
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలో ఉగ్రదాడులకు పథక రచన చేశారన్న ఆరోపణలపై ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సభ్యులు ఇద్దరిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే వీరు జమ్ముకశ్మీర్‌లో వకుర, బటపోరా ప్రాంతానికి చెందిన అబ్దుల్ లతీఫ్ ఘనీ, హిలాల్ అహ్మద్ భట్‌లుగా గుర్తించారు. ఢిల్లీ లక్ష్మీనగర్‌లోని ఓ ఇంటిలో కొందరు అనుమానిత వ్యక్తులు వచ్చివెళ్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు పోలీసులు ఆ ఇంటిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో రాజ్‌ఘాట్‌లో కొందరిని కలిసేందుకు ఘనీ వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడ మాటువేసి పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి కొన్ని ఆయుధాలు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఘనీ ఇచ్చిన సమాచారం మేరకు అతని అనుచరులను పట్టుకునేందుకు జమ్ము కశ్మీర్ వెళ్లి వెళ్లిన ప్రత్యేక బృందం బండిపోరలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుంది. రిపబ్లిక్ డే రోజు ఉగ్రదాడులకు సన్నాహాల్లో భాగంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఓ గ్యాస్ పైప్‌లైన్ లక్ష్యంగా దాడులు చేయాలని పథకం రచించినట్లు, రెండు ప్రాంతాల్లో వీళ్లు రెక్కీ కూడా నిర్వహించారని ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. తాము జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలో చురుకుగా పనిచేస్తామని విచారణలో నిందితులిద్దరూ తెలిపినట్లు పోలీసులు తెలిపారు.
Source : Bharath Today.
https://www.bhaarattoday.com/news/national/terror-attack-plan-in-delhi-republi-cday-celebrations/30429.html





