మూర్తీభవించిన వాత్సల్య మూర్తి శ్రీ పిళ్ళారామారావు – సఫల సాధకుడు, ధన్య జీవి స్వర్గీయ శ్రీరామశాయి. – సంస్మరణ సభలో వక్తలు.

సీనియర్ ఆరెస్సెస్ కార్యకర్త శ్రీ పిళ్ళా రామారావు మూర్తీభవించిన వాత్సల్య మూర్తి అని విశ్వ హిందూ పరిషత్ కేంద్ర కార్యాలయ కార్యదర్శి శ్రీ కోటేశ్వర శర్మ చెప్పారు. ఈరోజు అయోధ్య నగర్ లోని హైందవిలో విశాఖ పట్టణానికి చెందిన సీనియర్ ఆరెస్సెస్ కార్యకర్త స్వర్గీయ పిళ్ళా రామారావు, విజయవాడకు చెందిన సుప్రసిద్ధ ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్త స్వర్గీయ శ్రీరామశాయిల సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న వక్తలు స్వర్గీయ పిళ్ళా రామారావు, స్వర్గీయ శ్రీరామశాయిల సేవలను కొనియాడారు.
ఆరెస్సెస్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ మాట్లాడుతూ వ్యక్తిగత అభిప్రాయాలకు కాక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా సంఘ ప్రయోజనాలు, అభిప్రాయాలకే వీరిరువురూ పెద్ద పీట వేశారని తెలిపారు. అలాంటి నిబద్దత కలిగిన కార్యకర్తలను కోల్పోవటం దురదృష్టకరమని, వారిరువురి క్రమశిక్షణ, చిత్తశుద్ది, నిబద్దత అందరికీ ఆదర్శమని తెలిపారు. శ్రీరామశాయి రాజకీయాలలో క్రియాశీలకంగా పని చేస్తూ కూడా ఏనాడూ ప్రతిష్ట, పదవులు కోరుకోలేదని, ఎన్నో పదవులు పొందే అవకాశాలు వున్నా కూడా 45, 46సం.ల వయస్సులోనే రాజకీయాల నుంచి విరమించుకుని సంఘ పనిలో నిమగ్నమయ్యారని, ఇది అసాధారణ విషయమని తెలిపారు.
మాజీ దేవాదాయ శాఖామాత్యులు, ఎమ్మెల్యే శ్రీ మాణిక్యాల రావు మాట్లాడుతూ తాను మంత్రిగా పని చేసే రోజులలో శ్రీరామశాయి గారు తనకు ఎన్నో అమూల్యమయిన సలహాలనిచ్చేవారని తెలిపారు. సహజంగానే అధ్యయన శీలి అయిన శ్రీ రామశాయి గారు వర్తమాన రాజకీయాలపై అద్భుతమయిన విశ్లేషణలు చేసేవారని తెలిపారు. అలాంటి ఆత్మీయుణ్ణి, పిళ్ళా రామారావు వంటి సీనియర్ కార్యకర్తని కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపారు.
సామాజిక సమరసతా వేదిక జాతీయ కన్వీనర్ శ్రీ శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ శ్రీ పిళ్ళా రామారావు గారిది పరిపూర్ణ వ్యక్తిత్వమని, వారు సంపూర్ణ జీవితాన్ని గడిపారని తెలిపారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న శ్రీ రామారావు ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్ మెంబెర్ గా కూడా ఉండేవారని తెలిపారు. విశాఖ పట్టణంలో ఏ పనికైనా వారే పెద్ద దిక్కుగా నిలిచేవారని ఆయన తెలిపారు. శ్రీ పిళ్ళా రామారావు హిందూ సమాజ పెద్దగా వ్యవహరించారని తెలిపారు.
ఇక శ్రీరామశాయి విషయానికి వస్తే తనకున్న అతి కొద్ది మంది సన్నిహితులలో శ్రీ రామశాయి ఒకరని శ్రీ శ్యాం ప్రసాద్ తెలిపారు. మీడియాతో మూడు దశాబ్దాల అనుబంధం కలిగిన శ్రీరామశాయి ఆరెస్సెస్ ప్రచార ప్రముఖ్ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించారని తెలిపారు.
భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ సత్యానంద భారతీ స్వామి మాట్లాడుతూ స్నేహ శీలి, సౌమ్య మూర్తి అయిన శ్రీ పిళ్ళా రామారావు మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. 1963లో తాను విశాఖ బి.టి కాలేజిలో పని చేసినపుడు వార్తో వున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
రామశాయి గారున్నారన్న ధైర్యంతో తమ భువనేశ్వరీ పీఠంలో ఎన్నో భవిష్యత్తు కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించుకున్నామని వాటన్నిటినీ వమ్ము చేసి, మోసం చేసి శ్రీరామశాయి తమను వీడి పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీరామశాయి బాల్య మిత్రుడు రవి భారత ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పంపిన సంతాప సందేశాన్ని చదివి వినిపించారు. ఆరెస్సెస్, బీజేపీలకు శ్రీరామశాయి అందించిన సేవలు అసామాన్యమాన్యమైనవని, వారి అకుంఠిత దీక్ష, దక్షతలు అందరికీ ఆదర్శమని శ్రీ వెంకయ్య తన సందేశంలో తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ విజయవాడ మహానగర్ సంఘచాలక్ శ్రీ నార్ల వినయ్ కుమార్, ప్రముఖ జర్నలిస్ట్, రామశాయి గారి మిత్రులు శ్రీ రామకృష్ణారెడ్డి, తదితర కార్యకర్తలు, మిత్రులు, బంధువులు పాల్గొన్నారు.





