
టోక్యో: పదేపదే బూస్టర్ డోసుల అవసరం లేకుండా వ్యాధుల నుంచి దీర్ఘకాల రక్షణ కల్పించే వ్యాక్సిన్ల రూపకల్పన దిశగా జపాన్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. రోగ నిరోధక వ్యవస్థలో దీర్ఘకాల జ్ఞాపకశక్తికి సంబంధించిన ఒక ప్రాథమిక అంశాన్ని వారు గుర్తించారు. దీని ఆధారంగా కొవిడ్-19 నుంచి మలేరియా వరకూ అనేక రకాల వ్యాధులకు మెరుగైన వ్యాక్సిన్లను అభివృద్ధి చేయవచ్చని పరిశోధకులు తెలిపారు.
ఒక వ్యక్తి దోమకాటుకు గురికావచ్చు. ఎన్నిసార్లయినా మలేరియా బారినపడొచ్చు. అయితే, మలేరియా కారక పరాన్నజీవి ఏదో ఒక రకంగా మెమరీ బి కణాలను తప్పించుకోగలుగుతోంది. గతంలో ఎన్నిసార్లు మలేరియా ఇన్‌ఫెక్షన్ల బారినపడినప్పటికీ మళ్లీ ఆ వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురయ్యే ముప్పు కొందరికి పొంచి ఉంటుంది.
ఈ నేపథ్యంలో టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మలేరియాపై దృష్టి సారించారు. అలాగే సహజసిద్ధ రోగనిరోధక స్పందనకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై నిశితంగా పరిశోధన చేశారు. టీబీకే1 అనే ఎంజైమ్ వీరిని ఆకర్షించింది. వైరస్‌ల నుంచి రక్షించే రోగనిరోధక శక్తి కల్పనలో దీనికి పాత్ర ఉన్నట్టు ఇప్పటికే వెల్లడైంది. అయితే టీబీకే1కు బి కణ చర్యలతో ఉన్న సంబంధంపై మాత్రం అవగాహన లేదు.





