
-
బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు అక్రమ రవాణా
-
బాలికలను వ్యభిచార రొంపిలోకి నెట్టివేత
-
‘విజయ్ కుమార్’ పేరుతో పది పెళ్ళిళ్ళు, 100 మంది గర్ల్ ఫ్రెండ్స్
-
పేద ఇళ్ళే టార్గెట్, భర్తకు సహకరించిన భార్య
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. మానవ అక్రమ రవాణా, వ్యభిచారం నిర్వహిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన మోమిన్ అనే వ్యక్తిని, అతని సహచరుడు బబ్లూతోపాటు మరికొంతమందిని అరెస్టు చేశారు. 5,000 మందికి పైగా బాలికలను కొనుగోలు చేసి విక్రయించానని, అలాగే వారిని సెక్స్ రాకెట్‌లోకి నెట్టినట్టు మోమిన్ పోలీసుల ముందు అంగీకరించాడు.
‘విజయ్ కుమార్’ అనే నకిలీ పేరుతో నివసిస్తున్న మోమిన్ సుమారు 25 ఏళ్ళ కిందట బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి వచ్చాడు. దేశంలోకి ప్రవేశించిన తర్వాత, అతను ముంబైలోని నాలా సోపారా ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడు. ముంబయి, సూరత్ వంటి ప్రాంతాల్లో తన దందా కొనసాగించడానికి వీలుగా తన వ్యాపారానికి ఇండోర్‌ను కొత్త గమ్యస్థానంగా మార్చడానికి ప్రయత్నించాడు. మోమెన్ భార్య బంగ్లాదేశ్‌లో సాంఘిక సంక్షేమం పేరుతో ఎన్జీవోను నిర్వహిస్తోంది. దాని ముసుగులో ఆమె బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి బాలికలను అక్రమంగా రవాణా చేసేది.

ఉద్యోగాలు ఇప్పిస్తామనే పేరుతో పేదల ఇళ్లలోని ఆడపిల్లలను భారత్‌కు పంపేవారు. అయితే, ఇక్కడికి చేరుకోగానే వారిని బలవంతం చేసి వ్యభిచార వృత్తిలోకి నెట్టేసేవారు. ప్రధాన నిందితుడు మోమిన్ 10 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని, ఇవే కాకుండా అతనికి 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారని ఇండోర్ ఐజీ హరినారాయణ్ మిశ్రా చారి మీడియాతో చెప్పారు. ఇండోర్, ధార్, ఝబువా, అహ్మదాబాద్, సూరత్, జైపూర్‌తో సహా దేశంలోని అనేక నగరాల్లో అతడికి లింక్స్ ఉన్నాయని తెలుస్తోంది. వ్యభిచారం ముసుగులో డ్రగ్స్‌ను కూడా స్మగ్లింగ్ చేసేవాడని పోలీసులు గుర్తించారు.
ఇండోర్‌లోని విజయ్ నగర్ పోలీసుల వివరాల ప్రకారం.. గత సంవత్సరం అక్టోబర్ 2020 లో ఒక యువతి తాను బంగ్లాదేశ్ నుండి వచ్చానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను కొందరు అక్రమంగా దాటించి భారతదేశంలోని విజయ్ (మోమిన్)కి అప్పగించారు. అప్పటి నుండి అతను పోలీసుల రాడార్‌లో ఉన్నాడు. అతనిని పట్టుకోవడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారం రోజుల క్రితం ముంబైలో ఉన్న అతను పోలీసుల దృష్టి తనపై పడిందని తెలుసుకుని వెంటనే ఇండోర్ వచ్చాడు. అయితే ఇక్కడ విజయ్ నగర్ పోలీసులు పక్కా సమాచారంతో అతడిని పట్టుకున్నారు.
Source: NationalistHub





