News

ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత ప్రచార ప్రముఖ్ డా|| శ్రీరామశాయి గారి ఆకస్మిక మృతి.

600views

ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత  ప్రచార ప్రముఖ్, హిందూ నగారా మాస పత్రిక ఎడిటర్ డా||శ్రీరామశాయి గారు [59] ఈ రోజు సాయంత్రం 7 గంటలా 20 నిముషాలకు గుండె పోటుతో మృతి చెందారు.

ఢిల్లీ యూనివర్సిటీలో M.Tech పట్టభద్రులైన తర్వాత రాజకీయాల మీద ఆసక్తితో భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా కొనసాగారు. మాజీ ప్రధాని వాజపాయ్ వంటి వారితో సన్నిహితంగా  మెలిగారు. ఇప్పుడు కేంద్ర మంత్రులుగా వున్న చాలా మంది నాయకులతో వారికి సాన్నిహిత్యం వుండేది.

సహజంగానే సాహిత్యం మీద మక్కువ కలిగిన శ్రీరామశాయి ఆంద్ర భూమి, జాగృతి వంటి పత్రికలకు వ్యాసాలు వ్రాసేవారు.  కొంత కాలం ఆరెస్సెస్ విజయవాడ విభాగ్ కార్యవాహగా బాధ్యత నిర్వర్తించిన శ్రీరామశాయి గారు గత కొంత కాలంగా హిందూ నగారా మాస పత్రిక సంపాదకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పత్రికలు, ప్రచార సాధనాలలో విశేష పరిచయాలు, పలుకుబడి, ప్రవేశం కలిగిన ఈ బహు ముఖ ప్రజ్ఞాశాలి గత కొంతకాలంగా ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత ప్రచార ప్రముఖ్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ వుండడం గమనార్హం. డా|| దుగ్గరాజు శ్రీనివాస రావు, డా|| సారంగ పాణి వంటి ప్రముఖ కాలమిస్టులు, రచయితలు వీరికి సన్నిహితులు.

నిన్న ఉదయం రిపబ్లిక్ డే సందర్భంగా తన వద్ద వున్న దాదాపు వెయ్యి పుస్తకాలతో “సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్” పేరుతో రాజకీయ, సామాజిక అధ్యయన కేంద్రం [గ్రంధాలయం] ప్రారంభించారు. నిన్న ఆ కార్యక్రమం సందర్భంగా వారిని కలిసిన వారందరూ నేడు ఈ వార్త తెలిసి దుఃఖ సాగరంలో మునిగిపోయారు.రాష్ట్ర వ్యాప్తంగా  ఈ విషాద వార్త తెలుసుకున్న ఆరెస్సెస్, భాజపా కార్యకర్తలు వారి కడసారి చూపుకై రాష్ట్రం నలు మూలల నుండి విజయవాడ పయనమయ్యారు.

వారి అంతిమ కోర్కె మేరకు బంధు మిత్రులు వారి నేత్రాలను దానం చేశారు. విజయవాడ నగరంలోని ఎల్.వి ప్రసాద్ నేత్ర వైద్య శాల వారు వారి నేత్రాలను సేకరించారు.