
-
మత మార్పిడులపై వివరణ ఇవ్వడంలో జాప్యం
న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిడులపై జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి నోటీసు జారీ చేసింది. గతంలో జారీ చేసిన నోటీసుకు సమాధానం ఇవ్వడంలో జాప్యం చేసినందున తాజాగా నోటీసు జారీ చేసింది.
ఆంధ్రాలో ఎస్సీ సామజిక వర్గానికి చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మత మార్పిడులపై గతంలో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్, దాని అనుబంధ సంస్థ అయిన ఎస్సీ-ఎస్టీ రైట్స్ ఫోరమ్ జాతీయ ఎస్సీ కమిషన్‌కు నివేదిక సమర్పించారు. ఈ మతమార్పిడులను ఎస్సీలపై జరుగుతున్న సాంస్కృతికపరమైన దాడిగా అభివర్ణిస్తూ పంపిన నివేదిక అనేక కీలక అంశాలు పొందుపరిచారు. షెడ్యూల్డ్ కులాల సంస్కృతీసంప్రదాయాలు కాపాడాల్సిన ప్రభుత్వాలు ఆ పనిచేయకపోగా మతమార్పిడుల పట్ల చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయని కమిషన్‌కు తెలిపారు. దీనికి స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్ ఈ అంశంలో చర్యలు తీసుకుని ఆ చర్యల తాలూకు నివేదిక తమకు పంపాల్సిందిగా గత జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పంపిన నోటీసులో స్పష్టం చేసింది.
ఎస్సీ కమిషన్ నుండి నోటీస్ అందుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎస్సీలలో జరుగుతున్న మతమార్పిడులపై ఒక సర్వే తలపెట్టినట్టు వార్తలు వచ్చాయి. ప్రతి మండలం/మున్సిపాలిటీ స్థాయిలో ఎస్సీ కాలనీలలో ఉన్న చర్చిల వివరాలు, ఎస్సీలుగా ఉంటూ క్రైస్తవ ఆచార వ్యవహారాలు పాటిస్తున్న వారి వివరాలు ఈ సర్వే ద్వారా సేకరించడానికి సన్నద్ధమైనట్టు సమాచారం.
అయితే, నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం జాతీయ ఎస్సీ కమిషన్‌కు తమ సమాధానం పంపకపోవడంతో కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Source: Nijamtoday