అయోధ్య విషయంలో కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద ముందడుగు – వివాదాస్పద భూభాగం చుట్టూ వున్న 67 ఎకరాల భూమిని దాని సొంతదారులకు అప్పగించేందుకు అనుమతి కోరుతూ….

న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అతి పెద్ద ముందడుగు పడింది. అయోధ్యలోని రామ జన్మభూమి చుట్టూ సేకరించిన 67 ఎకరాల భూమిని తిరిగి ఆయా యజమానులకు ఇచ్చేందుకు అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయోధ్యలో మొత్తం 2.77 ఎకరాల భూమిపై వివాదం కోర్టులో నడుస్తోంది. ప్రభుత్వం దాని చుట్టూ ఉన్న 67 ఎకరాల భూమిని ఆయా యజమానుల నుంచి సేకరించింది. ఈ భూమి వివాదంలో లేదు. ఇప్పుడు దానిని ఆయా యజమానులకు తిరిగి ఇచ్చేస్తామని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ఈ 67 ఎకరాల భూమిని ప్రభుత్వం 1991లో సేకరించింది. దానిని తిరిగి దాని స్వంతదారులకు ఇవ్వడానికి అనుమతినివ్వాలని కేంద్రం పిటిషన్లో పేర్కొంది.
ఇప్పుడు ఆ భూమిని తిరిగి యజమానులకు ఇచ్చేయాలని రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటైన రామ జన్మభూమి న్యాస్ కోరుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తన పిటిషన్లో వెల్లడించింది. గతంలో ఈ అంశంపై కోర్టు స్పందిస్తూ ఆ 67 ఎకరాల విషయంలోనూ ఇప్పుడున్న పరిస్థితినే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే మరోసారి ఆ తీర్పును సమీక్షించాలని ఇప్పుడు కేంద్రం కోరుతోంది. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా చేసి.. సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్ లల్లాకు పంచుతూ తొమ్మిదేళ్ల క్రితం అంటే 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో దాదాపు 14 పిటిషన్లు దాఖలయ్యాయి.
దశాబ్దాలుగా నానుతున్న ఈ కేసును సుప్రీమ్ కోర్టు ఐదుగురు సభ్యుల బెంచ్ లో ఒక సభ్యుడైన జస్టిస్ ఎస్. ఏ బొబ్డే అందుబాటులో లేరనే కారణంతో కేసు విచారణను వాయిదా వేసిన వెంటనే కేంద్రం ఈ పిటిషన్ వేయడం గమనార్హం.
కేంద్ర న్యాయ శాఖా మంత్రి జస్టిస్ రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ కోట్లాది ప్రజల ఆకాంక్షలతో ముడి పడి వున్న అంశం కనుక సుప్రీమ్ న్యాయస్థానం దీనిని త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శబరిమల విషయంలోనూ, అక్రమ సంబంధాల విషయంలోనూ, అర్బన్ నక్సల్స్ విషయంలోనూ కోర్టు త్వరిత గతిన స్పందించి తీర్పును వెలువరించిన విషయాన్ని గుర్తు చేశారు. సుప్రీమ్ కోర్టు ఆ విధంగా వేగంగా స్పందించడం ఆహ్వానించదగ్గ పరిణామమని, అయోధ్య అంశం కోట్లాది ప్రజల విశ్వాసాలు, ఆశలు, ఆకాంక్షలకు సంబంధించిన విషయం కనుక కోర్టు వెంటనే స్పందించి పరిష్కరించాలని కోరారు.
Source : VSK, Delhi.





