News

ఇస్రో కీర్తి కిరీటంలో మ‌రో క‌లికితురాయి

592views
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయాణంలో మరో మైలురాయి చేరింది. పీఎస్ ఎల్వీ-సీ44 రాకెట్‌ను గురువారం అర్ధరాత్రి విజయవంతంగా ప్రయోగించారు. మన దేశానికి చెందిన శాస్త్రవేత్తలు, విద్యార్థులు అంతరిక్ష పరిశోధనలు చేసుకునేందుకు ఇది 6 నెలలపాటు ఉపయోగపడనుంది. ఈ రాకెట్‌ ద్వారా తొలుత రక్షణ రంగానికి చెందిన మైక్రోశాట్‌-ఆర్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఆపై రాకెట్‌లోని నాలుగో దశను వ్యర్థంగా వదిలేయకుండా మరింత ఎత్తులోకి తీసుకెళ్లి అంతరిక్ష పరిశోధనలకు వేదికగా ఉపయోగపడేలా తీర్చిదిద్దింది. ఈ దశలో కలాంశాట్‌-వీ2 అనే బుల్లి ఉపగ్రహాన్ని ఉంచింది.
ప్ర‌యోగం ఇలా…
ఈ నానో శాటిలైట్‌ను తమిళనాడుకు చెందిన విద్యార్థులు తయారు చేయడం విశేషం. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ అంతక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి గురువారం అర్ధరాత్రి 11.37 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. డీఆర్డీవోకు చెందిన 700 కిలోల మైక్రోశాట్‌-ఆర్‌, విద్యార్థులు తయారు చేసిన 1200 గ్రాముల కలాంశాట్‌-వీ2ను తీసుకుని పీఎస్ ఎల్వీ-సీ44 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం మొదలైన 12.46 నిమిషాలకు 276 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఆ సమయంలో ఇంజన్‌ పనిచేయకుండా శాస్త్రవేత్తలు ఆపేశారు. దీంతో 13.33 నిమిషాలకు 277 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. అక్కడ రాకెట్‌ నాలుగో దశ నుంచి మైక్రోశాట్‌-ఆర్‌ ఉపగ్రహం విడిపోయి.. భూమధ్య రేఖకు 96 డిగ్రీల వాలులోని సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలోకి చేరుకుంది. ఆపై నాలుగో దశ ఇంజన్‌ను రెండుసార్లు నియంత్రించి ప్రయోగం అనంత‌రం 1.42 గంటలకు 450 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చారు. భూమధ్యరేఖకు 98 డిగ్రీల వాలులోని సూర్యానువర్తన ధ్రువ వృత్తాకారపు కక్ష్యలో ఉంచారు. దాంతో అంతరిక్షంలో ఒక తాత్కాలిక ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశారు. ప్రయోగాన్ని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె. శివన్‌ స్వయంగా పర్యవేక్షించారు. ప్రయోగానికి ముందు.. తిరుమల శ్రీవారిని, సూళ్లూరుపేట చెంగాళమ్మను ఆయన దర్శించుకున్నారు. ఈ ఏడాది 32 ఉపగ్రహాలు ప్రయోగిస్తున్నట్లు చెప్పారు.
ఇది రెండో కలాంశాట్‌
కలాంశాట్‌ వీ2 తమిళనాడు హైస్కూల్‌ విద్యార్థులు తయారు చేసిన రెండో ఉపగ్రహం. తమిళనాడు పల్లపట్టి హైస్కూల్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు ప్రపంచంలోనే అతిచిన్న ఉపగ్రహాన్ని(64 గ్రాములు) 2017లో తయారు చేశారు. ఆ బుల్లి ఉపగ్రహానికి మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ అబ్దుల్‌ కలాం పేరు పెట్టారు. 2017 జూన్‌ 27న నాసా తన సౌండింగ్‌ రాకెట్‌తో దాన్ని ప్రయోగించింది. ప్రస్తుతం ఈ బృందం 1200 గ్రాముల బరువు, 10 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు, ఎత్తుతో చతురస్రాకారంగా ఉండే కలాంశాట్‌-వీ2ను రూపొందించింది. ఇందుకు రూ.12లక్షలు ఖ‌ర్చు చేశారు.
Source : Bharath Today.
https://www.bhaarattoday.com/news/regional-news/isro-successfully-launches-military-satellite-microsat-r/30420.html