వివాహ చట్టం క్రింద నమోదు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆ జంటకు 2.5 లక్షల రూపాయలను బహుమతిగా అందజేస్తోంది. ఇవన్నీ కూడా ప్రస్తుత పరిణామాలకు కారణమని చెప్పొచ్చు.
సామాజిక పరిణామాలు
దానితో పాటుగా ఇప్పుడు సమాజంలో అత్యధికులు విద్యావంతులు కావడం వల్ల కూడా కుల అంతరాలు తొలగి అందరి మధ్య వివాహ బాంధవ్యాలు ఏర్పడడం సాధ్యమవుతోంది. కళాశాలలో, కార్యాలయాలలో మాత్రమే కాక ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇంస్టా వంటి సామాజిక మాధ్యమ వేదికల ద్వారా కూడా పిల్లలు, వారి భావాలు, మనసులు కలుస్తున్నాయి. ఉన్నత విద్య, సామాజిక అవగాహన కారణంగా తల్లిదండ్రులు కూడా పెద్ద వ్యతిరేకత లేకుండానే అలాంటి వివాహాలకు అంగీకరిస్తున్నారు. అదే సమయంలో పిల్లలు కూడా తమ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే కృతనిశ్చయంతో వ్యవహరిస్తున్నారు. నిజానికి ఇది చాలా మంచి పరిణామం. యవ్వన ఆవేశంలో ఎవరినో ఒకరిని ప్రేమించి, ఇంట్లో వాళ్ళని ఒప్పించ లేక పారిపోయి వివాహం చేసుకుని సరైన జీవనాధారము, ఆర్థిక వనరులు, జీవితంపై అవగాహన, పెద్దల అండ లేక అనేక ఇబ్బందులు పడి, కొన్నిచోట్ల నమ్మి వెళ్లిన వాడి చేతిలో దారుణంగా మోసపోయి, తిరిగి రాలేక, అక్కడ ఉండలేక జీవితాన్ని, ప్రాణాలను బలి చేసుకునే యువతులు ఎందరో…. అయితే ఇప్పుడు మారిన పరిస్థితులలో అటు పిల్లలు, ఇటు పెద్దలు తగిన అవగాహనతో, పరిణతితో ఆలోచిస్తూ, వ్యవహరిస్తూ ఉండటం ఒక శుభ పరిణామం, అత్యంత అవసరమైన విషయం కూడా…
కొన్ని కులాంతర వివాహాల వెనుక, కొన్నిచోట్ల అవసరం కూడా కనిపిస్తున్నది. అగ్రకులాలలో అమ్మాయిలకు కొరత ఏర్పడడమే ఆ అవసరానికి కారణం. ఒకటి రెండు దశాబ్దాల క్రితం వరకూ వరకట్న భయంతో విపరీతంగా జరిగిన భ్రూణ హత్యలు, అబార్షన్ లే ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే మరో రెండు దశాబ్దాలు పడుతుందేమో? మొత్తానికి అగ్రకులాలలో అమ్మాయిల కొరత ఏర్పడటం ఒకరకంగా మంచిదే అయింది. దాని కారణంగా అగ్రకులాల అబ్బాయిలు, వారి తల్లిదండ్రులు మిగిలిన కులాలలోని అమ్మాయిలను తమ కుటుంబాలలోకి ఆహ్వానించడం మొదలైంది.
ఉన్నతాదాయ కుటుంబాలలో, సెలబ్రిటీల కుటుంబాలలో ఎప్పట్నుంచో ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉన్న విషయమే. జగపతిబాబు, చిరంజీవి, మోహన్ బాబు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, అపోలో హాస్పిటల్స్ యాజమానులు, సిపిఐ నారాయణ ఇలా చెప్పుకుంటూ పోతే మన రాష్ట్రంలోనే పెద్ద లిస్టు తయారవుతుంది.
పెద్ద పెద్ద కులాలు, కుటుంబాలలోనే కులాంతర వివాహాలు, జరుగుతాయనుకుంటే మనం తప్పులో కాలేసినట్టే. ఒక సర్వే ప్రకారం అగ్ర, సంపన్న కులాలు, వర్గాల కన్నా నిమ్న కులాలు, పేద కుటుంబాలలోనే ఈ కులాంతర వివాహాలు సర్వసాధారణంగా జరుగుతున్నాయన్న విషయం తేటతెల్లమైంది.
కుల భావన పోవాలి…..
మొత్తానికి ఏదో ఒక మార్గంలో ఈ కులాల మధ్య ఉన్న అంతరాలు సమసి పోవాలి. మనుషులలో కుల భావనలు అంతరించిపోవాలి. మనమంతా ఒకటేనని, అందరమూ ఆ తల్లి భరతమాత సంతానమనే భావన మనందరిలో ఏర్పడాలి. అందరం కలసికట్టుగా మన దేశ పురోభివృద్ధికి కృషి చేయాలి. మనలోని విద్యని, విద్వత్తుని, జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని సమాజంలో అంతరాలు, వైషమ్యాలు నిర్మించడానికి కాక మనసా వాచా కర్మణా దేశ హితం కోసమే సంపూర్ణంగా వినియోగించాలి. అప్పుడే మన దేశంలోని ఎందరో స్వతంత్ర సమరయోధులు, సంస్కరణవాదులు, అభ్యుదయవాదులు కలలు కన్న సువర్ణ భారతం, సమైక్య భారతం, సమర్థ భారతం, ఆవిష్కృతమవుతుంది. మన దేశం… మన భారతదేశం జగాన జగద్గురువుగా అవతరిస్తుంది. భారతమాతకు జయమగుగాక.





