News

44 చైనా విమానాలను రద్దు చేసిన అమెరికా

363views

యుఎస్ ఎయిర్‌లైన్స్ విమానాలను చైనా బలవంతంగా రద్దు చేయడంతో చైనా విమానయాన సంస్థలకు కూడా అమెరికా షాకిచ్చింది. చైనాకు చెందిన 44 విమానాలను బ్లాక్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ముందుకొచ్చింది. నాలుగు చైనీస్ విమానయాన సంస్థలపై చర్యలు తీసుకుంటూ అమెరికా రవాణా శాఖ శుక్రవారం నాడు కొత్తగా నిర్ణయం తీసుకుంది. డెల్టా ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ నడుపుతున్న కొన్ని ఇన్‌బౌండ్ విమానాలను చైనా గతంలో నిషేధించింది. ఆయా విమానాలలోని ప్రయాణికులకు కోవిడ్-19 పాజిటివ్ గా రావడంతో చైనా ఆంక్షలను విధించింది. చైనా తీసుకునే చర్యల కారణంగా చాలా దేశాలకు చెందిన విమానయాన సంస్థలు ఇబ్బందులు పడ్డాయని.. చైనా ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని యుఎస్ పేర్కొంది. చైనా తీసుకున్న చర్య ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైనదని అమెరికా రవాణా శాఖ పేర్కొంది.

తాము భవిష్యత్తులో మరిన్ని చైనా విమానాలు రద్దు చేసే అవకాశముందని USA తెలిపింది. ఎయిర్ చైనా, చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్, చైనా సదరన్ ఎయిర్‌లైన్స్, జియామెన్ ఎయిర్‌లైన్స్ విమానాలపై జనవరి 30 నుంచి మార్చి 29 వరకు U.S.A ఆంక్షలు విధించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.